02.01.2014 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 34
శ్రీసాయితో మధురక్షణాలలో మరొక మధురాతి మధురమైన క్షణం ఈ రోజు తెలుసుకొందాము. ముందుగా శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం 105, 106,107,108 శ్లోకాలను కూడా ఇచ్చి ఈ రోజుతో పూర్తి చేస్తున్నాను.
శ్రీవిష్ణుసహస్రనామం
105 వ. శ్లోకం: యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః |
యజ్ఞాంగ కృద్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ ||
తాత్పర్యం: నారాయణుని యజ్ఞము భరించువానిగా, కర్తగా, యజమానిగా మరియు అనుభవించువానిగా, ధ్యానము చేయుము. ఆయన సృష్టికి లయకారకుడుగా నున్నాడు. ఆహారము తినువారియందు, తినబడు ఆహారము నందునూ, తానే యజ్ఞ స్వరూపుడై దాగియున్నాడు.
106వ.శ్లోకం: ఆత్మయోనిః స్వయంజాతో వైఖానస్సామగాయనః |
దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ||
తాత్పర్యం: నారాయణుని తనయందే తాను పుట్టుక గలవానిగా, మరియూ తనకు తానే పుట్టువానిగా, తనను తాను తనలోనుండి త్రవ్వుకొనువానిగా, తన గానముగా తనకు సృష్టించుకొనుచున్న వానిగా ధ్యానము చేయుము. ఆయన ఈ లోకములన్నిటికి సృష్టికర్త, అధిపతి, రక్షించువాడు, మరియు నశింపచేయువాడు, ఆయన పాపములను నశింపచేయు దేవకీదేవి కుమారుడు.
107వ.శ్లోకం: శంఖభృన్నందకీ చక్రీ శార్ఞ్గధన్వా గదాధరః |
రధాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః ||
తాత్పర్యం: పరమాత్మను, శంఖమును, ఖడ్గమును, చక్రమును, ధనుస్సును, గదను ధరించినవానిగా ధ్యానము చేయుము. ఆయన రధచక్రమును చేత ధరించుటచే క్షోభింప చేయుటకు అలవికానివానిగా యున్నాడు. ఆయన తన ఆయుధములతో చక్కగా కొట్టగలిగినవాడై యున్నాడు.
108వ.శ్లోకం: వనమాలీ గదీశారీ శంఖీ చక్రీ చ నందకీ |
శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో భిరక్షతు ||
తాత్పర్యం: నారాయణుని వన పుష్పములతో కూడిన మాలను ధరించినవానిగా, గదను, విల్లును, శంఖమును, చక్రమును, ఖడ్గమును, ధరించి తన వైభవమును లేక మహిమలను వెదజల్లువానిగా, జీవశక్తి యను జలములకు అధిపతియైన వానిగా, వ్యాపించుట అను శక్తికధిపతిగా, మనయందు వాసుదేవుడను పేర నివసించువానిగా ధ్యానము చేసినచో అతడు అన్ని వైపులనుండి మనలను రక్షించును.
సంపూర్ణం