Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, September 20, 2011

బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు 10

0 comments Posted by tyagaraju on 7:19 AM



20.09.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి ఆశీర్వాదములు

ఈ రోజు సాయి బా.ని.స. బాబాతో అనుభవాలలో 10 వ అనుభవాన్ని తెలుసుకుందాము. బాబా పై మనం విశ్వాసము, నమ్మకము ఉంచుకుంటే ఏది జరిగినా ఆయన అనుగ్రహంతోనే జరుగుతుందన్నది మనకి తెలుస్తుంది. ఇది సాయి భక్తులకి మాత్రమె అవగతమవుతుంది. అందుచేతనే మనము శ్రీ సాయి సచ్చరిత్రని యెక్కువ శ్రధ్ధతో మనసు లగ్నం చేసి పారాయణ చేస్తే మంచి ఫలితం ఉంటుందన్నది యదార్థం.


బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు 10


శ్రీ సాయి సచ్చరిత్రలోని 40 వ అధ్యాయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము. అందులో శ్రీసాయి 1917 వ సంవత్సరం హోలీ పండుగ తెల్లవారుజామున హేమాద్రిపంతుకు కలలో చక్కని దుస్తులు ధరించిన ఒక సన్యాసి రూపములో దర్శనమిచ్చి, హేమాద్రిపంత్ యింటికి మధ్యాహ్న్నము భోజనానికి వస్తానని తెలియచేశారు. భోజన సమయానికి ముందుగా ఒక పటం రూపంలో శ్రీసాయి వచ్చి తమ మాటను నిలబెట్టుకున్నారు. ఇటువంటి అనుభవాన్నే నాకుకూడా కలిగించి, శ్రీ సాయి తాను జీవించి ఉండగా తన భక్తులను ఏవిథంగా అనుగ్రహించారో ఇప్పటికీ అదేరీతిలో అనుగ్రహిస్తున్నారని తెలియచున్నది.

అది 1996 వ సంవత్సరం మార్చ్ నెల. ఒక ఆదివారమునాడు వేకువజామునే సాయి మా ఫ్యాక్టరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపంలో దర్శనమిచ్చి, మధ్యాహ్న్నము మాయింటికి భోజనానికి వస్తానని చెప్పారు. ఈ విషయాన్ని నేను ఉదయము నా భార్యకు తెలియచేసి మధ్యాహ్ న్నం రాబోయె అతిధి కోసం కూడా వంట చేయమని చెప్పాను. నాభార్య కూడా సాయి భక్తురాలయినప్పటికీ , మా కుటుంబంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారికి రాకపోకలు లేకపోవడం వల్ల అది సాధ్యమేనా అని సందేహించింది. ఏది యేమయినప్పటికి తను మాత్రం వచ్చే అతిధికి కూడా వంట చేసి ఉంచింది. మధ్యాహన్నం భోజనం వేళకు నేను పిలవకుండానే యెవరయినా వస్తారని నా మనస్సుకు అనిపించింది.


మధ్యాహ్న్నము ఒంటిగంటయినా ఎవరూరాలేదు. , ఇక, యింత వేళ దాటి యెవరుమాత్రం వస్తారని చెప్పి, నా భార్య ఆకలితో ఉండలేక ఒంటిగంట పావుకు భోజనానికి ఉపక్రమించింది. నేను కొంచెం అసహనంతో ఉన్నాను. సాయి తప్పకుండా ఏదొ ఒక రూపంలో వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాను. నామనస్సు సాయి మీద నమ్మకము నా భార్యకు ఉన్న అపనమ్మకానికి మధ్య ఊగిసలాడటం మొదలెట్టింది. ఇక ఏమీ చేయలేక నా భార్య ఆదేశం ప్రకారం మధ్యాహ్న్నము రెండుగంటలకు భోజనానికి ఉపక్రమించాను. ఆ భోజన సమయంలో బాబా నామస్మరణే చేయసాగాను. నేను భోజనము పూర్తి చేసే సమయానికి మా యింటి కాలింగ్ బెల్లు మ్రోగింది. నేను యెవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తున్న సమయంలో నా భార్య తలుపు తెరిచి నా ఆఫీసులో నా దగ్గిర పనిచేస్తున్న కార్మికుడు శ్రీ సత్తెయ్య వచ్చినారని చెప్పింది.

సాధారణంగా నా ఆఫీసునుంచి నా యింటికి నన్ను కలవడానికి యెవరూ రారు. ఇదంతా కూడా సాయి ప్రేరణతో జరిగిందా అని మనసులో కలిగింది. నేను నా చేతులు కడుగుకుని అతనిని నా ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుండబెట్టి "ఏమిటి సత్తెయ్యా ! ఈ వేళకాని వేళలో నా యింటికి వచ్చినావని అడిగాను. అతను చెప్పిన మాటలు మీకిప్పుడు తెలియపరుస్తున్నాను. "సారూ, మధ్యాహ్న్నము నా డ్యూటీ పూర్తి చేసుకుని బస్సులో యింటికి వెడుతూ, మీ వీధిలోంచి వెడుతుండగా ఆకలితో ఉన్న నాకు తినడానికి మీయింట ఏదయినా దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీయింటికి వచ్చినాను."

రాత్రి కలలో శ్రీ సాయి మా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపములో దర్శనమిచ్చి నా దగ్గిర పనిచేస్తున్న ఒక సాధారణ కార్మికుడి రూపములో నా యింట భోజనానికి రావడము నన్ను ఆశ్చర్య పరిచింది. అప్పటికే నేను, నా భార్య భోజనము పూర్తి చేసి ఉన్నాము. మరి వచ్చిన అతిధికి ఎంగిలి భోజనము పెట్టడానికి మనస్సు అంగీకరించలేదు. అప్పుడు నా భార్య ఉదయము తాజాగా చేసిన జంతికలను ఒక ప్లేటులో తెచ్చి శ్రీ సత్తెయ్యకు తినమని కోరినది. నా భార్య చేసిన ఈ మంచి పనికి నా హృదయము ఆనందముతో నిండిపోయినది. ఆనాడు హేమాద్రిపంత్ యింటికి బాబా నీవు సన్యాసి రూపములో వస్తానని చెప్పి పటము రూపములో వచ్చి హేమాద్రిపంత్ ను వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించావు కదా, మరి ఈ రోజు నీవు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపములో వస్తానని చెప్పి ఒక సాధారణ కార్మికుడి రూపములో వచ్చినావు కదా ఏది యేమైనా నీ ఆశీర్వచనాలు మాకు ప్రసాదించమని వేడుకున్నాను. అదే సమయములో మా ఆఫీసు కార్మికుడు శ్రీ సత్తెయ్య నా భార్య పెట్టినటువంటి జంతికలను కడుపారా తిని ఒక గ్లాసు మంచినీరు త్రాగి ఒక చిరు నవ్వు చిందించి వెళ్ళివస్తానని చెప్పినాడు. శ్రీ సాయి శ్రీ సత్తెయ్య రూపములో మనింటికి వచ్చినారని నాభార్య చెప్పటము నాకు నాభార్యకు సాయిపై ఉన్న నమ్మకమును రెట్టింపు చేసింది.



సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు


Monday, September 19, 2011

బాబాతో సాయి బా.ని.స. అనుభవాలు 9

0 comments Posted by tyagaraju on 8:36 AM



19.09.2011 సోమవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత రెండు రోజులుగా కొన్ని స్వంత పనుల వల్ల ప్రచురించడానికి వీలు చిక్కలేదు. ఈ రోజు బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలలో 9 వ అనుభవాన్ని మీకి అందిస్తున్నాను.


బాబాతో సాయి బా.ని.స. అనుభవాలు 9



బాబా తన భక్తులకిచ్చిన హామీల గురించి 'సాయి సచ్చరిత్ర 15 వ అధ్యాయం లో ప్రముఖంగా చెప్పబడింది. ఒక్కసారి కనక యెవరినైనా బాబా తన భక్తునిగా స్వీకరిస్తే, అతను సప్త సముద్రాల అవతల యెక్కడ ఉన్నా సరే, బాబా ఆ భక్తునివెంట నీడలా నిరంతరం అనుసరిస్తూ ఉంటారు. ఒకసాయి భక్తునిగా నేనీ విషయాన్నిబలపరుస్తూ, నా జీవితం లో జరిగిన ఒక సంఘటనను మీకు తెలియపరుస్తున్నాను.

నా విదేశ యాత్రమొదటి అనుభవంలో దక్షిణ కొరియా ప్రయాణం గురించి వివరించాను. దానిని మరొక్కసారి తిరిగి గుర్తుకు తెచ్చుకుందాము. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన దానికి అనుబంధం. 06.05.1991 చాంగ్వాన్ పట్టణములోని హొటలు గదిలోకి ప్రవేశించగానె ఒక పెద్ద పరిమాణంలో ఉన్నకందిరీగ ఒకటి నాచుట్టూ రెండు సార్లు ప్రదక్షి ణాలు చేసి గదిద్వారమునుండి బయటికి వెళ్ళిపోయింది. నేను సియోల్ నుండి పుసాన్ పట్టణానికి విమానములో ప్రయాణిస్తూ "బాబా నేను చాంగ్వాన్ పట్టణానికి చేరే సమయానికి నాకంటె ముందుగా నీవక్కడకు చేరుకుని నాకు దర్శనమివ్వగలవా" అని బాబాని కోరాను. ఇప్పుడు ఈ గది తలుపు తెరవగానే నా చుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి గది ద్వారముగుండా బయటకు వెళ్ళిన కందిరీగ, బాబా కాదు కదా అని ఆలోచించాను. ఇదంతా నా భ్రమ అని భావించాను. ఈ విషయము ఒక సాధారణ వ్యక్తికి హాస్యాస్పదముగా అనిపించవచ్చును. సాయి భక్తులకి మాత్రము ఇందులోనిజం ఉన్నదని గ్రహించగలరు. సాయి సచ్చరిత్ర 46 వ అధ్యాయంలో యిటువంటి సంఘటన వివరింపబడింది. నానా సాహెబ్ చందోర్కర్, కాకా సాహెబ్ దీక్షిత్ బాబాను తమతోపాటు నాగపూరు, గ్వాలి యర్, గయ పట్టణాలకి రమ్మని కోరినప్పుడు బాబా అన్న మాటలను (46 వ అధ్యాయం 379 పేజీ) ఒక్కసారి గుర్తు చేసుకుందాము. "నా తరఫున మీరు శ్యామాను మీతో తీసుకుని వెళ్ళండి. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటే ముందుగానే అతనిని గయలో కలుసుకుంటాను. " ఈ మాటలను గుర్తుంచుకొనవలయును. ఏలనన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును.


చాంగ్వాన్ పట్టణములో నా ఆఫీసు వ్యవహారలన్నిటినీ ముగించుకుని 16.05.1991 నాడు తిరిగి భారత దేశానికి వచ్చే ప్రయత్నంలో ఉన్నాను. 16.05.1991 తెల్లవారుజామున 5 గంటలకు నేను కాకడ ఆరతి చదవడం పూర్తి అయిన తరువాత నేను చాంగ్వాన్ పట్టణములో హొటలు గదిలో ప్రవేసించిన సమయములో (ఆరోజున 06.05.1991) నా చుట్టూ ప్రదక్షిణాలు చేసిన కందిరీగ తిరిగి మరలా కాకడ ఆరతి పూర్తయినవెంటనే నాచుట్టూ రెండు ప్రదక్షిణాలు చేసి కిటికీ ద్వారా బయటికి వెళ్ళిపోయింది. ఈ సంఘటనకు నేను నిశ్చేస్టుడినయ్యాను. ఆనాడు శ్రీ సాయి గయలోని పాండా యింటిలో సాయి పటము రూపములో శ్యామాకు దర్శనమిచ్చి తనన్న మాటలను ఋజువు చేసుకున్నారు. చాంగ్వాన్ పట్టణము హొటలు గదిలో నా కంటె ముందుగా శ్రీ సాయి కందిరీగ రూపములో వచ్చి తిరిగి నాకంటె ముందుగా 16.05.1991 నాడు యిండియాకు బయలుదేరారని గట్టి నమ్మకమేర్పడింది. శ్రీ సాయి అన్ని జీవులలోనూ ఉన్నారనే మాటలు నాలో ప్రతిధ్వనించాయి. సాయి సర్వ వ్యాపి అని నిరూపించుకున్నారు.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List