26.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గత వారం రోజులుగా మన బ్లాగులో ప్రచురించలేకపోయాను.33వ. అధ్యాయం కొంచం పెద్దదిగా ఉండటంవల్ల దానిని మరలా టైప్ చేసి ప్రచురించడానికి ఆలశ్యమయింది..మధ్య మధ్యలో నెట్ కి కూడా అంతరాయం కలుగుతూ ఉంది..అందుచేత ఈ రోజు శ్రీవిష్ణుసహర్సనామం శ్లోకం ఇవ్వలేకపోతున్నాను..
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -
33వ. అధ్యాయము
05.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు ద్వారకామాయి ధుని నుండి వచ్చిన ఊదీ (బూడిద) యొక్క మహిమను వర్ణించినారు. నీవు శ్రీసాయి సత్ చరిత్ర చదువుచున్నపుడు ఊదీ మహిమను అర్ధము చేసుకోగలవు. నా నిత్య జీవితములో ఊదీని నుదుట ధరించటము నిత్య కృత్యముగా మారినది. నేను 1991 సంవత్సరము మే నెలలో కొరియా దేశము వెళ్ళినపుడు అక్కడ సామీ కంపెనీ జనరల్ మేనేజరు నన్ను ఒక ప్రశ్న వేసినారు. నేను చాలామంది భారతీయులను కలసినాను. కాని నుదుట ఎఱ్ఱ తిలకము బొట్టు, తెల్లటి విభూతి ధరించిన వ్యక్తిని కలియలేదు. మొదటిసారిగ మీనుదుట ఎఱ్ఱటి తిలకము, తెల్లటి విభూతి చూస్తున్నాను దీనికి అర్ధము ఏమిటి? ఎందుకు ఈవిధముగా నుదుట పెట్టుకోవాలి? వీటికి దయచేసి అర్ధమును తెలియచేయండి అని కోరినారు. నేను ఏమీ సమాధానము చెప్పాలి అనే ఆలోచనలో మునిగిపోయినాను. వెంటనే శ్రీసాయి సత్ చరిత్రలోని 33వ. అధ్యాయములో శ్రీసాయి చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినవి. "ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచ భూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమై పోయి బూడిదయగును." వెంటనే నేను యిచ్చిన సమాధానము ఇదీ - "నేను ధరించిన ఈ ఎఱ్ఱని తిలకము నాలోని ప్రాణానికి గుర్తు. నాలోని ప్రాణము పోయిన తర్వాత ఈశరీరము మంటలలో బూడిద అగుట ఖాయము. ఈసత్యాన్ని అనుక్షణము గుర్తు చేసుకోవటానికి ఎఱ్ఱ తిలకము బొట్టు, విభూతి పట్టీని ధరించుతాను."