28.11.2013 గురువారం (దుబాయి నుండి)
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయితో మధురక్షణాలలో మరొక మధురక్షణం తెలుసుకుందాము. నిన్న మధురక్షణం చదివారుకదా.. ధైర్యం కోల్పోకుండా బాబా మీదనే భారం వేసిన దంపతుల గురించి చదివారు. ఈ రోజు కూడా ఆపద సమయం లో కూడా ఎంత సహనంతో ఉండాలో వివరిస్తుంది. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 97వ.శ్లోక, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ||
తాత్పర్యం : పరమాత్మను భయంకరము కానివానిగా, చుట్టలుగా చుట్టుకొని యున్నవానిగా, చక్రమును ధరించినవానిగా, ధ్యానము చేయుము. ఆయన సమస్తమునూ జయించి ఆక్రమించును. ఆయన వాక్కు శాసనము. ఆయన తన వాక్కుకతీతముగా నుండి తానుచ్చరించిన ప్రపంచమును తనయందే ధరించును. చల్లదనము, మరియు రాత్రి కూడా ఆయన రూపములే.
శ్రీసాయితో మధుర క్షణాలు - 30
నాయందెవరి దృష్టో వారియందే నా దృష్టి
సాయి సుధ మాసపత్రికనుండి
నవంబరు 7వ.తేదీ 1986 సంవత్సరంలో నేను మాబంధువుల యింటికి వెడదామని విశాఖపట్నం బయలుదేరబోతుండగా కాకినాడనుండి నామేనల్లుడు ఫోన్ చేశాడు. అతని రెండవ కొడుకు శీరం సాయి కల్యాణ్ (వయస్సు 22 సం.) కు సీరియస్ గా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పడంతో కాకినాడకు బయలుదేరి 8వ.తారీకు ఉదయానికి చేరుకున్నాను.