భక్తి నివేదన
20.04.2011 బుథవారము
సాయి బంథువులందరకు బాబా వారి శుభాశీశ్శులు. ఈ రోజు మనము మరికొంత భక్తి సమాచారాన్ని గురించి తెలుసుకుందాము.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
భక్తి నివేదనదేవునియందు భక్తి కలగడం మనసు చేసిన పుణ్యం
భగవంతుని అర్చించడం చేతులు చేసిన పుణ్యం
దేవాలయానికి వెళ్ళడం కాళ్ళు చేసిన పుణ్యం
పరమాత్ముని చూడటం కళ్ళు చేసిన పుణ్యం
భగవంతుని స్తుతులు వినటం చెవులు చేసిన పుణ్యం
ఇలా చేయడం అనేది పూర్వ జన్మలో మనము చేసుకున్న పుణ్యం
మనలో బ్రహ్మచారులు ఉన్నారు, గృహస్తులు ఉన్నారు. గృహస్తులైతే సంసారంలో తామరాకుమీద నీటి బొట్టులా ఉండాలి. ఇక్కడ మీకొక ప్రశ్న ఉదయించవచ్చు. బ్రహ్మచారులు ఉండకూడదా అని. ఉండవచ్చు. భగవంతుని సామీప్యాన్ని కోరుకునేవారందరూ అలా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.
మన సద్గురువులు హృదయ స్థానంలో థ్యానం చేయమని చెప్పారు. ఈ హృదయ చక్రంలో థ్యానం చేసుకోవడం వల్ల విశేషమయిన లాభాలున్నాయి. ఈ హృదయ స్థానం మొత్తం శరీరమంతటికీ రక్త ప్రసరణ చేసేది అయి ఉండటం వల్ల ఆ స్థానంలో భగవన్నామము కనక ఇమడబడి ఉంటే, అక్కడినుంచి శరీరమంతటా వ్యాపించే రక్తంలో ఆ భావమే యిమిడి ఉంటుంది. దీని వలన శరీరంలోని ప్రతి భాగం భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి ఉపకరిస్తుంది.
ఇక రెండవ విషయమేమంటే హృదయం భావనల కేంద్రం. మంచి, చెడు భావాలు హృదయం నుంచే పుడతాయి. పరోపకారం చేయాలని యితరులకు సేవ చేయాలని విశ్వమంతటిని ప్రేమించాలనీ, యిటువంటి మంచి గుణాలయొక్క అవసరం యెంతయినా ఉంది. ఈ గుణాలు ఆథ్యాత్మిక మార్గంలో ఉండవలసినవే.
మూడవ విషయమేమంటే ఆత్మయొక్క స్థానం హృదయం యొక్క గృహాంతరాళల్లో ఉందని చెపుతారు.
మరి యిటువంటి పవిత్రమైన హృదయంలో మనం మన సాయికి బంగారు సిమ్హా సనం వేసి ప్రతిష్టించుకోవాలా వద్దా?
యిప్పుడు మన ఇల్లు ఉందనుకోండి. మనం ప్రతిరోజూ యేమి చేస్తున్నాము. రోజూ పొద్దున్న సాయంత్రము ఇల్లు ఊడ్చుకుని శుభ్రం చేసుకుంటున్నాము. మనం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము స్నానం చేసి మంచి దుస్తులు థరించి పరిశుభ్రంగా ఉంటున్నాము. మరి మన మన్సు పరిశుభ్రంగా ఉండాలంటే యేమి చేయాలి? మంచి మనసులోనే కదా భగవంతుడు నివాసముండేది. అందుచేత ఆథ్యాత్మికత భావాలను పెంచుకోవాలి. ఆథ్యాత్మికత అనే చిన్న మొక్క ప్రేమ అనే క్షేత్రంలో పెరుగుతుంది. యే మానవుడి హృదయంలో ప్రేమ ఉండదో అక్కడ ఆ మొక్క వృథ్థి చెందదు. అందుచేత హృదయంలో ఉన్న కల్మషాన్నంతా తీసివేయాలి. నమ్మకం అనే నీటిని పోయాలి. దైవత్వం అనే బీజాన్ని నాటాలి. క్రమశిక్షణ అనే కంచె వేయాలి. నిలకడ లేక థృఢత్వం, స్థిరత్వం అనే మందులను వేయాలి. ఇవి మనలోని చెడు ఆలోచనలని తరిమి వేసే మందులుగా ఉపయోగపడాలి. అప్పుడే మనలో జ్ఞానమనే పంట పండుతుంది. మనలో ఉండే తాత్కాలికంగా ఉన్న బంథాలు విడిచి వెళ్ళిపోతాయి. ప్రేమ, దయ, జాలి, భగవద్భక్తి లేని హృదయం యెడారి లాంటిది. ఇవేమీ లేని మానవునివల్ల సమాజానికి యేవిథమైన ఉపయోగము లేదు. యెడారి ఉందనుకోండి. దాని వల్ల యేవిథమైన ఉపయోగం లేదు. నీరు, నీడ యేమీ ఉండవు. అనుదుచేత మనం ముందర మన మనసును పరిశుభ్రం చేసుకుని అందులో సాయిని ప్రతిష్టించుకుని పూజిస్తూ ఉంటే మనవల్ల మన యితర సాయి బంథువులకే కాకుండా అందరికీ ఉపయోగం.
కొంతమంది, యజ్ఞాలు చేసే వాళ్ళని, దేవాలయాలకు వెళ్ళేవాళ్ళని, ఆథ్యాత్మిక ఉపన్యాసాలు చేసేవాళ్ళని, వినేవాళ్ళని చూసి వేళాకోళం చేస్తారు. యెక్కువగా నాస్తికులు చేస్తూ ఉంటారు. వాళ్ళు భగద్భక్తిలోని తియ్యదనాన్ని ఆస్వాదించలేరు. వారికి ఆ అనుభూతి కలగనందుకు మనం వారిమీద జాలి పడాలి. వారేమి కోల్పోతున్నారో వారికి తెలియదు. కొంతమంది గుళ్ళో విగ్రహాన్ని పూజించడం కూడా అవివేకమంటారు.
గుడిలో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అందుచేత అక్కడ భగవంతునియొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలో ప్రవేశించాలంటే గుడిలో ఉన్నంత సేపూ మన దృష్టి అంతా దేవునిమీదే ఉండాలి. మనలో బయటి ఆలోచనలు యేమీ ఉండకూడదు. ఈ మథ్య సెల్ ఫోనులు వచ్చాయి. వాటి వల్ల యితరులకూ ఇబ్బందే. గుడిలో ఉన్నంతసేపూ మనకీ దానికి విడదీయరాని బంథం ఉండకూడదు.
తక్కువ సామాను, సుఖవంతమైన ప్రయాణం అని మనకందరకూ తెలుసు. అల్లాగే తగ్గించుకున్న కోరికలు, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి, అనుబంథాలు కనక తగ్గించుకుంటే మనం చాలా సంతోషంగా, సుఖంగా ఉంటాము. మనలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి.
మంచి మనసుకు మంచి రోజులు.
భగవంతుడు లేని జీవితం ఉపాథ్యాయుడు లేని పాఠశాల వంటిది. విద్యుశ్చక్తి లేని తీగలాంటిది. ఆత్మ లేని శరీరంలాంటిది. భగవంతుడు మనందరిలో ఉన్నాడు. మన చుట్టూ ఉన్నాడు, పక్షులు, మొక్కలు మనకంటికి కనపడే అన్నిటిల్లోనూ ఉన్నాడు.
మనసే మందిరం చేసుకుని బాబాని అందులో ప్రతిష్టించు. అంతటా సాయి కనపడతాడు. అందరిలో సాయిని దర్శించగలవు. సాయి పిలిస్తే పలుకుతాడు. మన సాయి భక్తులందరూ ఆ సాయి చెప్పిన మాటలని యెప్పుడు మననం చేసుకుంటు సాయిని దర్శింతురుగాక.
మన సాయితో సత్సంగం యెన్నో జన్మల అనుబంథంసర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.