16.11.2013 శనివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 26
రెండురోజుల క్రితమే హైదరాబాదునుండి నరసాపురం రావడం జరిగింది. దాని వల్ల, యింకా మరి అనువాదం చేయడంలోను కాస్త ఆలశ్యమయింది. మరలా 19వ.తారీకున హైదరాబాదు ప్రయాణం, తరువాత 22వ.తారీకున దుబాయికి ప్రయాణం. అందుచేత ప్రచురణకి కొంత ఆలశ్యం జరుగుతుంది. మరలా దుబాయినుండి యధాప్రకారంగా బ్లాగులో ప్రచురణ కొనసాగుతుంది. శ్రీసాయితో మధురక్షణాలలోని ప్రతీ క్షణం అద్భుతమే. మరలా మరొక్కసారి యింతకుముందు ప్రచురించిన లీలలన్నీ చదువుకొని బాబా చెంతనే ఉన్నట్లుగా అనుభూతిని పొందండి.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 93వ.శ్లోకం, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం: సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః |
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ప్రీతివర్ధనః ||
తాత్పర్యం: పరమాత్మను సత్వస్ఠితిగా మరియూ మనస్సు స్వభావమూ సాత్వికమైనవానిగా, సత్యముగా, సత్యధర్మముల కంకితమైనవానిగా, మనయందు ప్రియముగల అభిప్రాయముగా, ధ్యానము చేయవలెను. ఆయనను అట్టి అభిప్రాయముగానే అర్చన చేయవలెను. ఆయన అర్చనగనే తెలియబడుచున్నాడు. ఆయనకు అర్చన వలననే జీవులపై ప్రీతి కలుగుతున్నది. అంతేగాక యితరులకు తనయందు ప్రీతిని కలిగించి దానిని వృద్దిపొందించుచున్నాడు.
శ్రీసాయితో మధురక్షణాలు - 26
బాబా అప్పుడే కాదు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు
సంవత్సరం క్రితమే నేను బాబా గురించి విన్నాను. అదే సమయంలో ఒకరు నాకు శ్రీసాయి సత్ చరిత్రను బహూకరించారు. కొన్ని పేజీలు చదివి తరువాత మానేశాను. బాబా చేసిన అద్భుతాలు నమ్మదగినవిగా లేవనే కారణంతో కాక, నిరాశతో ఉన్ననాకు ఒక గురువు ఆవశ్యకత ఉన్న నాలాంటివాడికి అవి ఏవిధంగానూ ఉపయోగం కాదనే ఉద్దేశ్యంతో మానేశాను. కొన్ని నెలల తరువాత రాజసులోచనగారితో పరిచయం కలిగింది. ఆమెకు బాబామీద సంపూర్ణ విశ్వాసం ఉంది.