19.04.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
గత రెండు రోజులుగా ప్రచురణకు కొంత అంతరాయం కలిగింది.విపరీతమయిన కరెంటుకోత, ఇన్వర్టర్ ఉన్నా నెట్ కనెక్షన్ ప్రతి అయిదు నిమిషాలకు అంతరాయం కలగడం వల్ల ప్రచురించలేకపోయాను.. ఈ రోజు శ్రీ విష్ణుసహస్ర నామం 66వ.శ్లోకంతో ప్రారంభిస్తున్నాను.
శ్రీవిష్ణు సహస్ర నామం 66వ.శ్లోక, తాత్పర్యం
శ్లోకం: స్వక్షస్స్వంగ శ్శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్చిన్న సంశయః ||
తాత్పర్యం: పరమాత్మను చక్కని నేత్రములు, అవయవములు కలవానిగా, నూరు విధముల యితరులకానందము కలిగించువానిగా, జీవుల కానందము కలిగించు వృషభరాశిగా, అన్నిటియందలి కాంతిగా, గణములకు అధిపతియైనవానిగా, ఆత్మచే అన్నిటినీ నడుపువానిగా, మరియూ లోబరచుకొన్నవానిగా, మంచి పేరు మరియూ కీర్తి కలవానిగా, సందేహము నివృత్తి చేయువానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 32వ.అధ్యాయం
04.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో శ్రీహేమాద్రిపంతు గురు శిష్యుల సంబంధము అనుబంధములపై చాలా చక్కగా వివరించినారు. శ్రీ సాయి తనకు తన గురువుకు మధ్య ఉన్న అనుబంధమును చక్కగా వివరించి చెప్పినారు. ఈ విషయములో నేను నీకు ఎక్కువగా చెప్పను కాని ఒకటి రెండు మాటలు చెబుతాను కొంచము విను.