04.10.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులారా! నేను 30.09.2013 న బ్యాంకు సర్వీసునుండి రిటైర్ అయ్యాను. ఈ సందర్భంగా కొన్ని పనులవలన ప్రచురణకు ఆలశ్యం జరిగింది. ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలో 21వ. లీలను అందిస్తున్నాను...ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 88వ.శ్లోకం, తాత్పర్యం..
శ్రీవిష్ణుసహస్రనామం 88వ.శ్లోకం
శ్లోకం: సులభః సువ్రతః సిధ్ధః శత్రుజిత్ శత్రుతాపనః |
న్యగ్రోధోదుంబరో శ్శ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ||
తాత్పర్యం: పరమాత్మను సులభముగా పొందవలెనన్నచో, పవిత్రమైన జీవితమును గడుపుచు, వ్రత నియమములాచరించుచూ, అశ్వత్థ వృక్షము క్రింద జీవించుచూ, మేడి పండును తిని, జమ్మి ఆకులు నానబెట్టిన నీటిని త్రాగుచుండవలెను. ఇట్టి నియమముతో కూడిన ధ్యానమును వ్రతముగా నాచరించువానికి పరమాత్మ వారి అంతశ్శతృవులను జయించి నిర్మూలించును. ఆయన ఆంధ్రుడైన చాణూరుడను వానిని సం హరించెను. పైన చెప్పిన వృక్షముల సాన్నిధ్యమున వ్రత నియమముల నాచరించుచూ, నారాయణుని ధ్యానము చేయువానికి అన్ని సిధ్ధులునూ లభించును.
శ్రీసాయితో మధురక్షణాలు - 21
తన భక్తుడిని రక్షించడానికి బాబా లాయరుగా ప్రవేశం
హైదరాబాదునుండి ప్రారంభింపబడిన ద్విభాషా మాసపత్రిక సాయిప్రభలో దీనికి సంబంధించిన బాబా లీల ప్రచురింపబడింది. శ్రీసాయి సత్ చరిత్రలో (33వ.అధ్యాయం) జామ్నేర్ లో టాంగావాలాగా బాబా కనిపించిన సంఘటన మనకు కనపడుతుంది. మన సమస్యలను తీర్చటానికి బాబా వివిధరూపాలలో వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి శ్రీసాయి భక్తుడయిన ఒక లాయరుగారు (శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారు) తన క్లయింటు కేసు వాదించడానికి రాలేకపోయిన సందర్భంలో రేపల్లె జిల్లా మున్సిఫ్ కోర్టులో శ్రీసాయినాధుడు శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారి రూపంలో వచ్చి కేసు వాదించారు.