04.02.2012 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఏజన్మలోని అనుబంధమో
ఈ రోజు ఒక అద్భుతమైన బాబా లీలను తెలుసుకుందాము. ఏనాటి జన్మలోనో ఆయనతో ఉన్న అనుబంధం ఈ జన్మలో మనలని ఆయనకు దగ్గరగా చేసుకుంటారు. ఆయన చేసే పధ్ధతి కూడా చాలా విచిత్రంగా, నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఆయన మన ఎదుటవున్నా మనం గుర్తించలేము. ఒకవేళ బాబాయే స్వయంగా మనకు కనిపించినా ఈయనెవరండీ బాబూ బాబా వేషం వేసుకుని వచ్చారు అని అనుకుంటాము. అందుకనే బాబావారు ప్రతీ మనిషిలోనూ, జీవిలోనూ తనని చూడమన్నారు. మాయ మనలని ఆయన ఉనికిని గుర్తించకుండా చేస్తుంది. ఆ మాయ తొలగాలంటే సత్ చరిత్ర పారాయణ చేస్తూ ఆయన చెప్పిన విషయాలని ఎప్పుడు మనసులో గుర్తుంచుకుని ఆయన లీలలను, కధలను మననం చేసుకుంటూ ఉండాలి.
తనకు కలిగిన ఈ అనుభవాన్ని శ్రీ రామకృష్ణగారు విశాఖపట్నంలో సత్సంగం లో చెప్పారట. దానిని విశాఖపట్నం నుంచి శ్రీమతి నౌడూరు శారదగారు నాకు టెలిఫోన్ ద్వారా వివరంగా చెప్పడం జరిగింది. దానిని యధాతధంగా మీముందుంచుతున్నాను. ఇక ఈ అద్భుతమైన బాబా లీలను చదవండి.
శ్రీ రామకృష్ణగారు విశాఖపట్నం పోర్ట్ లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆయన ప్రతీరోజు ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో ఆయనకు ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువకావడం తో తను ధ్యానం చేసుకోవడానికి వీలు కుదరటంలేదనే కారణంతో, యింకా 12 సంవత్సరాలు సర్వీసు ఉండగానే స్వచ్చందంగా పదవీవిరమణ చేసారు. ఆయనకు బాబా అంటే నమ్మకం లేదు. కాని ఆయన భార్యకు బాబా అంటే అపరిమితమైన భక్తి. ఆవిడ ప్రతీరోజు తెల్లవారుజామునే లేచి బాబా పూజలూ, సప్తాహాలు చేసుకుంటూ ఉండేవారు. ప్రతీరోజు ఏదో ఒక ప్రసాదం వస్తోంది కదా అని ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు.
వీరికి సంతానం లేదు. వారొక అబ్బాయిని పెంచుకుంటున్నారు. అతను యింజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండేవాడు. అతనికి యింట్లో చిల్లర డబ్బులు ఎక్కడ కనపడినా తన డిబ్బీలో వేసేసుకుంటూ ఉండేవాడు. తల్లితండ్రులు "ఒరేయ్ ! యింట్లొ చిల్లర కావాలంటే ఉండటల్లేదురా" అని అంటూ ఉండేవారు.
రామకృష్ణగారు ఒకరోజు తెల్లవారుజామునే వ్యాహ్యాళికి వెడుతున్నారు. ఆయనకు దారిలో రోడ్డుమీద రెండురూపాయల నాణెం కనపడింది. చుట్టుప్రక్కల ఎవరూ లేరు. ఆరోజు లక్ష్మివారం, లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేయడమెందుకని ఆయన ఆ రెండురూపాయల నాణెం తీసుకుని, యింటికి తిరిగి వచ్చారు. ఆయన ఆనాణాన్నియింట్లో ఉన్న బల్లమీద పెట్టారు.
ఒకరోజు ఆయన మేడమీద ఉండగా మధ్యాహ్న్నం ఒక సాధువు వచ్చి బిక్ష అడిగాడు. భార్యకు బాబా అంటే భక్తి ఉన్నందువల్ల, ఆయన భార్యను పిలిచి సాధువుకు బియ్యం వేయమని చెప్పారు. కాని ఆ సాధువు బియ్యం వద్దు, డబ్బులు ఇవ్వమన్నాడు. రామకృష్ణగారు జేబులో చేయిపెట్టి చూస్తే అన్ని పది రూపాయల నోట్లు ఉన్నాయి. అపుడాయన ఆ సాధువుతో చిల్లర లేదని చెప్పారు. అపుడా సాధువు "ఒక రోజు గురువారమునాడు నీకు దారిలో రెండురూపాయల నాణెం దొరికింది. దానిని యింట్లో బల్లమీద పెట్టావు. దానిని తెచ్చి యివ్వు" అన్నాడు. రామకృష్ణగారు కిందకి వచ్చిబల్లమీద ఉన్న రెండు రూపాయల నాణెం తీసి ఆ సాధువుకు ఇచ్చి, తిరిగి మేడమీదకు మెట్లు ఎక్కుతూ, ఆఖరి మెట్టు ఎక్కి వరండాలోకి వెడుతూండగా ఆయనకి హటాత్తుగా గుర్తుకువచ్చింది. తనకి రెండురూపాయలు దొరికినట్లు ఆ సాధువుకు ఎలా తెలుసు? పైగా అది కూడా తనయింట్లో బల్లమీద ఉందని ఎలా తెలిసింది? ఆయన వెంటనే వెనక్కి తిరిగి కిందకి చూసారు. అక్కడ ఆ సాధువు కనపడలేదు. వెంటనే కిందకి దిగివచ్చి భార్యకు చెప్పగా, ఆమె ఆవచ్చిన సాధువు బాబా అన్నారు. వెంటనే యిద్దరు తలుపులు దగ్గరగా వేసి వీధిలోకి వచ్చి అన్నివైపులా చూసారు. కాని ఆ సాధువు ఎక్కడా కనపడలేదు. అప్పటినుంచి ఆయన కూడా బాబాకి భక్తుడయారు. యిన్నిరోజులుగా బల్లమీద ఆ రెండురూపాయల నాణెం అలా ఉన్నా గానీ వారి అబ్బాయికూడా దానిని తన డిబ్బీలో వేయలేదు. అదికూడా అతని కంట పడి ఉండకపోవచ్చు.
యిలా ఉండగా రామకృష్ణగారికి విపరీతమైన క డుపునొప్పి వస్తూ ఉండేది. ఆయన బంధువు ఒకరు డాక్టరు. 2006 వ. సంవత్సరంలోఒకరోజున చాలా సీరియస్ అయింది. ఆయన బంధువు రామకృష్ణగారిని కాకినాడ ఆస్పత్రిలో చేర్పించి ముగ్గురు డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచారు. రామకృష్ణగారు మగతగా ఉండేవారు. డాక్టర్స్ ముగ్గురూ వస్తూ ఆయనను పరీక్షిస్తూ ఉండేవారు. రామకృష్ణగారికి అప్పుడప్పుడు కొంచెం తెలివి వచ్చి చూసినప్పుడు తన కాళ్ళవద్ద ఒక డాక్టరు తెల్లని దుస్తులు ధరించి కూర్చుని వుండటం చూసేవారు. తనకు సేవ చేయడానికి డాక్టరును నియమించి ఉండవచ్చని అనుకున్నారు. ఒకరోజున ఆయన అలా గదిలో మగతగా ఉన్నప్పుడు, ఒక కార్డియాలజిస్ట్ ఆగదివైపు వెడుతూ, రామకృష్ణగారి శరీరం నీలం రంగులోకి మారుతుతూఉండటం చూసి వెంటనే ఒక నర్శ్ ని పిలిచి ఆక్సిజన్ పెట్టించారు. ఆ సమయంలో అటువైపు ఒక కార్డియాలజిస్ట్ రావలసిన సందర్భంకూడా లేదు. మరి ఆయన అగదివైపు ఎలా వచ్చారో తెలియదు. 3 వారాల తరువాత రామకృష్ణగారు కోలుకున్నాక తనకు వైద్యం చేసిన ముగ్గురు డాక్టర్స్ కి కృతజ్ఞ తలు తెలుపుతూ , నాలుగవ డాక్టర్ గురించి అడిగారు, ఆయనకి కూడా ధన్యవాదాలు చెపుదామని. అప్పుడా డాక్టర్స్, మీకు వైద్యం చేసి కేసు షీట్లొ అన్నీ రాసినది మేము ముగ్గురమే. నాలుగవ డాక్టర్ అసలు ఎవరూ లేరు, కార్దియాలజిస్ట్ కూడా ఎవరో తెలియదు అన్నారట. అప్పుడాయనకు ప్రగాఢంగా నమ్మకం ఏర్పడింది. తనవద్ద తెల్లని దుస్తులలో కూర్చుని వున్న నాలుగవ డాక్టర్ బాబా తప్ప మరెవరూ కాదని.
ఇప్పుడు వివరించిన బాబా లీలకు డాక్టర్ సాయి అని పేరు పెట్టవచ్చు. కాని ఆ పేరు చదవగానే బాబా లీల చదువుతున్నపుడు వచ్చిన నాలుగవ డాక్టర్ బాబాయె అని పాఠకులకు ముందే తెలిసిపోతుంది. అందులో థ్రిల్ ఉండదు. అందుచేత వేరె పేరు పెట్టడం జరిగింది.(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు