19.09.2015 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆంగ్లమూలం : లెఫ్టినెంట్ కల్నల్ : ఎం.బీ.నింబాల్కర్
తెలుగు అనువాదం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తాత్యాసాహెబ్ నూల్కర్ - 4 (నాలుగవ భాగం)
తాత్యాసాహెబ్ అస్వస్థత - బాబాసాహెబ్ సేవ
శ్రీసాయి, బాబాసాహెబ్ ను షిరిడీ విడిచివెళ్ళవద్దని చెప్పిన పదిహేను రోజుల తర్వాత, తాత్యాసాహెబ్ నడుము క్రింద భాగాన రాచకురుపు (కార్బంకుల్) కలిగింది. అసలే మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తాత్యాసాహెబ్ నూల్కర్. ఆకారణంచేత రాచకురుపుతో బాధ ఎక్కువ కాసాగింది. షిరిడీ గ్రామములో సరైన డాక్టర్లు కూడా లేరు. తండ్రికి సేవ చేయడానికి తాత్యాసాహెబ్ నూల్కర్ పెద్ద కుమారుడు డాక్టర్ వామనరావు నూల్కర్ ఎల్.ఎం.ఎస్. రప్పించబడ్డారు. షిరిడీ గ్రామంలో ఇంగ్లీషు మందులు దొరకవు. బొంబాయినుండి మందులు, శస్త్ర పరికరాలు తెప్పించి, బాబాసాహెబ్ సహాయముతో డాక్టర్ వామనరావు ఆపరేషన్ పూర్తి చేశారు.