18.09.2015 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆంగ్లమూలం: లెఫ్టినెంట్ కల్నల్ ఎం.బీ.నింబాల్కర్
తెలుగు అనువాదం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తాత్యాసాహెబ్ నూల్కర్ - 3 (మూడవభాగం)
షిరిడీలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలనె కోరిక:
తాత్యాసాహెబ్ నూల్కర్ పండరీపురంలో సబ్ జడ్జిగా పని చేస్తూ ఉండగా విఠోబామందిరంలో హారతి హక్కులు ఎవరికి చెందాలనే విషయంపై న్యాయనిర్ణయం ఇవ్వవలసి వచ్చింది. శ్రీతాత్యా సాహెబ్ నూల్కర్ భగవంతునిపై భక్తితో, న్యాయమైన తీర్పునిచ్చారు. ఆయన తీర్పు కొందరు వ్యక్తులకు నచ్చలేదు. ఆయన తీర్పు మందిరంలోని కొందరు వ్యక్తులలో కలతలు రేపింది. శ్రీతాత్యాసాహెబ్ ఆతీర్పు అనంతరం కోర్టుకు శెలవుపెట్టి తన కుటుంబ సమేతంగా షిరిడీకి చేరుకొన్నారు. షిరిడీకి చేరుకొన్న వెంటనే ద్వారకామాయికి వెళ్ళి శ్రీసాయికి సాష్ఠాంగ నమస్కారము చేశారు. శ్రీసాయి ప్రేమతో "తాత్యాభా ఇక్కడ ఎన్నిరోజులు వుండటానికి వచ్చావు" అని అడిగారు. దానికి తాత్యాసాహెబ్ వినయంగా అన్న మాటలు "జీవితములో భగవంతుని సేవ చేసుకోలేకపోయినా భగవంతుని సేవలో తీర్పు ఇచ్చి ఇక్కడకు వచ్చాను. నీవు అనుమతి ఇచ్చిన ద్వారకామాయిలోని నాభగవంతుని సేవ చేసుకొంటూ నా శేషజీవితము గడుపుతాను" అన్నారు. ఈమాటలు విని శ్రీసాయి సంతోషముతో తన అనుమతిని ప్రసాదించారు.
చిన్ననాటి స్నేహితునితో కలయిక:
తాత్యాసాహెబ్ నూల్కర్, మరియు బాబా సాహెబ్ (అసలు పేరు నీలకంఠ రామచంద్ర సహస్రబుధ్ధి) చిన్ననాటి స్నేహితులు. ఇరువురూ పూనా హైస్కూల్ లో కలసి చదువుకొన్నారు. విచిత్రమైన పరిస్థితులలో ఇద్దరూ 30 సంవత్సరాల తరువాత షిరిడీలో కలుసుకొన్నారు. నిజానికి తాత్యాసాహెబ్ బాబాసాహెబ్ ని గుర్తించలేదు. కాని బాబాసాహెబ్ తాత్యాసాహెబ్ ని గుర్తించి (తాత్యాసాహెబ్ చిన్ననాటినుండి పొట్టిగా లావుగా ఉండేవారు) తన పేరు చెప్పగానే తాత్యాసాహెబ్ ఆనందంతో బాబాసాహెబ్ ని కౌగలించుకొన్నారు. ఇరువురు తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొన్నారు. తాత్యాసాహెబ్ కోరికపై బాబా సాహెబ్ తాత్యాసాహెబ్ యొక్క అతిధిగా అతని ఇంట ఉండటానికి అంగీకరించి, స్నానము చేసిన తరువాత ఇరువురు బాపు సాహెబ్ జోగ్ తో కలసి శ్రీసాయి దర్శనానికి వెళ్ళారు.
బాబాసాహెబ్ (నీలకంఠ రామచంద్ర సహస్రబుధ్ధి) శ్రీసాయికి సాష్ఠాంగ నమస్కారము చేస్తున్నపుడు శ్రీసాయి బాబాసాహెబ్ ను ఉద్దేశించి, "నీవు నీ చిన్ననాటి స్నేహితుడు తాత్యాసాహెబ్ సేవ చేసుకో" అన్నారు. ఈమాటలు అక్కడ ఉన్నవారికి చాలా వింతగా అనిపించాయి. వరసగా మూడురోజులు శ్రీసాయి ఈవిధముగా అన్నతర్వాత కూడా బాబాసాహెబ్ ఈవిషయాన్ని హాస్యాస్పద విషయంగానే భావించి తాత్యాసాహెబ్ నూల్కర్ తో "మిత్రమా నీగురువు ఆజ్ఞ ప్రకారము ఏవిధమైన సేవ నీకు చేయాలి" అనేవాడు. కాని తాత్యాసాహెబ్ ఈవిషయంపై గంభీరముగా ఆలోచించసాగారు. శ్రీసాయి మాటలను హాస్యాస్పదముగా తీసుకోవలదని తాత్యాసాహెబ్, బాబా సాహెబుతో అన్నారు. శ్రీసాయి మాటలలోని నిజాన్ని కాలమే వెల్లడించుతుందని అక్కడివారు భావించారు.
కొద్దిరోజులు షిరిడీలో గడిపిన తరువాత బాబాసాహెబ్ తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళటానికి నిశ్చయించుకొని శ్రీసాయి అనుమతిని కోరినప్పుడు, శ్రీసాయి అనుమతిని నిరాకరించి ఇంకా కొద్ది రోజులు ఉండమని ఆదేశించారు. ఈవిషయంలో బాబా సాహెబ్ శ్రీమాధవరావు దేశ్ పాండే (శ్యామా) సహాయమును అర్ధించారు. శ్యామా ఈవిషయాన్ని సాయితో ప్రస్తావించినపుడు శ్రీసాయి చికాకుతో అన్నమాటలు "శ్యామా, బాబాసాహెబ్ షిరిడీలొ ఒక ముఖ్యమైన పని నిర్వహించటానికి రప్పించబడినాడు. ఆపని పూర్తికాకుండా షిరిడీ వదలి వెళ్ళకూడదు. అందుచేతనే అతన్ని షిరిడీ వదలి వెళ్ళటానికి అనుమతిని నిరాకరించాను". శ్రీసాయి ఈవిధంగా అన్న తర్వాత శ్యామా కూడా ఏమీ చేయలేకపోయారు.
(రేపటి సంచికలో తాత్యాసాహెబ్ అస్వస్థత - బాబాసాహెబ్ సేవ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment