19.09.2015 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఆంగ్లమూలం : లెఫ్టినెంట్ కల్నల్ : ఎం.బీ.నింబాల్కర్
తెలుగు అనువాదం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తాత్యాసాహెబ్ నూల్కర్ - 4 (నాలుగవ భాగం)
తాత్యాసాహెబ్ అస్వస్థత - బాబాసాహెబ్ సేవ
శ్రీసాయి, బాబాసాహెబ్ ను షిరిడీ విడిచివెళ్ళవద్దని చెప్పిన పదిహేను రోజుల తర్వాత, తాత్యాసాహెబ్ నడుము క్రింద భాగాన రాచకురుపు (కార్బంకుల్) కలిగింది. అసలే మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తాత్యాసాహెబ్ నూల్కర్. ఆకారణంచేత రాచకురుపుతో బాధ ఎక్కువ కాసాగింది. షిరిడీ గ్రామములో సరైన డాక్టర్లు కూడా లేరు. తండ్రికి సేవ చేయడానికి తాత్యాసాహెబ్ నూల్కర్ పెద్ద కుమారుడు డాక్టర్ వామనరావు నూల్కర్ ఎల్.ఎం.ఎస్. రప్పించబడ్డారు. షిరిడీ గ్రామంలో ఇంగ్లీషు మందులు దొరకవు. బొంబాయినుండి మందులు, శస్త్ర పరికరాలు తెప్పించి, బాబాసాహెబ్ సహాయముతో డాక్టర్ వామనరావు ఆపరేషన్ పూర్తి చేశారు.
ఒక కురుపుకు ఆపరేషన్ చేసి కట్టు కట్టిన తర్వాత ఇంకొక కురుపు రాసాగింది. ఆవిధముగా మొత్తము పదకొండు రాచకురుపులు నడుము మీద, నడ్డిమీద, కాలి పిఱ్ఱల మీద
వచ్చాయి. మధుమేహము వ్యాధి వల్ల ఆపరేషన్ చేసినా ఆకురుపులు మానటం పెద్ద సమస్యగా మారిపోయింది. రాతింబవళ్ళు చిన్ననాటి స్నేహితుడు బాబాసాహెబ్ (నీలకంఠ రామచంద్ర సహస్రబుద్ధి) సేవ చేయసాగారు. స్నేహితులు యిద్దరు శ్రీసాయి అన్నమాటలలోని నిజమును గ్రహించారు.
వ్యాధిగ్రస్థుడైన తాత్యాసాహెబ్ కు శ్రీసాయి దర్శనము ఇచ్చుట:
దినదినానికి వ్యాధి ఎక్కువ కాసాగింది. శారీరకముగా విపరీతమైన బాధ అనుభవించుతున్నా, మానసికముగా ప్రశాంతంగా ఉన్నారు తాత్యాసాహెబ్ నూల్కర్. ప్రాపంచిక కోరికలకు అతీతంగా, ఆధ్యాత్మిక చింతనతో తన ఆఖరి రోజులు గడపసాగారు. మంచము మీద ఒక ప్రక్కనుండి ఇంకొక ప్రక్కకు తిరగవలెనంటే తిరగలేని స్థితిలో ఉన్నారు శ్రీనూల్కర్. అటువంటి స్థితిలో కూడా అనుక్షణము ద్వారకామాయిలోని విశేషాలను గురించి శ్రీసాయి గురించి అడిగి తెలుసుకొనేవారు. జలగాంలో ఉన్న తల్లిని, సోదరులను పిలవటానికి టెలిగ్రాం ఇవ్వటానికి అతని స్నేహితుడు బాబాసాహెబ్ సిధ్ధపడినప్పుడు తనకు ఎవరినీ చూడాలని లేదనీ, ఎవరికీ కష్ఠము కలిగించవద్దని, తనను ప్రశాంతముగా శ్రీసాయినామము జపించుతు ఉండనివ్వమని అన్నారు. తాత్యాసాహెబ్ వ్యాధిగ్రస్థుడై మంచమునుండి లేవలేని స్థితిలో ఉండి, శ్రీసాయిదర్శనమునకు వెళ్ళలేకపోతున్నానే అని బాధపడసాగారు. శ్రీసాయి ప్రతిదినము ద్వారకామాయినుండి సాఠేవాడా మీదుగా లెండిబాగ్ కు వెళ్ళేవారు. వారు సాధారణముగా ఎవరియింటికి వెళ్ళేవారు కాదు. శ్రీసాయి సాఠేవాడా దగ్గరనుండి లెండిబాగ్ కు వెళ్ళే సమయములో సాఠేవాడాలోనికి వచ్చి తనకు దర్శనము యిచ్చిన బాగుండును అనే కోరికతో జీవించసాగారు శ్రీనూల్కర్. శ్రీసాయిని దర్శించాలి అనే ప్రగాఢమైన కోరికతో తన కోరికను శ్రీసాయికి తెలియచేయమని తన పెద్దకుమారుడు డాక్టర్ వామన్ రావును ద్వారకామాయికి పంపించారు శ్రీనూల్కర్. తన తండ్రి కోరికను శ్రీసాయికి తెలియపర్చారు డాక్టర్ వామన్ రావు. ఆసమయంలో శ్రీసాయి ద్వారకామాయిలో చిన్న పిల్లలతో ఆటలు ఆడుతున్నారు.
డాక్టర్ వామనరావు కోరిక విని "తాత్యాభాకు తప్పక దర్శనము యిస్తాను. అల్లా భలాకరేగా" అని అన్నారు. తిరిగి చిన్నపిల్లలతో ఆటలు ఆడసాగారు. తన తండ్రి కోరిక ప్రకారం శ్రీసాయిని సాఠేవాడాకు తీసుకొనివెళ్ళటానికి ద్వారకామాయిలో నిలబడి ఉన్నారు డాక్టర్ వామన్ రావు.
(తరువాత ఏమిజరిగిందన్నది రేపు తెలుసుకుందాము)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment