25.02.2013 గురువారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మనబ్లాగులో ప్రచురణకు 10 రోజులు ఆలస్యం జరిగింది..క్షంతవ్యుడను..పొద్దుటే ఆఫీసుకు, వెళ్ళడం..తిరిగి ఇంటికి వచ్చినాక కొన్ని పనులవల్ల సమయం కుదరలేదు...
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 43,44 అధ్యాయములు
ఈ రోజు ముందుగా శ్రీవిష్ణు సహస్రనామం 75వ.శ్లోకం, తార్పర్యం తో ప్రారంభిస్తున్నాను..
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : సద్గతిః సత్కృతిః సద్భూతిః సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ||
తాత్పర్యం : పరమాత్మను మంచివారి మార్గముగా, మంచిపనిగా, మంచిగా, మంచియొక్క వైభవముగా ధ్యానము చేయవలెను. మంచివరి మార్గమునకు అంకితమయినవానిగా, శూరులు కూడిన సేనగా ధ్యానము చేయవలెను. యదువంశములో శ్రేష్టునిగా, మంచివారి యందు నివసించువాడగుటచే తన మంచి మార్గమును యమున ఒడ్డున ప్రసాదించువానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి,
43, 44 వ. అధ్యాయములు
15.02.1992
ప్రియమైన చక్రపాణి,
42,43,44వ.అధ్యాయములలో శ్రీహేమాద్రిపంతు శ్రీసాయిబాబా మహా సమాధి చెందటము గురించి వివరించినారు. అందుచేత నేను కూడా ఈ మూడు అధ్యాయములను రెండు ఉత్తరాలలో వివరించుచున్నాను. క్రిందటి ఉత్తరములో చివర్లో నాపిన తండ్రి శ్రీఉపాధ్యాయుల పేరేశ్వర సోమయాజులు గారు శ్రీసాయి దయతో మరణ శయ్యపై ఉండగా కుడా గృహప్రవేశము చేసిన సంఘటన వివరించినాను.