20.09.2014 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులకు ఈ రోజు బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన బాబా లీలను అందిస్తున్నాను. ఈ లీల సాయి లీల పత్రిక నవంబరు-డిసెంబరు 2007 వ.సంవత్సరములో ప్రచురితమయినది.
సాయిమహరాజ్ తో అనుభవాలు
బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లార్క్ గా పని చేస్తున్నాను. ప్రతీరోజూ ఆఫీసుకు నేను పాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెడుతూ ఉంటాను. బాంద్రాలోని నాస్నేహితులలో చాలామంది షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. షిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ' 'ప్రసాదం' ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నానుదిటిమీద ఊదీ రాస్తూ ఉండేవారు. నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నాఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని. బాబానుంచి పిలుపు వస్తే తప్ప నేను షిరిడీ వెళ్లదలచుకోలేదు.