15.09.2014 సోమవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కలలలో శ్రీసాయి - 9వ.భాగం
ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావుగారు చెపుతున్న కలలలో శ్రీసాయి ఆఖరి భాగం వినండి.
ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
బాబా తన భక్తులు అధ్యాత్మికంగా ఎదగడానికి, వారిలో వివేక వైరాగ్యాలను పెంపొందించటానికి కలలలో చక్కని అనుభూతులను ప్రసాదించేవారు.
శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో బాబా స్వయంగా చెప్పిన మాటలు "బ్రహ్మము నిత్యము. ఈ జగత్తు అశాశ్వతము. తల్లిగాని, తండ్రిగాని, పిల్లలు బంధువులు ఎవ్వరూ శాశ్వతముకారు. మనమందరమూ ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాము. ఒంటరిగానే నిష్క్రమిస్తాము."
శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పిన ఈమాటలను మొదట నేను నమ్మలేదు. 1993 జనవరి 6వ.తారీకున బాబా నాకలలో ఒక చక్కని దృశ్యాన్ని చూపించి మంచి సందేశాన్ని ప్రసాదించారు. ఆకలలో "నేను నా భార్య మాయిద్దరు పిల్లలతో రైలులో ఎక్కాను.
రైలు బండి కదలిన తరువాత టిక్కెట్ కలెక్టర్ వచ్చి మాటిక్కెట్టు చూశాడు. టిక్కెట్టు చూసి "మీరు కుటుంబ సమేతంగా ఎక్కవలసిన రైలు యిదికాదు. ఈరైలులో మీరొక్కరే ప్రయాణం చేయాలి"
అని చెప్పి నానుండి రెండు రూపాయలు దక్షిణ స్వీకరించాడు. తరువాత రైలు ప్రయాణం వివరాలను తెలియచేశాడు. మాయిద్దరి సంభాషణలను విన్న నాభార్య పిల్లలు నాతో సంప్రదించకుండానే అప్పుడే కదలిన రైలునుండి ప్లాట్ ఫారం మీదకు దూకేశారు.
నేను ఒక్కడినే ఆరైలు పెట్టెలో ప్రయాణం చేస్తూ రైలు ఆగిన తరువాతి స్టేషన్లో దిగిపోయాను. ఆస్టేషన్ మాస్టరు వద్దకు వెళ్ళి వెనుకటి స్టేషన్ కు ఫోన్ చేసి నాభార్యాపిల్లలను పిలవమని వేడుకొన్నాను. నామాటలకు ఆస్టేషన్ మాస్టరు చిరునవ్వుతో "ఆధ్యాత్మిక ప్రయాణంలో నీకు తోడు ఎవరూ రారు. ఒకసారి ప్రయాణం ప్రారంభించిన తరువాత వెనుకకు తిరగరాదు. ముందుకు సాగిపోవాలి" అన్నారు. అయినా నాభార్యాపిల్లలమీద ప్రేమతో రైలు పట్టాలవెంబడి వెనుక స్టేషన్ కు నడక ప్రారంభించాను.
ఇంతలో నావెనుకనే ఒక రైలు యింజను రాసాగింది. నాకు ముందు ఒక పెద్దగోడ ఉంది.
ఆరైలింజను వచ్చి గోడను బద్దలుకొట్టింది. నాకేవిధమయిన దెబ్బలు తగలలేదు. గోడకూలిపోయి ఉంది.
నాముందు రైలు పట్టాలు లేవు. నాముందు ఒక పెద్ద మైదానం ఉంది. దూరంగా మైదానం ఆకాశం రెండూ కలుస్తున్నట్లుగా ఉంది. ఏదో ఒక అదృశ్య శక్తి నన్ను ముందుకు నడిపించసాగింది. కొంత దూరం వెళ్ళినతరువాత నేను స్పృహతప్పి పడిపోయాను. నా ఆత్మ ఆకాశంలో పైన తిరగసాగింది.
ఈస్వప్నం ద్వారా బాబా నాలో ఆధ్యాత్మిక భావాలను కలిగించారు.
శ్రీసాయి సత్ చరిత్ర 6వ.అధ్యాయంలో హేమాద్రిపంత్ అన్న మాటలు "సంసారమనే సముద్రంలో జీవుడనే నౌకను సద్గురువు సహాయంతోనే సురక్షితంగా ప్రయాణం సాగిస్తుంది". బాబా యిదే సందేశాన్ని నాకు మార్చి 6వ.తా.1993 సం.లో ఒక స్వప్నంలో చూపించారు. నాకు వచ్చిన ఆ కల గురించిన వివరాలు మీకు తెలియచేస్తాను.
నేను నాభార్యా పిల్లలను రిక్షాలో కూర్చుండబెట్టుకొని రిక్షా తొక్కుతున్నాను. రోడ్డు గతుకులుగా ఉండటం వల్ల రిక్షాను మెల్లగా తొక్కుతున్నాను. ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. దారి సరిగా కనపడటంలేదు. నేను రిక్షా మెల్లిగా తొక్కడం నాపిల్లలకు నచ్చలేదు.
దాంతో వాళ్ళు రిక్షా దిగి వారిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈసంఘటనతో నాభార్య నాతో దెబ్బలాడి పరుషంగా మాట్లాడి నామనస్సుకు బాధ కలిగించింది. నేనిక ముందుకు సాగలేకపోయాను. ఆసమయంలో నేను పని చేస్తున్న ఫ్యాక్టరీలోని ఒక వృధ్ధ కారికుడు నావద్దకు వచ్చి "నేను మీరిక్షాను వెనుకనుండి ముందుకు తోస్తాను, ఆయాసపడకుండా మీరు రిక్షా త్రొక్కండి. మీఆఖరి శ్వాసవరకు మీరు ఈరిక్షాను తొక్కుతూ ఉండండి. నేను మీరిక్షా వెనుకనే ఉండి మీజీవన ప్రయాణంలో సహాయం చేస్తూ ఉంటాను". ఆవృధ్ధ కార్మికుడు చెప్పిన మాటలపై నమ్మకంతో నేను నాభార్యను తిరిగి రిక్షాలో కూర్చుండబెట్టుకొని నాజీవన ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించాను. నాజీవితంలో ప్రవేశించిన ఈ వృధ్ధకార్మికుడు నాసద్గురువు సాయిబాబా అని పూర్తిగా నమ్ముతున్నాను.
తరువాత బాబా నాకలలో ఒక ముఖ్యమయిన సందేశాన్నిచ్చారు. దానిని మీకిప్పుడు వివరిస్తాను.
"భగవంతుని దర్శించడానికి నువ్వు హరిద్వార్ వెళ్ళనవసరం లేదు. నీ మనోద్వారం తెరచి చూడు. హరి అక్కడే ఉన్నాడు." ఈసందేశాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకొంటూనే ఉంటాను. నేను యాత్రలు చేయలేకపోయానే అనే బాధ కలిగినపుడెల్లా బాబా చెప్పిన ఈ సందేశం నాకు ఓదర్పును కలిగిస్తుంది.
ఈకలియుగంలో పిలిస్తే పలికే దైవం ఎవరయినా ఉన్నారా అని ఎవరయినా ప్రశ్నిస్తే నేను వారందరికీ వినయంగా చెప్పే సమాధానం "ఆదైవం మన సద్గురువు షిరిడీ సాయిబాబాయే" అని చెబుతాను.
మనమందరం శ్రీసాయి శరణును పొంది, ప్రశాంత జీవనం కొనసాగించి ఆఖరికి మన గమ్యస్థానం చేరుకొందాము.
జై సాయిరాం
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment