20.09.2014 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తులకు ఈ రోజు బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన బాబా లీలను అందిస్తున్నాను. ఈ లీల సాయి లీల పత్రిక నవంబరు-డిసెంబరు 2007 వ.సంవత్సరములో ప్రచురితమయినది.
సాయిమహరాజ్ తో అనుభవాలు
బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లార్క్ గా పని చేస్తున్నాను. ప్రతీరోజూ ఆఫీసుకు నేను పాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెడుతూ ఉంటాను. బాంద్రాలోని నాస్నేహితులలో చాలామంది షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. షిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ' 'ప్రసాదం' ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నానుదిటిమీద ఊదీ రాస్తూ ఉండేవారు. నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నాఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని. బాబానుంచి పిలుపు వస్తే తప్ప నేను షిరిడీ వెళ్లదలచుకోలేదు.
ఈ విధంగా చాలా రోజులు గడిచాయి. అనేకమంది భక్తులు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని వర్ణించశక్యం కాని ఆయన లీలలను చెప్పసాగారు. తత్ఫలితంగా ముంబై, బాంద్రా, వాసి, విరార్, ఆగాషి, దహను, ఉంబర్గావ్ నుంచి కూడా ప్రజలు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడం ప్రారంభించారు. కాని నేను మాత్రం బాబా ప్రేరణ ఇస్తే తప్ప షిరిడి వెళ్ళకోడదనే నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.
ఇలా కొద్దిరోజులు గడిచాయి. ఒక రోజు గురువారము నాడు (ప్రతి గురువారం నేను ఉపవాసం ఉంటున్నాను) నాపనులన్నీ పూర్తయిన తరువాత నిద్రకుపక్రమించాను. ఈ రోజు బాబాను దర్శించుకోవాలనే భావం కలిగి నిద్రనుండి మేలుకొన్నాను. వేకువజామున నాకొక చెప్పనలవికాని దివ్య దర్శనం కలిగింది. ఉదయాన్నే టీ త్రాగి 8గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాల మీద బాస్ సంతకాలు తీసుకొన్నాను. నేనాయనని, షిరిడి వెడుతున్నాననీ సెలవు కావాలని అడిగాను. వెంటనే ఆయన అందుకు ఒప్పుకొని "సరే షిరిడీ వెళ్ళడానికి కాబట్టి నీకు 3,4 రోజులు సెలవు ఇస్తాను. నేను కూడా నాసిక్ లో ఉన్న మాబంధువుల ఇంటికి వెళ్ళాలి. మనిద్దరం ఒకే రైలులో వెడదాము." అన్నారు.
నేను 11 గంటలకల్లా ఇంటికి వచ్చి నా భార్యతో "ఈ రోజు బాబా నుంచి షిరిడీకి రమ్మనమని పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ్న్నం రైలుకు బయలుదేరుతున్నానని" చెప్పాను. ఆమె వెంటనే ఒప్పుకొంది కాని కాస్త భయపడింది. కారణం షిరిడీ చాలా దూరం, పైగా అది కొత్త ప్రదేశం, తెలిసినవాళ్ళెవరూ ఉండరు అందుచెత ఎవరినైన తోడు తీసుకొని వెడితే మంచిదనీ, పైగా చలి కాలమని చెప్పింది. తను చెప్పిన కారణాలన్ని సరైనవే, అయినప్పటికీ షిరిడి వెళ్ళాలనే నా కోరికముందు ఈ విషయాలేమీ నేను పెద్దగా పట్టించుకోలేదు. గురువారం ఉపవాసం ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, స్టేషను కి బయలుదేరాను.
ఉదయానికల్లా కోపర్గావ్ చేరుకొన్నాను. రైలు దిగగానే షిరిడీ వెళ్ళడానికి టాంగా కోసం చూస్తూ ఉండగా నా చిన్ననాటి మిత్రుడు డా.ఆర్.ఆర్. చౌబాల్ కనిపించారు. ఆయనకూడా అదే రైలులో వచ్చారు. నాలాగే ఆయన కూడా షిరిడి వచ్చి బాబాని దర్శించుకుందామని వచ్చారు. మా యిద్దరి కోరికలు ఒకటే అవడంతో మా యిద్దరికి ఎంతో సంతోషం కలిగింది. మేమెక్కిన టాంగా గోదావరి ఒడ్డుకు చేరగానే, నా బాల్య మితృడు శ్రీగజానన్ కనేకర్ కి మా రాక తెలిసి, మమ్మల్ని అతిధులుగా తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపించాడు. టాంగా ఇంటికి చేరగానే ఎంతో సంతోషించి మా సామానంతా దింపించి తన యింటిలో ఉండమని మాకు ఆతిధ్యం ఇచ్చాడు. కాస్త పలహారాలు కానిచ్చి టీ త్రాగి, ఇక ఎక్కువ సేపు ఉండలేమనీ, హారతి సమయానికి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరాము.
మేమిద్దరమూ కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో బసచేశాము. మేము కాకాసాహెబ్ దీక్షిత్ ని కలుసుకొన్నాము. ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. తరువాత మేము హారతికి వెళ్ళాము. బాబా దర్శనం కలగగానే నాకెంతో బ్రహ్మానందం కలిగి వర్ణించనలవికాని ఉద్వేగభరితమైన ఆనందం కలిగింది. అటువంటి ఆనందం ఇంతకుముందెప్పుడు నాకనుభవం కాలేదు. బాబా పాదాలను స్పృశించడానికి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాను. "నువ్వు షిరిడీ రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా?" అని బాబా అనగానే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా మనసులో అదే ఆలోచన తిరుగుతూ ఉంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తిత్వాన్ని తెలుసుకొని మరొకసారి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను.
బాబా తన కన్నులతోనే నన్ను దీవించి దగ్గరకు తీసుకొని లాలనగా బుజ్జగించి నన్ను పైకి లెమ్మన్నారు.
డా.చౌబాల్ కూడా అప్పుడే బాబా దర్శనం చేసుకొన్నారు.
తరువాత మేమిద్దరమూ ఇక పూనా వెళ్ళబోయే ముందు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన దర్శనానికి వెళ్ళాము. బాబా, "నా భక్తుడొకడు బాంద్రాలో నీ దగ్గిర వైద్యం చేయించుకొంటున్నాడు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా?" అని డాక్టర్ ని అడిగారు. బాబాకు చౌబాల్ గురించి తెలియదు. ఆయన డాక్టర్ అని గాని, ఆయన బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని ఎవరూ పరిచయం చేయలేదు. అయినా గాని ఆయనను బాబా తన భక్తుడికెలా ఉందని అడిగారు. డా.చౌబాల్ చాలా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో బాబా భగవంతుని అవరారమేనని మా నమ్మకం ఇంకా బలపడింది.
బాబాతో మాకదే మొదటి పరిచయం. ఇది కేవలం బాబా తన భక్తుల క్షేమం కోసం ఎంతగా కనిపెట్టుకొని ఉంటారన్నదానికి ఋజువు. బాబా ఎదటివారి మనసులలోని భావాలను చదవగలరు. వారి మనసులో ఉన్నది తాను గ్రహించగలననే సూచనలు కూడా చేసేవారు. నా షిరిడీ యాత్రకు నా భార్య వెలిబుచ్చిన సందేహాలు సతేహేతుకమే అయినప్పటికీ, బాబా దర్శనానికి నా యాత్రలో ఎటువంటి చిక్కులు ఏర్పడలేదు.
రెండవ అనుభవం: నేను షిరిడీ చాలా సార్లు వెళ్ళడం వల్ల, కుటుంబమంతా ఒక్కసారైనా షిరిడీ వెడదామని నా భార్య అనడం మొదలుపెట్టింది.
ఒకసారి నాకుటుంబంతో సహా షిరిడీ వెళ్ళాను. మేమందరమూ బాబా దర్శనానికి వెళ్ళాము. భక్తులందరూ బాబా సమక్షంలో కూర్చొని ఉన్నారు. నాభార్య కూడా అక్కడ ఉన్న ఆడవారి మధ్యలో కూర్చొంది. కుటుంబ జీవితంలో జరిగే విషయాలన్ని బాబా వివరించి చెపుతున్నపుడు, బాబా వివరించేదంతా తన జీవితం గురించేనన్న విషయం నాభార్యకు అర్ధమయి చెప్పలేని ఆననందాన్ననుభవించింది. ప్రతీవారు ఎలా నడచుకోవాలొ బాబా అందరికీ వివరించి చెప్పారు. తరువాత నాభార్య బాబాకు ఎంత భక్తురాలిగా మారిందంటే "బాబా ని అడగండి. ఆయన ఎలా చెపితే అలా చేయండి" అని అనడం ప్రారంభించింది. అందుచేత ఒకసారి నేను నా కుమార్తె వివాహం గురించి బాబాని అడిగాను. " నీ నిర్ణయం సరియైనదే. అనుకున్న ప్రకారమే వివాహం జరుగుతుంది. అమ్మాయి కలకాలం సుఖంగా ఉంటుంది". అన్నారు. అనుకున్న ప్రకారమే అమ్మాయి వివాహం అనుకున్న అబ్బాయితోనే జరిగి సుఖంగా సంసారం చేసుకొంటోంది. బాబా, నాభార్య శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించారు.
నాభార్య ఆ సంఘటనని స్పష్టంగా ఎప్పుడు గుర్తు చేసుకొంటూ ఉంటుంది.
వినాయక్ సీతారాం ముల్కెర్కర్
ఆంగ్లానువాదం : జ్యోతిరాజా రౌత్
8/A, కాకడ్ ఎస్టేట్. 106, సీ ఫేస్ రోడ్,
వర్లీ, ముంబాయి - 400 018
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment