21.04.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి బంధు నిమిత్ (జైపూర్) గారి షిరిడీ యాత్రలో ఆయనకు కలిగిన అనుభవాన్ని తెలుసుకుందాము. సాయికి మనము యేమయిన సమర్పించుదామనుకుని మరచిపోయినా ఆయన మనకు గుర్తు చేసి మరీ తీసుకుంటారు. ఈ విధంగా ఆయన గుర్తు చేయడమంటే మనం నిజజీవితం లో ఇచ్చిన మాట నిలబెట్టుకుని సన్మార్గం లో నడవమని ఆయన ఉద్దేశ్యం.
నిమిత్ గారి అనుభవం ఆయన చెప్పిన మాటలలోనే చదవండి.
షిరిడీ యాత్ర అనుభవం - ఇచ్చిన మాట మరవద్దు
" సాయిరాం హెతాల్జీ, మాది జైపూర్. మేము ఇక్కడ క్రమం తప్పకుండా బాబా గుడికి వెడుతూ ఉంటాము. 2010 వ సంవత్సరం శీతాకాలం లో మేము బాబా మందిరానికి వెళ్ళినపుడు బాబా విగ్రహానికి ఒక శాలువాని సమర్పిద్దామనుకున్నాము. కాని ఎందుకనో ఈ విషయం మామదిలోనించి తొలగిపోయి, ఇక ఆ విషయం గురించి పూర్తిగా మరచిపోయాము.
డిసెంబరు 2011 లో మేము షిరిడీ యాత్రకు వెళ్ళాము. సమాధి మందిరంలో బాబాని దర్శించుకున్న తరువాత, మేము చావడి మందిరం ఉన్న ప్రాంతం లో ఉన్న లక్ష్మీ బాయి యింటికి వెడుతున్నాము. దారిలో మాకు ఒక ఫకీరు కనపడ్డాడు. అతని మొహం దివ్యమైన వర్చస్సుతో వెలుగొందుతూ ఉంది. అతను వేసుకున్న దుస్తులు బాబా వారు ఎప్పుడు ధరించే దుస్తులలాగ ఉన్నాయి. నా భార్య నాతో అతనికి దక్షిణ ఇమ్మని చెప్పింది. నేనతనికి 50/- రూపాయలు ఇచ్చాను. నేను తిరిగి లక్ష్మీ బాయి యింటివైపు నడక సాగించాను. తరువాత నాకు నన్నెవరో పిలిచినట్లనిపించింది. నేను వెనుకకు తిరిగాను. సాధువులా ఉన్న ఆ ఫకీరు నావైపు చూసి తనవద్దకు రమ్మని సైగ చేశాడు. నేను వెనుకకు తిరిగి అతనివైపు వెళ్ళాను. అప్పుడతనన్న మాటలు మనమెప్పుడూ వినే బాబా లీల అనిపించింది. ఆ ఫకీరు అన్న మాటలు, "నాకొక కంబళీ కొనివ్వు". అతను ఈ మాటలను నాతో అన్నపుడు అతని వదనం లోని భావం చాలా ప్రశాంతంగా ఉండి, ఎంతో సాధు స్వభావంగా ఉంది. ఈ పరిస్థితిలో నాకు యేమి మాట్లాడాలో అర్ధంకాక ఇలా అన్నాను , "బాబాజీ, మీరు ఈ డబ్బుతో కంబళీ కొనుక్కోవచ్చు" అని లక్ష్మీ బాయి షిండే యింటివైపు నడక సాగించాను. షిరిడీనుంచి తిరుగు ప్రయాణంలో నేను నా భార్య జరిగిన ఈ వృత్తాంతాన్నంతా మరలా చర్చించుకోవడం మొదలుపెట్టాము. అప్పుడు మాకు గుర్తుకు వచ్చింది, జైపూర్ లో ఉన్న బాబా మందిరంలో బాబాకి శాలువా సమర్పిద్దామనుకున్న విషయం.
మేము జైపూర్ లో బాబాకు శాలువాను సమర్పిద్దామనుకున్న విషయాన్ని, షిరిడీలో ఫకీరు రూపంలో వచ్చి మాకు గుర్తు చేశారు. ఇది మాజీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన. ఈ అనుభవాన్ని రాస్తున్నపుడు నాకళ్ళల్లోంచి కన్నీరు వస్తోంది. బాబాజీ మీరంటే మాకెంతో ప్రేమ. మీరే మాకు ప్రపంచం. మేమెప్పుడు మిమ్మల్నే ప్రార్ధిస్తూ ఉంటాము. మీరెప్పుడు మాతోనే ఉండి మామీద దయ చూపుతూ ఉండండి.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు