22.10.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా శుభాకాంక్షలు
శ్రీ జీ.ఎస్.కపర్డే గారు వ్రాసుకున్న డైరీలో నుండి మరికొన్ని విశే షాలు తెలుసుకుందాము
శ్రీ.జీ.ఎస్. కపర్డే డైరీ - 3
9 డిసెంబరు 1910, శుక్రవారం
నేను, మా అబ్బాయి ఈ రోజు వెళ్ళిపోదామనుకున్నాము. ఉదయం ప్రార్ధన తరువాత, సాయిమహరాజ్ ని చూడటానికి వెళ్ళాము. ఆయన మా అబ్బాయితో "వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళవచ్చు" అన్నారు. అవసరమైన అనుమతి లభించిందనుకుని బయలుదేరడానికి సిధ్ధమయ్యాము. మా అబ్బాయి బాబా, సామాన్లన్నిటినీ సర్ది, ఒక మంచి బండి, సామానుల కోసం మరొక బండిని మాట్లాడాడు. బయలుదేరే ముందు, మధ్యాహ్నం సాయిమహరాజ్ ను చూడటానికి వెళ్ళాము.