22.10.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా శుభాకాంక్షలు
శ్రీ జీ.ఎస్.కపర్డే గారు వ్రాసుకున్న డైరీలో నుండి మరికొన్ని విశే షాలు తెలుసుకుందాము
శ్రీ.జీ.ఎస్. కపర్డే డైరీ - 3
9 డిసెంబరు 1910, శుక్రవారం
నేను, మా అబ్బాయి ఈ రోజు వెళ్ళిపోదామనుకున్నాము. ఉదయం ప్రార్ధన తరువాత, సాయిమహరాజ్ ని చూడటానికి వెళ్ళాము. ఆయన మా అబ్బాయితో "వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళవచ్చు" అన్నారు. అవసరమైన అనుమతి లభించిందనుకుని బయలుదేరడానికి సిధ్ధమయ్యాము. మా అబ్బాయి బాబా, సామాన్లన్నిటినీ సర్ది, ఒక మంచి బండి, సామానుల కోసం మరొక బండిని మాట్లాడాడు. బయలుదేరే ముందు, మధ్యాహ్నం సాయిమహరాజ్ ను చూడటానికి వెళ్ళాము.
మమ్మల్ని చూడగానే సాయిమహరాజ్ "నువ్వు నిజంగా వెళ్ళి తీరాలనుకుంటున్నావా?" అన్నారు. "వెళ్ళాలనుకుంటున్నాను. కాని మీరు అనుమతివ్వకపోతే వెళ్ళను" అని సమాధానం చెప్పాను. "అలా అయితే రేపు గాని ఎల్లుండి గాని వెళ్ళచ్చులే. ఇది మన ఇల్లు. వాడా మన ఇల్లు. నేనిక్కడుండగా ఎవరయినా ఎందుకని భయపడాలి? ఇది మన ఇల్లు. దీనిని నాయిల్లేనని నీవు భావించాలి" అన్నారు ఆయన. నేను ఉండటానికే నిర్ణయించుకుని ప్రయాణ సన్నాహాన్ని రద్దు చేసుకున్నాను. మేము కూర్చుని మాట్లాడుకుంటున్నాము. సాయిమహరాజ్ చాలా ప్రసన్నంగా ఉన్నారు. సంతోషకరమయిన విషయాలెన్నో చెప్పారు. కానీ, నేను అర్ధం చేసుకోలేదనుకొంటాను.
10 డిసెంబరు, 1910, శనివారం
ఉదయం ప్రార్ధన అయిన తరువాత నేను మా అబ్బాయితో మన ప్రయాణం గురించి సాయిమహరాజ్ కు చెప్పవద్దని చెప్పాను. ఆయనకు అన్ని తెలుసు. మనల్ని ఎప్పుడు పంపాలో ఆయనకు తెలుసు అని చెప్పాను. యధా ప్రకారం సాయిసాహెబ్ గారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఆయన బయటకు వెడుతున్నారు. తరువాత మసీదుకు వెళ్ళాము. ఆయన చాలా సంతోషించి, తనతో ఆడుతున్న చిన్నపిల్ల యొక్క గత జన్మ గురించి చెప్పారు. ఆమె ఒక కళాకారిణి అని, మరణించాక సమాధి చేశారని చెప్పారు. ఒకసారి తాము ఆ త్రోవ గుండా వెడుతూ ఒక రాత్రి ఆమె సమాధి వద్ద గడిపినట్లు చెప్పారు. అందుచేతనే ఆమె తనను అనుసరించి వచ్చిందనీ, తానామెను ఒక *బాబుల్ చెట్టు మీద ఉంచి, తరువాత ఇక్కడికి తెచ్చానని చెప్పారు.
తను గత జన్మలో కబీరుననీ, నూలు వడుకుతూ ఉండేవాడినని చెప్పారు.
సంభాషణ మిక్కిలి సంతోషదాయకంగా జరిగింది. మధ్యాహ్ న్నం వార్ధానుండి శ్రీధర్ పంత్ పరంజపే, ఆయన కూడా పండిత్, ఒక వైద్యుడు, మరొకతను కలిసి వచ్చారు. వారితో పాటు అహ్మద్ నగర్ కు చెందిన జూనియర్ పట్వర్ధన్ కూడా ఉన్నాడు. మా అబ్బాయికి, అతను కాలేజీ రోజుల్లో స్నేహితుడు. వారంతా సాయిసాహెబ్ ను చూడటానికి వెళ్ళారు. మేము కూడా వారిని అనుసరించాము. సాయిసాహెబ్ అందరినీ ఆదరించనట్లుగానే వారిని కూడా ఆదరించారు. సాయి మహరాజు మొదట తేలీ, మార్వాడీ మొదలైన వారి గురించి మాట్లాడారు. తరువాత ఆయన అక్కడ నిర్మితమవుతున్న భవనాల గురించి మాట్లాడుతూ ఇంకా ఇలా అన్నారు "ప్రజలకి పిచ్చెక్కింది. ప్రతి మానవుడు ఒక విధమయిన చెడు ఆలోచనలకు లోనవుతున్నాడు. వారిలో సమానత్వం తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుచేత నేనెప్పుడూ వారు చెప్పేది వినను. వారికి సమాధానం కూడా చెప్పను. ఏమని జవాబు ఇవ్వను" ఆ తరువాత ఆయన ఊదీ పంచి మమ్మల్ని వాడాకు వెళ్ళిపొమ్మన్నారు. ఆయన జూనియర్ పట్వర్ధన్ ని ఆగమని చెప్పి మరునాడు వెళ్ళమన్నారు. నేను, సహస్రబుధ్ధే వాడాకు తిరిగి వచ్చాము. పరంజపే, అతనితో వచ్చినవాళ్ళు, రాధాకృష్ణమాయి దగ్గరకు వెళ్ళినట్లున్నారు. ఎలాగయితేనేం బాబాసాహెబ్ సహస్ర బుధ్ధే అక్కడికి వెళ్ళాడు. కాని అతనికి తగిన మర్యాద లభించలేదు. బాపూసాహెబ్ జోగ్ భార్య జబ్బు పడింది. సాయిసాహెబ్ తన బోధలనే మందుగా ఇచ్చారు. దానివల్ల ఆమె చాలా లబ్ధి పొందింది. ఈ రోజు ఆమెలో ఓర్పు నశించి వెళ్ళిపోతానంది. జోగ్ కూడా ఇక ఏమీ చేయలేక ఆమె వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నాడు. సాయిసాహెబ్ ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుందన్నదాని మీద పదే పదే అడుగుతూనే ఉన్నారు. చివరికి బాపూ సాహెబ్, బాబా అనుమతి తీసుకుని వెడదామని చెప్పగానే, "నాకు ఇప్పుడు తేలిగ్గానే ఉంది, నేను వెళ్ళను" అంది. మేమంతా ఆశ్చర్యపోయాము.
* (నల్ల తుమ్మ చెట్టు )
(తరువాతి విషయాలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment