25.10.2015 ఆదివారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.కపర్డే గారి డైరీనుండి మరికొన్ని విశేషాలు
శ్రీ.జీ.ఎస్.కపర్డే డైరీ - 4
1910 డిసెంబరు 11, ఆదివారం
ఉదయం ప్రార్ధన ముగించి స్నానం చేశాను. బొంబాయి నుండి హరిభావు దీక్షిత్, కొద్ది మంది సహచరులు కీ.శే.డా.ఆత్మారాం పాండురంగ తర్ఖడ్ గారి కుమారుడు తర్ఖడ్, అకోలాలోని అన్నా సాహెబ్ మహాజని బంధువయిన మహాజనిలతో కలిసి వచ్చారు. మేమంతా ఎప్పటిలాగే సాయిసాహెబ్ దర్శనానికి వెళ్ళాము.
ఈ రోజు జరిగిన రెండు సంభాషణలు ముఖ్యమయినవే కాక గుర్తుంచుకోదగ్గవి. సాయి మహరాజు తాను ఒక మూల కూర్చుని తన శరీరం క్రింది భాగం చిలుక శరీరంలా మారిపోవాలని కోరుకున్నారట.
అనుకున్నట్లుగా మార్పు జరిగింది కాని, ఆయన ఒక ఏడాది వరకు ఆ మార్పును గమనించలేదు. లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. ఆపుడు ఆయన ఒక స్థంభం దగ్గిర కూర్చోసాగారు. అప్పుడొక పెద్ద పాము చాలా కోపంతో నిద్ర లేచింది. అది పైకి ఎగురుతూ పైనించి క్రిందకు పడిపోయేది. అప్పుడు ఆయన సంభాషణను మార్చేసి, తాను ఒక ప్రదేశానికి వెళ్ళాననీ, అక్కడ పాటిల్ తోట వేసి, నడవటానికి బాట వేసే వరకు తనని కదలనివ్వలేదని చెప్పారు.
అతడు రెండూ పూర్తి చేశాడని చెప్పారు. ఈ విషయం చెబుతున్నపుడు కొంత మంది అక్కడికి వచ్చారు. ఒకతనితో ఇలా అన్నారు "నువ్వు ఇంతకు ముందు రోహిల్లావి. దోపిడీ చేసి తరువాత వర్తకుడివయ్యావు" ఒక స్త్రీ తో సాయి "నేను తప్ప నిన్ను చూడటానికి నీకెవ్వరూ లేరు" అన్నారు. సాయి చుట్టూ ఉన్నవారిని చూస్తూ ఇంకా ఇలా అన్నారు " ఆమె తనకు బంధువనీ మనిషిని దోచిన రోహిల్లాను పెళ్ళడిందని చెప్పారు. ఇంకా ఇలా అన్నారు "ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకు ముందు ఉన్నట్లుగా లేరు. పూర్వం పవిత్రంగా, విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు వారు అవిశ్వాసులుగా, చెడు ఆలోచనలకు బద్దులై ఉన్నారు". ఆయన ఇంకా ఏదో అన్నారు కాని నేనర్ధం చెసుకోలేకపోయాను. అది తన తండ్రి గురించి, తాత గురించి ఇంకా ఒకదాని తరువాత మరొకటి తనలో వచ్చే మార్పు గురించి.
ఇపుడు జరిగిన సంఘటన - దీక్షిత్ పళ్ళు తీసుకొని వచ్చాడు. సాయి సాహెబ్ కొన్ని తిని మిగిలినవి పంచి పెడుతున్నారు. ఇక్కడి తాలూకా మామలతదారు ఇక్కడే ఉన్నారు. ఆయన సాయి మహరాజ్ ఒకే రంక పళ్ళు ఇస్తున్నారని అన్నారు. అప్పుడు మా అబ్బాయి తన మిత్రుడు పట్వర్ధన్ తో "సాయి మహరాజ్ పళ్ళను స్వీకరించడం, స్వీకరించకపోవడం అన్నది ఇచ్చినవారి భక్తి మీద ఆధారపడి ఉంటుందని" అన్నాడు. మా అబ్బాయి బాబా, ఈ విషయాన్ని నాకు, పట్వర్ధన్ కి వివరిస్తూ ఉన్నపుడు కాస్త శబ్ధం అయింది. దాని వల్ల బాబా జ్వలిస్తున్న కళ్ళతో కోపంగా చూశారు. ఏమని చెప్పావు అని నన్ను గద్దిస్తూ అడిగారు. నేనేమీ మాట్లాడలేదు, పిల్లలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పాను. ఆయన మా అబ్బాయి, పట్వర్ధన్ ల వైపు చూసి, వెంటనే తమ భావాన్ని మార్చుకున్నారు. చివరికి సాయి మహరాజ్ హరిభావు దీక్షిత్ తోనే పూర్తిగా మాట్లాడుతూ ఉన్నారని బాలా సాహెబ్ మిరికర్ అన్నాడు. మధ్యాహ్నం మేము భోజనాలు చేస్తున్నపుడు అహ్మదాబాద్ స్పెషల్ మాజిస్ట్రేట్ ఇనాందారు అయిన మిరికర్ తండ్రి వచ్చారు. ఆయన పాత కాలానికి చెందిన గౌరవనీయమైన వ్యక్తి. ఆయన సంభాషణ నాకు చాలా నచ్చింది. సాయంత్రం ఎప్పటిలాగే మేము సాయి సాహెబ్ ను చూశాము. రాత్రి మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. నూల్ కర్ కుమారుడు విశ్వనాధ్ ప్రతిరోజూ చేసేటట్లే భజనలు చేశాడు.
12 డిసెంబరు, 1910, సోమవారం
ఉదయం ప్రార్ధన అయిన తరువాత సాయి మహరాజ్ ఎప్పటిలాగే బయటకు వెడుతున్నారు.
మేమంతా కూర్చుని మాట్లాడుకొంటున్నాము. దీక్షిత్ తన ప్రర్తనని మార్చుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఎక్కువ సమయం ప్రార్ధనలోనే గడుపుతున్నాడు. సహజంగానే శాంత స్వభావి, అతనిలో ఏర్పడిన మానసిక ప్రశాంతత వల్ల మరింత మాధుర్యంతో నిండిపోయింది అతని స్వభావం. పూల్ గావ్ నుండి రావు బహద్దూర్ రాజారాం పంత్ దీక్షిత్ గారు వచ్చారు. నాగపూర్ నుండి బయలుదేరిన తరువాత తనకు షిరిడీ వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పారు. కాని, పూల్ గావ్ లో తనకు ఆ క్షణంలో షిరిడీ దర్శించాలనే కోరిక కలిగిందని చెప్పారు. ఆయనను చూడటం నాకెంతో సంతోషమనిపించింది. తరువాత మేమందరం సాయి సాహెబ్ ను దర్శించుకోవటానికి వెళ్ళాము. నేను కాస్త ఆలస్యంగా వెళ్లటంతో సాయి చెప్పిన ఆసక్తికరమయిన కధ వినలేకపోయాను. ఆయన నీతి కధలు బోధిస్తారు. " ఒకతనికి మంచి గుఱ్ఱం ఒకటుంది. అది తన ఇష్టం వచ్చినట్లుగా ఉండేది. జీను వేసి బండికి కడదామంటే వచ్చేది కాదు. అతను దాని చుట్టు ప్రక్కలంతా తిప్పి ఎంత శిక్షణ ఇచ్చినా లాభం లేకపోయింది. అప్పుడు ఒక పండితుడు దానిని ఎక్కడినుండి తీసుకుని వచ్చాడో అక్కడికే తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చాడు. అప్పుడతను ఆవిధంగా చేయగానె గుఱ్ఱం జీను వేయించుకుని సరైన దారిలోకి వచ్చింది." నేను ఈ నీతి కధను చివరలో విన్నాను. తరువాత సాయి నన్ను ఎపుడు వెడుతున్నావని అడిగారు. మీ అంతట మీరు అనుమతిస్తే తప్ప వెళ్ళను అని చెప్పాను. అయితే "ఇవాళ భోజనం చేసి వెళ్ళు" అన్నారు. తరువాత మాధవరావ్ దేశ్ పాండే చేత ప్రసాదంగా పెరుగు పంపించారు. నేను ఆ పెరుగును భోజనంలో వేసుకుని తిన్నాను. తరువాత సాయి మహరాజ్ వద్దకు వెళ్ళాను. నేను వెళ్ళగానె, ఆయన తను ఇచ్చిన అనుమతిని నిర్ధారించి చెప్పారు. మా అబ్బాయికి నమ్మకం కుదరక మళ్ళి అడిగినప్పుడు. బాబా వెళ్ళమని స్పష్టంగా చెప్పారు. ఈ రోజు సాయి మహరాజ్ ఇతరులని దక్షిణ అడిగారు గాని నన్ను, మా అబ్బాయిని దక్షిణ అడగలేదు. నా వద్ద డబ్బు తక్కువగా ఉందని బాబాకి తెలిసే ఉంటుంది. తరువాత, నూల్కర్, దీక్షిత్, బాపూ సాహెబ్ జోగ్, బాబా సాహెబ్ సహస్ర బుధ్ధే, మాధవరావ్ దేశ్ పాండే, బాలా సాహెబ్ భాటే, వాసుదేవరావు, ఇంకా మరికొందరికి వీడ్కోలు చెప్పి, ఈ రోజే వచ్చిన పట్వర్ధన్, ప్రధాన్, కాకా మహాజని, తర్ఖడ్, భిదే లతో కలిసి బయలుదేరాము. కోపర్ గావ్ లో సాయంత్రం 6.30 కి రైలులో మన్మాడ్ వెళ్ళాము. భిదే యావలాలో దిగాడు. నేను, మా అబ్బాయి మన్మాడ్ లో పంజాబ్ మెయిల్ ఎక్కాము. క్రితం రోజు రాత్రి కలలో ఉజీజుద్దీన్ కనిపించాడు. ఇంకొకతను ఉన్నాడు గానీ, నేను గుర్తించలేకపోయాను.
(మరికొన్ని సంఘటనలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment