27.10.2015 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ.జీ.ఎస్.కపర్డే డైరీ - 5
ఈ రోజు శ్రీ జీ.ఎస్.ఖపర్డే గారి డైరీలోనుండి మరికొన్ని విషయాలు. డిసెంబరు 12వ.తేదీ 1910 న కపర్డేగారు షిరిడీ నుండి బాబా అనుమతి తీసుకొని బయలుదేరారు. తరువాత ఆయన మళ్ళీ రెండవసారి షిరిడీ వచ్చేంత వరకు ఆయన తన డైరీలో వ్రాసుకున్న విషయాలను నేను ఇవ్వడంలేదు. మరలా ఆయన రెండవసారి షిరిడీ వచ్చినపుడు ఆయన వ్రాసుకున్న వాటినే ఇస్తున్నాను.
6 డిసెంబరు, 1911, బుధవారం
దీక్షిత్ కట్టుకున్న క్రొత్త ఇంటి వద్దకు నా టాంగా చేరుకోగానే, నేను కలుసుకున్న మొదటి వ్యక్తి మాధవరావు దేశ్ పాండే. నేను టాంగా నుండి దిగకముందే దీక్షిత్ నన్ను ఆరోజు తనతో భోజనానికి ఆహ్వానించాడు. నేను మాధవరావుతో కలిసి సాయి మహరాజ్ ను దర్శించుకోవడానికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన చేతులు, కాళ్ళు కడుక్కొంటున్నారు. అందుచేత దూరం నుండే నమస్కరించి వచ్చేశాము. తరువాత నేను కూడా స్నానం, ప్రార్ధనలతో నిమగ్నమై ఉండటం వల్ల ఆయన బయటకు వెళ్ళినపుడు కూడా నమస్కరించుకోలేక పోయాను. తరువాత మేము మసీదుకు వెళ్ళి ఆయన దగ్గరగా కూర్చున్నాము. ఆయన ఒక ఫకీరు గురించి కధ ఒకటి చెప్పారు. తాను ఒక ఫకీరుతో కొంత కాలం ఉన్నారట. ఫకీరు కాస్త భోజన ప్రియుడు. ఈ ఫకీరును ఒక విందుకు ఆహ్వానించారు. ఫకీరు సాయి మహరాజ్ ను వెంటపెట్టుకొని వెళ్ళాడు. బయలుదేరేముందు ఫకీరు భార్య, సాయి మహరాజ్ కి ఒక పాత్రనిచ్చి, వచ్చేటప్పుడు అందులో విందు భోజనాన్ని పెట్టించుకుని రమ్మని చెప్పింది. ఫకీరు కడుపునిండా భోజనం చేసి ఆ ప్రదేశంలోనే నిద్రపోవడానికి నిర్ణయించుకున్నాడు. సాయి మహరాజ్ పిండివంటల మూటను వీపుకి కట్టుకొని, ద్రవ పదార్ధాన్ని పోయించుకొన్న పాత్రను తలపై పెట్టుకొని, ఒక్కరే తిరిగి బయలుదేరారు. ఆయన దారి తప్పడంతో చాలా దూరం అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని మాగ్ వాడా వద్ద కూర్చున్నారు. కుక్కలు ఆయన వైపు చూసి మొఱగడంతో వెంటనే లేచి గ్రామానికి తిరిగి వచ్చారు. తను తెచ్చిన పిండివంటలని, ద్రవ పదార్ధాన్ని ఫకీరు భార్యకు ఇచ్చారు. ఆ సమయానికి ఫకీరు కూడా ఇంటికి చేరుకున్నాడు. ఇద్దరూ కడుపు నిండా భోజనం చేశారు. అటువంటి మంచి ఫకీరు దొరకడం చాలా కష్టం అని చెప్పారు.
క్రిందటి సంవత్సరం నేను సాఠే నిర్మించిన వాడాలో బస చేశాను. ఆయనను మొదటగా మసీదులోను, రాత్రి భోజనాల దగ్గరా కలుసుకున్నాను. దీక్షిత్ చాలా మందికి భోజనాలు పెట్టాడు. వారిలో కీ.శే.మాధవరవు గోవింద రనాడే సోదరి కొడుకు తోసార్ కూడా ఉన్నాడు. తోసార్ బొంబాయిలోని కస్టమ్స్ ఆఫీసులో ఉద్యోగి. అతనెంతో మర్యాదస్థుడు. మేము కూర్చుని మాట్లాడుకున్నాము. నాసిక్ నుండి వచ్చిన ఒక పెద్ద మనిషి, ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు. వారిలో టిప్నిస్ అనే అతను భార్యతో వచ్చాడు. తరువాత ఆమె ఒక మగపిల్లవాడిని కన్నది. బాపూసాహెబ్ జోగ్ ఇక్కడే ఉన్నాడు. అతని భార్య ఆరోగ్యంగానే ఉంది. నూల్కర్ మరణించాడు. అతని సాన్నిహిత్యాన్ని కోల్పోయాను. అతని కుటుంబంలోని వారెవరూ ఇక్కడ లేరు. బాలా సాహెబ్ భాటే ఇక్కడే ఉన్నాడు. అతని భార్య దత్త జయంతినాడు కొడుకును కన్నది. మేము దీక్షిత్ వాడాలో బస చేశాము. అది చాలా సౌకర్యంగా ఉంది.
7 డిసెంబరు,1911, గురువారం
రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది. మా అబ్బాయి, నాభార్య, భీష్మతో సంతోషంగా ఉన్నారు. విష్ణు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు మేము చాలా మందికి భోజనాలు పెట్టాము. నేనిక్కడ రోజువారి కార్యక్రమాలలో నిమగ్నమయిపోయాను. సాయి మహరాజ్ బయటకు వెడుతున్నపుడు, మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు, మరల సాయంత్రం, తరువాత ఆయన నిద్రించడానికి చావడికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేశాను.
కొంత మంది అవివేకులు అభ్యంతరం చెప్పడం వల్ల ఆ రోజు భజన తక్కువగా జరిగింది. శేజ్ ఆరతి నుండి తిరిగి వచ్చాక భీష్మ రోజులాగే భజన చేశాడు. తోసర్ తను వ్రాసిన పాటలు కొన్ని పాడాడు.
కబీరు, దాసగణు ఇంకా మరికొందరు పాటలు పాడారు. గత సంవత్సరం ఇక్కడే ఉన్న దాసగణు గారి భార్య బయా ఇపుడు పుట్టింట్లో ఉంది. రాత్రి బాగా పొద్దు పోయే వరకు మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాము. క్రిందటి సంవత్సరం నేను వెళ్ళిపోయిన తరువాత, కమిషనర్, కలెక్టరు, సాయి మహరాజ్ ను కలుసుకోవడానికి వచ్చారని బాపూసాహెబ్ జోగ్ ఉదయం చెప్పాడు. ఆయన వారిని మసీదులోకి అడుగు పెట్టనివ్వలేదు. వారు చావడి దగ్గర చాలా సేపు వేచి చూశారు. సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళని తన చేతి వేళ్ళను టెలిస్కోపులాగ చేసి వాటి గుండా చూశారు. వాళ్ళు ఆయనతో మాట్లాడుదామనుకొన్నారు. ఆయన వాళ్ళిద్దరినీ రెండు గంటలు వేచి ఉండమన్నారు. వారు ఆగకుండా 10 రూపాయలు దక్షిణగా సమర్పించి వెళ్ళారు. సాయి మహరాజ్ దక్షిణ తీసుకోవడానికి ఇష్టపడక వాళ్ళకే ఇచ్చేశారు.
దాదా కేల్కర్ కి బాబు అనే కొడుకు ఉన్నాడని మాధవరావు దేశ్ పాండే రాత్రి మాతో చెప్పాడు. సాయి మహరాజ్ బాబుని దయతో చూసేవారు. ఆ బాబు చనిపోయినా బాబా ఇప్పటికీ అతనిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. బొంబాయిలో బారిస్టర్ గా ఉన్న మోరేశ్వర్ విశ్వనాధ్ ప్రధాన్ సాయి మహరాజ్ ను దర్శించుకోవడానికి వచ్చారు. ఆయన భార్యను చూడగానె ఆమె బాబు తల్లి అన్నారు సాయి మహరాజ్. తరువాత ఆమె గర్భవతయింది. బొంబాయిలో ఆమెకు ప్రసవమయే రోజున, సాయి మహరాజ్ ఇక్కడ తనకు నొప్పులు వస్తున్నాయని అన్నారు. కవల పిల్లలు పుడతారనీ వారిలో ఒకడు చనిపోతాడని చెప్పారు. ఆయన చెప్పినట్లే జరిగింది. శ్రీమతి ప్రధాన్ తన చిన్న కొడుకుని తీసుకుని ఇక్కడకు వచ్చినపుడు సాయి మహరాజ్ ఆమె కొడుకుని తన ఒడిలోకి తీసుకుని "ఇక్కడకు వస్తావా?" అని అడిగారు. ఆ రెండు నెలల పసి బిడ్డ స్పష్టంగా "ఊ" అన్నాడు.
(మరికొన్ని సంఘటనకు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment