28.10.2015 బుధవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయ్ బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్.కపర్డే గారి డైరీ నుండి మరిలొన్ని విశేషాలు.
శ్రీ.జీ.ఎస్. కపర్డే డైరీ - 6
8 డిసెంబరు, 1911, శుక్రవారం
నిన్న, మొన్న కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. అమరావతిలో ఉండే ఉపాసనీ వైద్య ఇక్కడే ఉంటున్నాడు. నేను రాగానే నన్ను కలుసుకున్నాడు. మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అమరావతి వదలి పెట్టిన దగ్గిర నుంచి జరిగిన కధనంతా సంక్షింప్తంగా చెప్పాడు.
తాను గ్వాలియర్ రాష్ట్రానికి ఎలా వెళ్ళింది, ఒక గ్రామాన్ని ఎలా కొన్నది, అది ఆర్ధికంగా కలిసి రాకపోవడం, ఒక మహాత్ముడిని ఏవిధంగా కలుసుకున్నది, తనకు జబ్బు చేయడం, అన్ని రకాల ఔషధాలను వాడటం, ఎంతో మంది సాధువులను, మహాత్ములను దర్శించడం, ఆఖరికి సాయి మహరాజ్ ఆశ్రయంలో బాగు కావడం దగ్గరనుంచి , ఆయన ఆజ్ఞ ప్రకారం ఇక్కడే ఉంటున్నట్లు చెప్పాడు. సంస్కృతంలో సాయి మహరాజ్ మీద స్తోత్రాలు రచించాడు ఉపాసనీ. మేమంతా వేకువజామునే లేచి కాకడ ఆరతికి వెళ్ళాము. అది ఎంతో నిష్ఠను కలుగ చేసింది. ప్రార్ధన, స్నానం అయాక నేను సాయి మహరాజ్ బయటకు వెడుతుండగాను, మరలా తిరిగి వచ్చెటప్పుడు, మరొక్కసారి మధ్యాహ్నం దర్శించుకున్నాను. సాయి మహరాజ్ నా వైపు చూస్తూ 'కా సర్కార్ ' అని సంబోధించారు. అప్పుడాయన "భగవంతుడు నిన్నెలా ఉంచారో అలాగే జీవించు" అని నాకు సలహా ఇచ్చారు. ఇంకా ఇలా అన్నారు "కుటుంబం మీద ప్రీతి కల మనిషి అన్నిటినీ భరించాలని చెబుతూ ఒక ధనికుడి కధ చెప్పారు. "ఆ ధనికుడు రోజంతా కష్టపడి బానిసలాగ పని చేసి, సాయంత్రం ముతక రొట్టెను చేసుకుని తినేవాడు. ఇవన్నీ తాత్కాలికమైన కష్టాలు". మరలా సాయంత్రం మేము సాయి మహరాజ్ ను దర్శించుకొన్నాము. తరువాత దీక్షిత్ వాడా వరండాలో కూర్చున్నాము. బొంబాయి నుండి ఇద్దరు పెద్ద మనుషులు సితార తెచ్చి వాయిస్తూ భజన చెప్పారు. తోసర్, ఇతనిని హజరత్ అని కూడా పిలుస్తుంటారు, చాలా అద్భుతంగా పాట పాడాడు.
భీష్మ ఎప్పటిలాగే భజన చేశాడు. అర్ధరాత్రి వరకు సమయం చాలా ఆనందంగా గడిచిపోయింది. తోసర్ తో సాహచర్యం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. నేను మా అబ్బాయి బల్వంత్ తోను, బొంబాయి నుంచి వచ్చిన వారితోను, మిగతావారితోను, ధ్యానం గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. మాధవరావు దేశ్ పాండే ఇక్కడే నిద్రపోయాడు. నేనింతకు ముందు చదివిన విషయాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ, చెవులారా వింటున్నాను. ఎప్పుడూ అనుభవం కూడా కలుగలేదు. మాధవరావు శ్వాస పీల్చి వదలుతునపుడెల్లా "సాయినాధ్ మహరాజ్, సాయినాధ్ మహరాజ్" అనె శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. మాధవరావు గుఱక పెట్టినప్పుడల్లా ఆ శబ్దం స్పష్టాతి స్పష్టంగా దూరంగా ఉన్నా కూడా వినిపిస్తోంది. అతను గాఢ నిద్రలో ఉన్నా ఆవిధంగా నామ శబ్దం వినపడటం చాలా అధ్బుతం.
9 డిసెంబరు, 1911, శనివారం
నేను నిద్ర లేచి ప్రార్ధన పూర్తి చేసుకునేటప్పటికి కాస్త ఆలస్యమయింది. ఈ రోజు చందోర్కర్ తన నౌకరును వెంటపెట్టుకుని వచ్చాడు. ఇంకా చాలా మంది వచ్చారు. ఇక్కడున్న వాళ్ళు కొంత మంది వెళ్ళిపోయారు. చందోర్కర్ నిరాడంబరుడైన మంచి వ్యక్తి. అతను మంచి సంభాషణా చతురుడు. అతను చేసే పనులు ఎటువంటి భేషజం లేకుండా ఉంటాయి. మసీదుకు వెళ్ళి అక్కడ చెప్పే విషయాలు వింటూ చాలా సేపు కూర్చున్నాను. సాయి మహరాజ్ చాలా ఉల్లాసంగా ఉన్నారు. సాయి మహరాజ్ నా హుక్కా తీసుకుని ఒక పీల్పు పీల్చారు. ఆరతి వేళలో ఆయన ఎంతో అధ్బుతమైన సౌదర్యంతో కనిపించారు. కాని, ఆ తరువాత అందరినీ తొందరగా పంపించేశారు. ఆయన మాతో కలిసి భోజనం చేయడానికి వస్తానన్నారు. ఆయన నా భార్యని 'అజీబాయీ' అని పిలుస్తారు. మేము వాడాకు తిరిగి వస్తుంటే జబ్బుగా ఉన్నా దీక్షిత్ కూతురు చనిపోయిందని తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఆమెకి సాయి మహరాజు తనను ఇక్కడ ఒక వేపచెట్టు క్రింద ఉంచినట్లుగా కలవచ్చింది. ఆ పిల్ల చనిపోతుందని సాయి మహరాజ్ నిన్ననే చెప్పారు. ఆ విషాద సంఘటన గురించే మేమంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఆ పిల్ల వయస్సు 7 సంవత్సరాలే. నేను ఆమె శవాన్ని చూడటానికి వెళ్ళాను. చనిపోయినా కూడా ఆ పిల్ల మొఖం ఎంతో కళగాను, ప్రత్యేకమైన సౌదర్యంతోను ఉంది. నాకది ఇంగ్లాండులో నేను చూసిన మడొన్నా చిత్రాలను గుర్తుకు తెచ్చింది. వాడా వెనుకే ఆమెను ఖననం చేశారు. ఖననం జరిగేటప్పుడు నేను కూడ పాల్గొన్నందు వల్ల ఆ సాయంత్రం 4 గంటల వరకు ఏమీ తినలేదు. దీక్షిత్ ఆ దెబ్బను ఎంతో ఉన్నతమైన స్థాయిలో సహించారు. సహజంగానే ఆయన భార్య దుఖంతో బావురుమంది. అందరూ ఆమె పట్ల సానుభూతి చూపించారు. సాయంత్ర వాడాకు వెళ్ళి, సూర్యాస్తమయం, శేజారతి సమయాల్లో రెండు సార్లు సాయి మహరాజ్ ను దర్శించుకున్నాను.
సాయి మహరాజ్ తోసార్ కి బొంబాయి నుండి వెళ్ళడానికి అనుమతిచ్చారు. అతను రేపు ప్రొద్దున్న బయలుదేరి వెడతాడు.
(మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment