29.10.2015 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ.ఎస్. కపర్డే గారి డైరీనుండి మరికొన్ని విశేషాలు
శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 7
10 డిసెంబరు, 1911, ఆదివారం
ఉదయం నేను ప్రార్ధన ముగించేముందు బొంబాయిలో వకీలుగా ఉన్న దత్తాత్రేయ చిట్నీస్ వచ్చారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఆయన క్రొత్తగా చేరారు. అందుచేత ఆయన నాకు పాత మిత్రుడే. సహజంగనే మేము పాత రోజులలోని విషయాలన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నాము.
ఎప్పటిలాగానే నేను సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు ఆయన తిరిగి వచ్చాక , ఎప్పుడూ ఆయన కూర్చొనే చోట కూర్చున్నపుడు దర్శనం చేసుకున్నాను. తరువాత అందరం తిరిగి వచ్చాము. అల్పాహారం కాస్త ఆలస్యమయింది. తరువాత నేను ఉపాసనీ తోను, ఆ తరువాత నానా సాహెబ్ చందోర్కర్ తోను మాట్లాడుతూ కూర్చున్నాను. అతను సాయి మహరాజ్ కు ఎప్పటినుండో భక్తుడు కాకపోయినా, ముఖ్యుడు. అతను చాలా ప్రసన్నంగా ఉంటాడు. తనకు సాయి మహరాజ్ తో సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది, ఎలా పురోగతిని సాధించింది ఆ కధంతా చెప్పాడు. తాను పొందిన ఉపదేశాలను కూడా నాకు చెప్పదలచుకొన్నాడు, కాని, అక్కడికి అందరూ వచ్చి గుమిగూడేటప్పటికి అందరి ముందూ చెప్పలేకపోయాడు.
మధ్యాహ్నం రెండు సార్లు సాయి మహరాజ్ ను దర్శించుకుందామని ప్రయత్నం చేశాను కాని ఆయన ఎవరినీ చూసే మానసిక స్థితిలో లేరు. ఆయనని సాయంత్రం చావడి దగ్గర దర్శించుకున్నాను.
సాఠే సాహెబ్ తోను, చిట్నీస్ ఇంకా మరికొందరితో చాలాసేపు మాట్లాడాను. నర్సోబావాడి నుండి గోఖలే గారు వచ్చారు. తనను ఖేడ్ గావ్ కు చెందిన నారాయణ మహరాజ్, సాయి మహరాజ్ ను దర్శించుకోమని పంపించినట్లు చెప్పారు. ఆయన చాలా బాగా పాడతారు. రాత్రి కొన్ని భజనలు పాడించుకున్నాను. నానాసాహెబ్ చందోర్కర్ ఇవాళ ఠాణాకు తిరిగి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల క్రితం బాలా సాహెబ్ భాటేకు జన్మించిన కుమారుడు ఈ రోజు సాయంత్రం మరణించాడు. సాయి మహరాజ్ ఈ రోజు మధాహ్నం ఒక మందు తయారు చేసి ఆ మందుని తామే వేసుకొన్నారు.
11 డిసెంబరు, 1911, సోమవారం
ఈ రోజు ఉదయం ప్రార్ధన చాలా మనోహరంగా జరిగింది. నా మనసుకి ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. తరువాత దత్తాత్రేయ చిట్నీస్ కి పంచదశలోని మొదటి కొన్ని శ్లోకాలను వివరిస్తూ కూర్చున్నాను. తరివాత మేము సాయి మహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాము.
ఆయన నాకు తరచుగా చిలిం, రాధాకృష్ణమాయి పంపించే ద్రాక్షపళ్ళు, ఇస్తూ ఉండేవారు. ఆయన మా అబ్బాయి బల్వంతుకి రెండు సార్లు ద్రాక్షపళ్ళు ఇచ్చారు. ఆయన మధ్యాహ్నం మసీదును శుభ్రం చేసుకుంటున్నారని విన్నాను. అందుచేత అటువైపు వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ప్రజలంతా సాయి మహరాజ్ దగ్గరకు వచ్చి ప్లేగు వ్యాధిని తరిమి కొట్టవలసిందిగా విన్నవించుకున్నారు. అప్పుడాయన వీధులు, సమాధులు, స్మశానవాటికలు అన్నిటినీ శుభ్రం చేసి అన్నదానం చేయమని చెప్పారు.
మధ్యాహ్నమంతా నేను వార్తాపత్రికలు చదువుతూ, చిట్నీస్ ఇంకా ఇతరులతో మాట్లాడుతూ గడిపేశాను. ఉపాసనీ ఏదో వ్రాస్తున్నారు. సాయంత్రం మేము సాయి మహరాజ్ ను చావడి వద్ద దర్శించుకున్నాము. తరువాత శేజ్ ఆరతికి వెళ్ళాము.
ఆ తరువాత చిట్నీస్ తన ఇంజనీరింగ్ మిత్రుడు, ఇంకా మరొకరితో కలిసి వెళ్ళిపోయాడు. ఇక తొందరగా ముగించదలచుకున్నాను.
(మరికొన్ని విశేషాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment