Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, October 7, 2011

సాయితో సాయి బా ని స అనుభవాలు 18

0 comments Posted by tyagaraju on 9:00 AM


7.10.201 శుక్రవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
రెండు రోజులుగా ప్రచురించడానికి కొంత ఆలశ్యము జరిగింది. అన్యధా భావించవద్దు.


ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 18 వ అనుభవాన్ని తెలుసుకుందాము.


సాయితో సాయి బా ని స అనుభవాలు 18

బాబా స్వయంగా ఇచ్చిన ఔషధము

శ్రీ సాయి సచ్చరిత్ర 7 వ అధ్యాయములో బాబా షిరిడీకి వచ్చిన మొదటి రోజులలో షిరిడీ గ్రామస్తులకు వైద్యం చేసి మంచి పేరు గాంచిరి అనే విషయము వివరింపబడింది. శ్రీ సాయి 5 సంవత్సరాలు ముందే నాకు రాబోయే అనారోగ్యాన్ని గుర్తించి దానికి తగిన మందు ఇచ్చి నన్ను కాపాడిన వైనము ఇప్పుడు మీకు తెలియచేస్తాను.

1991 వ సంవత్సరములో నా చిన్ననాటి స్నేహితుని తల్లి చనిపోయిందని టెలిగ్రాం రావడంతో అజ్మీరులో ఉన్న వారి యింటికి వెళ్ళాను. దశ దిన కర్మ కాండలన్ని పూర్తి అయిన తరువాత తిరిగి హైదరాబాదుకు ప్రయాణానికి ముందు రోజున నేను ఒక ఆటోలో అక్కడ ప్రఖ్యాతి గాంచిన అజ్మీరు దర్గాని చూడటానికి బయలుదేరాను. ఈ దర్గాపై అన్ని మతాలలోనూ నమ్మకం ఉన్నవారు ఇక్కడకు ప్రార్థనలు చేసుకుందుకు వస్తారు. నేను ఆటోలో ప్రయాణిస్తూ సాయిని స్మరిస్తూ ఉండగా రోడ్డుపై ఒక ముసలి మార్వాడి వ్యక్తి ఆటోని ఆపి తనను కూడా దర్గాకు తీసుకువెళ్ళమని కోరాడు. ఆటో డ్రైవరు నాలుగు రూపాయలు ఇమ్మని అడిగినాడు. అప్పుడు ఆ మార్వాడీ వ్యక్తి నేను యెవరికయినా రెండు రూపాయలే ఇస్తాను, ఎవరినించయినా రెండు రూపాయలే స్వీకరిస్తాను అనే మాటలు నాలో అనేక ఆలోచనలను రేకెత్తించింది. శ్రీ సాయి ఈ ముసలివాని రూపములో నాతోపాటు దర్గాకు ప్రయాణం చేయబోతున్నారా అనే ఆలోచన కలగగానే ఆ ఆటోడ్రైవరును ఉద్దేశించి ఆ ముసలివాడు ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తానని చెప్పి ఆ ముసలివానిని నాపక్కన కూర్చోమని చెప్పాను. ఆటో ముందుకు కొనసాగుతూండగా ఆ ముసలివాడు నన్ను ఉద్దేశించి అన్న మాటలు "నీవు చూడటానికి స్వచ్చమయిన హిందూ బ్రాహ్మణుడిలా ఉన్నావు, నీవు అజ్మీరు దర్గాకు వచ్చి అక్కడ ఫకీరు సమాధికి నమస్కరించడానికి నీ మనస్సు అంగీకరిస్తుందా". "నేను షిరిడీ సాయి భక్తుడిని. అన్ని మతాలలోని మహాపురుషులకు నేను నమస్కరిస్తాను" అని సమాధానమిచ్చాను. మా సంభాషణ ఇలా కొనసాగుతుండగా ఆ ముసలివాడు దర్గాకు ముందు ఉన్న ఒక సందులో ఆటోను ఆపి నన్ను దర్గాకు జాగ్రత్తగా తీసుకువెళ్ళమని ఆటో డ్రైవరుకు చెప్పి "నువ్వు నాకోసం నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి నన్ను ఋణగ్రస్తుడిని చేశావు. నేను ఎవరి ఋణమూ ఉంచుకోను. అని చెప్పి తన భుజాన ఉన్న సంచీలోంచి శరీరంపై ఎక్కడయినా నొప్పి ఉన్నచో తగ్గడానికి రాసుకునే లేపనం ఉన్న ఒక సీసాని బహూకరిస్తూ "భవిష్యత్తులో నీవు నడవలేని స్థితిలో విపరీతమయిన నొప్పితో బాధ పడే సమయములో ఈ లేపనమును నీ బాధ నివారణ కోసం ఉపయోగించుకో" అని పలికినాడు. నాతో మాట్లాడుతూ ఆటో దిగి కొన్ని క్షణాలలో మాయమయినాడు. నా మనసులో ఆ ముసలివానికి నమస్కరించినాను.

అజ్మీరు దర్గాలో ప్రార్థనలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. కాలం ఎవరికోసమూ ఆగదు. అది 1996 వ సంవత్సరము. జనవరి నెల. సయాటికా నెప్పితో నడవలేని స్థితిలో మంచం మీద పడి ఉన్నాను. కనీసము డాక్టరు దగ్గిరకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. కాలకృత్యాలు పూర్తిచేసుకుందుకు బాత్ రూముకు కూడా వెళ్ళలేని స్థితిలో బాబాని ప్రార్థించాను. ఒక్కసారిగా అజ్మీరు సంఘటన గుర్తుకు వచ్చింది. నా భార్యను పిలిచి అజ్మీరులో ఆ ముసలివాడు నాకు ఇచ్చిన నెప్పినివారణ లేపనము సీసాను తెమ్మని చెప్పాను. నా భార్య వంటిల్లు అంతా వెదకి ఆ సీసాను గుర్తించి నాకు తెచ్చి ఇచ్చింది. ఆ లేపనమును నా నడుముకు ఆమె పూసినది. ఆ లేపనము నా శరీరముపై పూసిన రెండు గంటలలో లేచి కూర్చుని సాయంత్రానికి నా కాలకృత్యములు నిర్వర్తించుకోవడానికి బాత్ రూముకు వెళ్ళగలిగాను. మరుసటి రోజున లేచి ఇంటిలో నడవసాగాను. శ్రీ సాయి అయిదు సంవత్సరాల క్రితం ఒక వృధ్ధ మారవాడీ రూపములో నాతోపాటు అజ్మీరు దర్గాకు ప్రయాణము చేస్తూ నాకు ఇచ్చినటువంటి ఆ లేపనము నాకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించింది. నేను నా భార్య నా హాలులో ఉన్న సాయి పటం దగ్గిరకి వచ్చి నమస్కరించాము. నేను సాయికి సాష్టాంగ నమస్కారము చేసి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు సాయికి ధన్యవాదాలు తెలియచేసుకున్నాను.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Tuesday, October 4, 2011

సాయితో సాయి బా ని స అనుభవాలు 17

0 comments Posted by tyagaraju on 8:15 AM






















04.10.2011 మంగళవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి దసరా శుభాకాంక్షలు

గత రెండు రోజులుగా కరంటు కోత వల్ల, నేను నరసాపురముంచి విజయవాడ వచ్చి హైద్రాబాదు ప్రయాణము వల్ల అనుభవాలు ప్రచురించడానికి సమయం చిక్కలేదు. ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 17 వ అనుభవాన్ని అందిస్తున్నాను.

ఈ రోజు అమ్మవారు దుర్గా దేవిగా దర్శనమిస్తున్నారు.

సాయితో సాయి బా ని స అనుభవాలు 17


శ్రీ సాయి సచ్చరిత్ర 21 వ అధ్యాయంలో యోగుల గురించీ యోగీశ్వరుల వ్యవస్థ గురించీ చెప్పబడింది. యోగులు భౌతికంగా దూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ వారు చెసే పనులు ఒకరికి ఒకరు తెలియచేసుకునేవారు. సమాజానికి మంచి చేయడానికి వారు భగవంతుని ఆజ్ఞానుసారం కార్యములని నిర్వర్తిస్తూ ఉన్నారు.

16.09.1993 న . సాయంత్రము 6.30 నిమిషాలకు టీ.వీ. ముందు కూర్చుని దక్షిణ భారతదేశంలో ప్రముఖులైన శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారిపై కార్యక్రమాన్ని చూడసాగాను. సాధు సత్పురుషులందరూ భగవంతుని దూతలు. వారు ఈ భూమిపై ప్రత్యేకమైన పనులను నిర్వహించడానికి అవతరించి వారి పని పూర్తి కాగానే తిరిగి భగవంతుని చెంతకు చేరుతున్నారు. ఈ కోవకు చెందినవారే శ్రీ షిరిడీ సాయినాధులవారు. శ్రీ రాఘవేంద్రస్వామివారి మీద కార్యక్రమాన్ని చూస్తూన్నంతసేపూ నా మనసు శ్రీ షిరిడీ సాయినాధులవారిపై నిలిచింది. ఈ ప్రపంచములో యోగీశ్వరుల వ్యవస్థ నిజమైతే ఈ కార్యక్రమము పూర్తి అయ్యేలోపల లేదా నేను టీ. వీ. ముందునుంచి లేచి బయటకు వెళ్ళేలోపల శ్రీ షిరిడీ సాయినాధులవారి పటమును చూడాలి, లేదా వారి గొప్పతనమును గురించి వినాలి. ఇది అసాధారణమైన కోరిక. మరి ఈ కోరిక నెరవేరుతుందో లేదో అనే ఆలోచన శ్రీ షిరిడీ సాయినాధులవారిపై అచంచల విశ్వాసముతో కార్యక్రమము పూర్తిగా చూడ సాగాను. శ్రీ రాఘవేంద్రస్వామివారిపై కార్యక్రమము పూర్తి అయినది. ఈ నా కోరిక అర్ధము లేని కోరిక అని తలచి టీ.వీ. ముందునించి లేచి నా యింటి బయటకు వెళ్ళడానికి సిధ్ధ పడ్డాను. సాయంత్రము ఏడు గంటలు సమయము.. టీ.వీ. లో తదుపరి కార్యక్రమము ప్రాంతీయ వార్తలు. ముఖ్య వార్తలు వినాలనే ఉద్దేశ్యముతో టీ.వీ. ముందునుంచి లేవకుండా అట్లాగే కూర్చున్నాను. వార్తలలో మొదటి వార్త, "ఆంధ్ర ప్రదేశ్ లో లారీల సమ్మెతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించి పోయినది" అని చెబుతూ రోడ్డుపై నిలిచిపోయిన మొదటి లారీని తెరమీద దగ్గరగా చూపించినారు. నా ఆనందానికి అవధులు లేవు. ఆ లారీ మీద శ్రీ షిరిడీ సాయిబా లారీ సర్వీసు అని తెలుగులో పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంది. దానికింద బాబావారి అభయహస్తముతో పెద్ద పటము కూడా ఉంది. నా మనసులోని కోరిక బాబావారు తీర్చినారు కదా. నేను శ్రీ రాఘవేంద్రస్వామి వారి కార్యక్రమము చూస్తూ షిరిడీ సాయినాధులవారిని తలచుకోవడము , నేను టీ.వీ. ముందునుంచి లేచేలోపలే శ్రీ షిరిడీ సాయినాధులవారిని కూడా టీ.వీ. తెరపై చూడగలగటమూ యోగీశ్వరుల వ్యవస్థపై అచంచలమైన నమ్మకాన్ని కలిగించింది. ఈ సంఘటనలో నేను ఎంత ఆనందాన్ని పొందానో పాఠకులు గ్రహించగలరు.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List