08.11.2014 శనివారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గృహస్థులకు సాయి సందేశాలు - 3వ.భాగం
ఆంగ్లమూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411
హైదరాబాద్
ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలను వినండి.
మొదటగా సాయిప్రేరణనుంచి కొన్ని మాటలు ఈ రోజునుండి చదవండి.
1. ఒక్కసారి నా మార్గంలో అడుగుపెట్టి చూడు నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను.
గృహిణి ఆకలితో ఉన్నవారికి గాని, లేక ఏప్రాణికయినా సరే అన్నం పెట్టాలి ఈవిషయాన్ని మనం శ్రీసాయి సత్ చరిత్ర 42వ.అధ్యాయంలో బాబా లక్ష్మీబాయితో అన్న మాటల ద్వారా గ్రహించుకోవచ్చు. బాబా లక్ష్మిబాయితో తనకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పగా ఆమె తెచ్చిన కూర, రొట్టెను ద్వారకామాయిలో ఉన్న కుక్కకు వేశారు. అదేమని ప్రశ్నించినపుడు ఆమెతో బాబా, ఆకుక్క ఆకలిని తీర్చడమంటే నా ఆకలిని తీర్చడంవంటిదే అని చెప్పారు. కుక్కకు కూడా ఆత్మ ఉన్నది. ప్రాణులు వేరయినా ఆకలి అందరికీ ఒక్కటే. ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే అని అన్నారు బాబా. ఈవిధంగా గృహస్థాశ్రమంలో గృహిణి బాధ్యతను శ్రీసాయి మనకందరికీ తెలియచేశారు.
తరువాత, వైవాహిక జీవితంలో స్త్రీ బాధ్యత ఎక్కువగా ఉంటుందని శ్రీసాయి సత్ చరిత్రలో చెప్పబడింది. ముఖ్యంగా ఒక తల్లిగా స్గ్త్రీ బాధ్యతలు ఏమిటనే విషయాలు శ్రీసాయి సత్ చరిత్రలో అనేక చోట్ల వివరింపబడింది. పిల్లలయందు తల్లి బాధ్యతలు అన్నింటికన్నా ఎక్కువగా ఉంటాయి.
పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వారి ఆరోగ్యం కోసం తల్లి దేవీ దేవతలకు మ్రొక్కుకొంటుంది. అది సహజంగా అందరూ చేసేదే. ఈసందర్భంగా మీకు శ్రీసాయి సత్ చరిత్రలోని కొన్ని ఉదాహరణలను వివరిస్తాను. శ్యామా చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడుతున్నపుడు అతని తల్లి వణిలోని సప్తశృంగి దేవతకు తన కుమారునికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మ్రొక్కుకొంది.
ఒక కమ్మరివాని భార్య తన ఒడిలొనున్న బిడ్డ కొలిమిలోనికి జారిపడినప్పుడు, ఆమె తన పిల్లవాడిని రక్షించమని సాయిని ప్రార్ధించింది.
హరిశ్చంద్రపితలే భార్య తన కుమారుని మూర్చరోగం పోగొట్టమని ద్వారకామాయిలో సాయిని వేడుకొంది.
బాబూ టెండుల్కర్ వైద్య పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేడని జ్యోతిష్కులు చెప్పినపుడు, తల్లి షిరిడీకి వచ్చి సాయిని ప్రార్ధించి తన కుమారుడు వైద్య పరీక్షలో పాసయేలాగ సాయినుండి ఆశీర్వచనాలు పొందింది.
లక్ష్మీ ఖాపర్డే తన కుమారుడు ప్లేగు వ్యాధితో షిరిడీలో బాధపడుతున్నపుడు, ఆమె శ్రీసాయిని ప్రార్ధించినపుడు, శ్రీసాయి ఆప్లేగు వ్యాధిని తన మీదకు తీసుకొని లక్ష్మి ఖాపర్డే కుమారుని రక్షించారు.
శ్రీసాయి సత్ చరిత్ర 3వ.అధ్యాయంలో తల్లి తన పిల్లలను ఎలా చూసుకోవాలన్న విషయం వివరింపబడింది. అది సాయిబాబాయొక్క మాతృప్రేమ అనే విషయంలో చెప్పబడింది. బిడ్డకు పాలు ఎప్పుడు కావలెనో అతల్లి గ్రహించి సకాలంలో బిడ్డకు ఆకలి తీరుస్తుంది. తల్లి బిడ్డకు సరియైన సమయంలో కావలసిన రీతిలో దుస్తులు ధరింప చేస్తుంది. కాని, బిడ్డకు ఈవిషయాలేమీ తెలియవు. అదే విధంగా మన సాయిమాత కూడా తన భక్తుల అవసరాలను తీరుస్తూ ఉంటారు.
శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయంలో గృహిణియొక్క ముఖ్యమయిన బాధ్యతలు గురించి మరొక్కసారి వివరింపబడింది. మధ్యాహ్న్నం 12గంటల సమయంలో ఎవరయినా భిక్షకు వచ్చినపుడు యింటి యిల్లాలు కాదనకుండా తన శక్త్యానుసారం భిక్ష యివ్వాలి. ఇదే 33వ.అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణి భార్య, సాయిని పోలిన ఫకీరు తన యింటికి 12గంటలకు భిక్షకు వచ్చినపుడు ఒక రూపాయి దక్షిణ యిచ్చి, తరువాత తన భర్తకు చెప్పగా తిరిగి ఆమె భర్త ఆఫకీరును వెదకి పట్టుకొని పది రూపాయలు దక్షిణ యిచ్చిన సంగతి మనకు తెలుసు.
ఇంతవరకూ మనము వైవాహిక జీవితంలో స్త్రీయొక్క బాధ్యతలను గురించి తెలుసుకొన్నాము.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)