07.11.2014 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గృహస్థులకు సాయి సందేశాలు - 2వ.భాగం
ఆంగ్లమూలం: సాయిబానిస శ్రీ రావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 9440375411
హైదరాబాద్
ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న గృహస్థులకు సాయి సందేశాలు వినండి.
స్త్రీ తన వివాహం తరువాత పుట్టింటివారిని మరచిపోరాదనె విషయాన్ని శ్రీసాయి సత్ చరిత్ర 12వ.అధ్యాయంలో బాబా మనకందరికీ మంచి సందేశాన్నిచ్చారు. నిమోన్ కర్ భార్య బేలాపూర్ లో ఉన్న తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళివస్తానన్నపుడు ఆమె భర్త ఒక్కరోజు మాత్రమే ఉండి వచ్చేయమని చెప్పాడు. అపుడు బాబా కలగచేసుకొని ఆమెను పుట్టింటిలో నాలుగు రోజులు ఉండి బంధువులందరితోను గడిపిన తరువాత షిరిడీకి రమ్మని చెప్పారు.
ఆవిధంగా బాబా, స్త్రీ వివాహమయిన తరువాత తన పుట్టింటివారిని మరువరాదనే మంచి సందేశాన్నివ్వడమే కదా.
భర్త బ్రతికి ఉండగా ప్రారంభించిన మంచి పనులను, అతని మరణానంతరం భార్య కొనసాగించి పూర్తి చేయాలి. ఈవిషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 6వ.అధ్యాయంలో కనిపిస్తుంది. అమీర్ శక్కర్ ద్వారకామాయిలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమినాడు రాత్రి చందనోత్సవం చేస్తూ ఉండేవాడు. అమీర్ శక్కర్ మరణానంతరం అతని భార్య బాబా ఆశీర్వాదంతో చందనోత్సవం జరిపిస్తూ ఆసాంప్రదాయాన్ని కొనసాగించింది.
సంసార స్త్రీ లక్షణాల గురించిన విషయాలను మనము శ్రీహేమాడ్ పంత్ వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్ర మరాఠీ మూల గ్రంధంలోను, ఇందిరా ఖేర్ ఆంగ్లంలో వ్రాసిన పుస్తకంలోను, మణిగారు తెలుగులో తర్జుమా చేసినటువంటి పుస్తకంలోను, అచలానంద సరస్వతి తెలుగులో తర్జుమా చేసిన పుస్తకంలోను మనకు కనిపిస్తాయి. కాని, ఈ విషయాలు మనకు శ్రీవాసుదేవ గుణాజీ ఆంగ్లంలోనికి అనువదించిన శ్రీసాయి సత్ చరిత్రలోను, తెలుగులోనికి అనువాదం చేసిన శ్రీపత్తి నారాయణరావు గ్రంధాలలోను కనిపించవు.
శ్రీసాయి సత్ చరిత్ర 13వ.అధ్యాయంలో క్షయవ్యాధితో బాధపడుతున్న భీమాజీపాటిల్ కి బాబా ఒక స్కూలు టీచరుగా కలలో కనిపించి ఒక పద్యం అప్పచెప్పమంటారు. అతను చెప్పలేకపోయినపుడు ఒక బెత్తంతో దెబ్బలు కొట్టి ఆపద్యాన్ని వల్లె వేయిస్తారు. ఆపద్యానికి అర్ధం ఏమిటంటే "యితరుల గృహాలకు వెళ్ళాలంటే పాము తలపై పాదం మోపినట్లుగా భావించే స్త్రీ, లోభి చేతినుండి డబ్బులాగ అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, యింటిలో ధనము లేకున్నా భర్తను సుఖపెట్టాలనుకునే స్త్రీ, ప్రశాంతమయిన మనసుతో భర్త మనసునెరిగి నడచుకొనే స్త్రీ, నిజమయిన సతి" అని సాయి ఆపద్యం రూపంలో భీమాజీ పాటిల్ చేత వల్లె వేయించారు.
సంసార స్త్రీ అతిధి మర్యాదలు సరిగా చేయాలి. ఈవిషయాన్ని గూర్చి మనం శ్రీసాయి సత్ చరిత్ర 35వ.అధ్యాయంలో చూడగలం. బాలాజీ పాటిల్ నెవాస్కర్ సంవత్సరీకము రోజున అతని భార్య వందమందిని భోజనానికి పిలవగా మూడువందల మంది భోజనానికి వచ్చారు. అతిధి మర్యాదలు ఏవిధంగా చేయాలని కోడలు బాధపడుతుంటే అత్తగారు సాయిని ప్రార్ధించి ఊదీని ఆవంటకాల మీద జల్లమని సలహా యిచ్చింది. ఆ విధంగా వచ్చిన మూడువందల మందికి సక్రమంగా మర్యాదలు చేసి భోజనం వడ్డించి పంపించారు. ఈ సంఘటన ద్వారా సంసార స్త్రీ అతిధి మర్యాదలు సరిగా చేయాలని, సాయి సహాయంతో చక్కగా చేయగలరనీ మనం గ్రహించగలం.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment