03.07.2015 శుక్రవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రద్ధ - సబూరి
బాబా తనభక్తులను పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్లుగా తనవద్దకు రప్పించుకుంటానని చెప్పారు. మొదట్లో సాయిపై నమ్మకం లేకపోయి ఉండవచ్చు. బాబాకు తన భక్తులు ఎంత దూరంలో ఉన్నా సరే, ఏదో ఒక సంఘటన ద్వారా, వారి మనసులను ప్రభావితం చేసి తన భక్తులుగా మార్చుకుంటారు. మనసులో కోరుకున్న కోరికలను కూడా వెంటనే తీర్చి మనకి ఆశ్చర్యాన్ని కలుగ చేస్తారు. ఆ సమయంలో మనకి అది ఒక అధ్బుతమయిన సంఘటనగా కలకాలం గుర్తుండిపోతుంది. ఆవిధంగానే బాబా వారు నాకు షిరిడీలో ఆయన దర్శనానికి వెడుతున్నపుడు మనసులో బాబాకి ప్రసాదం, కనీసం గులాబీలయినా తీసుకెళ్ళకుండ, ఉత్త చేతులతో వెడుతున్నమని తలచుని బాధపడినప్పుడు వెంటనే నా కోర్కెను తీర్చారు. (నా మొట్టమొదటి అనుభూతి). ఆవిధంగా బాబా క్రమక్రమంగా మనకు ధృఢమయిన భక్తి ని కలిగిస్తారు. మనం ఇక వెనుకకు తిరిగి చూసుకోనక్కరలేదు. ఈ రోజు సాయిప్రభ మాసపత్రిక డిసెంబరు, 1987 సంచికలోని ఒక అద్భుతమయిన బాబా లీల తెలుసుకుందాము.
ఓం సాయిరాం
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట్ (హైద్రాబాదు)
సెల్: 9440375411 tyagaraju.a@gmail.com
ఒక నానుడి.
"ఉదారంగా ఉండు. అప్పుడు ఇతరులలో ఇంకా చనిపోకుండా నిద్రాణస్థితిలో ఉన్న ఔదార్యం నీ ఔదార్యంతో కలవడానికి సిధ్ధంగా ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే నీ ఔదార్యాన్ని నువ్వెప్పుడూ కోల్పోవద్దు. నీవల్ల ఇతరులు కూడా ఉదారంగా తయారవుతారు."
ఇతరులలో అంతర్గతంగా నిద్రాణ స్థితిలో ఉన్న కొద్దిపాటి విశ్వాసాన్ని గాని, నమ్మకాన్ని గాని బలోపేతం చేయడానికి మనం సహాయం చేయగలిగినపుడు అందరం కలిసి 'సాయి - నమ్మకం' అనే శక్తివంతమయిన ప్రవాహాన్ని సృష్టించగలం. మనం ఏదయినా విత్తనాన్ని నాటినపుడు అది బలంగా పెరిగి మొక్కవడానికి కావలసిన ఎఱువులను వేస్తాము. అదే విధంగా సహనం, ఓర్పు, పట్టుదల వీటిని కనక మనం ఎల్లప్పుడూ శ్రధ్ధగా ఆచరణలో పెట్టినపుడు సాయి మీద నమ్మకాన్ని మనం మరింతగా వృధ్ధి చేసుకోవచ్చు.