ఏమీ నిన్నుపేక్షింతునా?
12.03.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులారా ఈ రోజు ఒక బాబా లీల అందిస్తున్నందుకు చాలా అనందంగా ఉంది. భగవంతుడు భక్తునికి దాసుడంటారు. అటువంటి లీలను ఈ రోజు మనము తెలుసుకుందాము.
ఈ రోజు మనము శ్రీ సాయి అంకిత భక్తులైన శ్రీ బాపట్ల హనుమంతరావు గారి గురించి తెలుసుకుందాము.
27.12.1944 వేకువ జామున 5 గంటలకు శ్రీ హనుమంతరావు గారికి కలలో, లేత పసుపురంగు లాల్చీ థరించి, అటువంటి రంగుగల వస్త్రమును తలకు ముడి వేసుకుని ఒక సాథురూపమున శ్రీ బాబా వారు సాక్షాత్కరించారు. హనుమంతరావుగారు కలలోనే బాబావారికి సాష్టాంగ నమస్కారము చేశారు. అప్పటికింకా ఆయనకు బాబా గురించి తెలియదు. తనకు దర్శనం ఇచ్చినవారెవరో తెలియక "స్వామీ మీరెవరు? యెందుకు కనిపించారు" అని అడిగారు. "నేను సాయి బాబాను, నీవు ఇదివరకు చాలా గ్రంథాలను రచించావు. మరొక గ్రంథమును రచిద్దామనుకుంటున్నావు. వాటిని అట్లు ఉండనిమ్ము. అని కొన్ని గ్రంథములను చూపిస్తూ "వీనిని వ్రాయుము" అని సాథురూపములో ఉన్న బాబా వారు చెప్పారు. హనుమంతరావు గారు యేమి సమాథానము చెప్పనందు వల్ల "యేమి సందేహించుచున్నావు? నీ ఇష్ట దైవమునే అని చెపుతూ శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి, దత్తాత్రేయ రూపములుగా వారికి దర్శనమిచ్చి, మరలా సాథువుగా కంపించి, "వీనిని రచింపుము" అని అంటూ, తన అభయ హస్తమును హనుమంతరావుగారి శిరశ్శుపై ఉంచి ఆశీర్వదించారు.
1957 లో రాత్రి హనుమంతరావు గారికి కలలో బాబా గారు దర్శనమిచ్చి తన త్రివర్ణ చిత్రమును, "క్యా, తుఝే ఉపేక్షా కర్తాహూ" అనే హిందీ అక్షరములతో వ్రాయబడినదానిని వీరికి బహూకరించారు.
శ్రీ బాపట్ల హనుమంత రావు గా రు సాయి అంకిత భక్తులు. 1962 లో ఒకసారి వీరి యింటికి బంథువులు వచ్చారు. యింటిలో బియ్యం నిండుకున్నాయి. బియ్యం తెచ్చుటకు హనుమంతరావు గారు షాపు కు వెళ్ళారు. అప్పటికే వీరు ఆ షాపు వానికి బాకీ పడి ఉన్నారు. బాకీ యివ్వనిదే అప్పు ఇవ్వడం కుదరదని ఆ వ్యాపారి బియ్యం ఇవ్వలేదు. ఒక్క పది రూపాయలు కూడా యెక్కడా అప్పు పుట్టలేదు. బాథలలోనే మనకు భగవంతుడు గుర్తుకు వస్తాడు అనే మాట యదార్థము. నానా సాహెబ్ చందోర్కర్ తన కుమార్తె మైనతాయి సుఖ ప్రసవమునకు వైద్యము మొదలైన ప్రయత్నాలు చేసి సుఖ ప్రసవమునకు అవకాశము లేని సమయంలో నానాకు సాయి ఊదీ గుర్తుకు రాగానె బాబా ఆదుకున్నారు. ఇక్కడ కూడా హనుమంతరావు గారికి అప్పు దొరకని ఈ కష్టసమయములో శ్రీ సాయిబాబాను ప్రార్థించి తన బాథను విన్నవించుకున్నారు. "నేనుండ భయమేల, యేమి నిన్ను ఉపేక్షింతునా "అని అభయ ప్రదానములు చేసిన ఆపద్బాంథవుడు శ్రీ సాయిబాబా తన భక్తుని యెలా ఆదుకున్నారో చూద్దాము.
ఉదయం హనుమంతరావుగారు బియ్యం అరువు అడగ్గా, నిరాకరించిన ఆ వ్యాపారి రూపమున అర బస్తా బియ్యమును నెత్తిన పెట్టుకుని మోసుకుని హనుమంత రావు గారి యింటికి వచ్చి "మంచి బియ్యము ఇప్పుడే వచ్చాయి, తీసుకుని వచ్చాను . దీనికి డబ్బు తరువాత ఇవ్వచ్చు" అని బియ్యపు బస్తా వాకిట్లో పడవేసి వెళ్ళిపోయాడు. హనుమంతరావు గారు బాబావారికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
ఒకసారి హనుమంతరావుగారు రచనా వ్యాసంగములో ఉండగా అక్కడ ఆయన చెప్పుల జతలోని ఒక చెప్పును ఒక కుక్క నోట కరచుకుని పరుగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు హనుమంతరావుగారు కోపంతో రెంవడచెప్పును కుక్కపైకి విసిరారు. ఆ కుక్క రెండవ చెప్పును కూడా తీసుకుని పరిగెత్తిపోయింది. అప్పుడు హనుమంతరావుగారికి, అన్ని రూపములలో ఉన్నది సాయియే కదా అని గుర్తుకు వచ్చి చాలా బాథ పడ్డారు. "బాబా, నిన్ను గుర్తించక పాదరక్ష విసిరినందుకు శిక్షగా ఇప్పటినుండి నేను పాద రక్షలు థరించను" అని బాబాగారికి విన్నవించుకున్నారు.
అప్పటినుండి పాద రక్షలు లేకుండానే నడవడం మొదలు పెట్టారు. వేసవికాలంలో చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆయన కాళ్ళకు బొబ్బలు యెక్కేవి. ఒక రోజున వీరు బస్సులో వెడుతూ, “బాబా యెండలో చెప్పులు లేకుండా నడవలేను, నన్ను క్షమించు అని ఊరు రాగానే బస్సు దిగి యెండకు కాళ్ళు మాడుతుండగా, పరిగెత్తి ఒక చెట్టు నీడకు చేరారు. యింతలో ఒక వ్యక్తి కర్రకు చెప్పుల జతను తగిలించుకుని హనుంతరావుగారి వద్దకు వచ్చి పంతులుగారూ! ఈ చెప్పుల జత మీ కాళ్ళకు సరిపోతుంది, యివి తీసుకుని మీ జేబులో ఉన్న రెండు రూపాయలు యివ్వండి అని అడిగి చెప్పులని హనుమంతరావుగారి కాళ్ళకు తొడిగాడు.
అనుకోని ఈ సంఘటనకు యాంత్రికంగా అతను అడిగిన రెండురూపాయలు తన జేబునుండి తీసి యివ్వగానే ఆవ్యక్తి వెళ్ళిపోయాడు. తాను బస్సులో చెప్పులు లేకుండా నడవలేను అని అనుకోగానే బాబా తనకు చెప్పులు యిచ్చారని అనుకొంటూ, తన వద్ద రెండు రూపాయలే ఉన్నాయని ఆ వ్యక్తికి యెలా తెలిసినది? యిది అంతా బాబా లీల అనుకుని ఆ వ్యక్తి కోసం వెతికినా కనిపించలేదు.
బాబాచే పాద రక్షలు తొడిగించుకున్న హనుమంతరావుగారు యెంత థన్యులు?
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు