14.07.2013 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
చాలా రోజుల తరువాత మన బ్లాగులో ప్రచురణకు వీలు కుదిరింది..ఆలస్యానికి మన్నించవలసినదిగా బాబావారిని వేడుకుంటు ప్రారంభిస్తున్నాను.
శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 42వ.అధ్యాయం
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 74వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: మనోజవ స్తీర్ధకరో వసురేతా వసుప్రదః |
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ||
నారాయణుని మనస్సునందలి వేగముగా, సృష్టి బీజముగా, సంపద కలిగించువానిగా, తన సాన్నిధ్యము వలన సంపదగా నిచ్చువానిగా, సృష్టియందలి జీవులయందు నివసించువానిగా, ధ్యానము చేయుము. సృష్టి సమస్తమూ మహాయజ్ఞమై, విశ్వమే హవిస్సు కాగా అట్టి పరిణామమే తన మనస్సునందలి హవిస్సుగా నయ్యెను. అవియే ఆయన జీవులకిచ్చు సృష్టియను సంపద.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 42వ.అధ్యాయము
14.02.1992
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయమునకు, నా జీవితానికి గల సంబంధము నేను మాటలలో చెప్పలేను. నేను అనేక సార్లు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ చేసినాను. 42,43,44 అధ్యాయాలు పారాయణ చేస్తున్నపుడు నేను 1918 సంవత్సరానికి వెనక్కి వెళ్ళిపోయి బాబా మహాసమాధి గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.