19.10.2015 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఇంతకు ముందు మనం శ్రీ జీ.ఎస్. కాపర్డే గారి గురించి తెలుసుకున్నాము. ఈ రోజునుండి ఆయన వ్రాసిన డైరీలలోని కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాము. కపర్డే గారు బాబా ని సాయి మహరాజ్ అనే సంబోధించి తన డైరీలలో వ్రాశారు. ఇక చదవండి.
శ్రీ.జీ.ఎస్.ఖపర్డే - డైరీ
డిసెంబర్ 5 సోమవారం 1910
మన్మాడ్ - షిరిడి
అనుకున్న ప్రకారం క్రిందటి రోజు రాత్రి 10.15 కి రైలులో నేను, మా అబ్బాయి బాబా, బయలుదేరాము. మమ్మల్ని సాగనంపడానికి పురందరే, పధారే, స్టేషనుకి వచ్చారు. మొదటి యిద్దరూ పూల గుత్తులు తెచ్చారు. రైలు పెట్టెలోకి ప్రవేశించగానే నిద్రపోయాను. కాని మధ్య మధ్యలో మెలకువ వచ్చి లేస్తూనే ఉన్నాను.
ఉదయం 9 గంటలకి మన్మాడ్ చేరుకున్నాము. మధ్యాహ్నం ఒంటి గంట దాకా స్టేషన్ లోనే ఉన్నాము. ఒకరిద్దరు యువకులతో మాకు పరిచయం కలిగింది. వారు అక్కడ ఉండే స్టేషన్ సిబ్బంది. వారు మాకు కావలసిన సహాయం చేశారు. ఏవలాలో ఉండే హరిపంత్ అనే వ్యక్తి మాతో కలిశాడు. కోపర్ గావ్ కి వెళ్ళే రైలులో మాకు ఒక ఆంగ్లేయుడితో పరిచయం కలిగింది. అతను ఎంతో మర్యాదస్తుడిలా ఉన్నాడు. మధ్యాహ్నం రెండు గంటలకి కోపర్ గావ్ చేరుకున్నాము.
రెండు బళ్ళు మాట్లాడుకుని ఒకదానిలో సామాన్లు పెట్టి, రెండవదానిలో మేము కూర్చొన్నాము. గుఱ్ఱపు బళ్ళు ఏర్పాటు చేయడంలో భాస్కరరావు మాకు సాయం చేశాడు. అతని ఇంటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి తినడానికి జామపళ్ళు ఇచ్చాడు. తరువాత అతను కూడా మాతో షిరిడీకి వచ్చాడు. సాయంత్రం 4 గంటలకి షిరిడీ చేరుకున్నాము. సాఠే వాడాలో దిగాము. మాధవరావ్ దేశ్ పాండే మమ్మల్ని ఎంతో గౌరవంతో ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేశాడు. వాడాలో అప్పటికే తాత్యాసాహెబ్ నూల్కర్ తన కుటుంబంతో ఉన్నాడు. బాపూ సాహెబ్ జోగ్, బాబా సాహెబ్ సహస్ర బుద్ధే కూడా అక్కడే ఉన్నారు. అక్కడికి చేరుకోగానే మేమంతా సాయిమహరాజ్ ను దర్శించుకోవటానికి వెళ్ళాము. ఆయన మసీదులో ఉన్నారు. ఆయనకు నమస్కరించుకొని నేను, మా అబ్బాయి మేము తెచ్చిన పళ్ళను సమర్పించాము. ఆయన దక్షిణ అడిగితే అది సమర్పించాము. రెండు సంవత్సరాలకు పైగా ఆరోగ్యం సరిగా లేదని సాయి మహరాజ్ చెప్పారు. కేవలం బార్లీ రొట్టి, నీళ్ళు మాత్రమే తీసుకుంటున్నానని చెప్పారు. ఆయన తన పాదం మీద వేసిన కురుపు చూపించి అది నారి కురుపు వ్యాధని చెప్పారు. పురుగును బయటకు లాగినా తెగిపోయి మళ్ళీ వచ్చిందని చెప్పారు. తన స్వగ్రామానికి వెళ్ళేదాకా అది మానదని ఎవరో చెప్పారని అన్నారు. ఆవిషయం తన దృష్టిలో ఉంచుకున్నాననీ, కానీ తన ప్రాణం కన్నా తనవారి పట్లే తనకు ఎక్కువ శ్రధ్ధ అని చెప్పారు. ప్రజలు తనను ఇబ్బంది పెడుతున్నారనీ తనకు విశ్రాంతి దొరకటంలేదని అన్నారు. ఏమీ చేయలేని పరిస్థితని చెప్పారు. మమ్మల్ని ఇక వెళ్ళిపొమ్మని చెప్పారు. ఇక మేము బయలుదేరి వచ్చేశాము. సాయంత్రం ఆయన వాడా ప్రక్కనుండి వెడుతుండగా మేము వెళ్ళి ఆయనకు నమస్కరించుకొన్నాము. నేను, మాధవరావు దేశ్ పాండే ఇద్దరం ఉన్నాము. నమస్కారాలయాక "వాడాకు వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చోండి" అన్నారు బాబా. నేను, మాధవరావు దేశ్ పాండే తిరిగి వచ్చేశాము. మేమంతా కూర్చుని మాట్లాడుకొంటున్నాము. వారందరికి కలిగిన అనుభవాలు, ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. నాకు నాకొడుకు బాబా, బాబా సాహెబ్ సహస్రబుద్ధే, మాకు రాత్రికి తినడానికి ఏవో కాస్త ఉన్నాయి. తరువాత నిద్రపోవడానికి పక్క మీదకు చేరాను. అప్పుడు ఒక ఆశ్చర్యకరమయిన వింత జరిగింది. 'అర్వాచిం భక్త లీలామృతం' వ్రాసిన దాసగణుగారి భార్య తాయి నాప్రక్కన వచ్చి కూర్చుంది. ఆమె అలా ఎంత సేపు కూర్చుని ఉందో నాకు తెలీదు.
డిసెంబరు 6, 1910, మంగళవారం
ఉదయం పాపం తాయి మీదే ఎక్కువగా చర్చ జరిగింది. వారంతా ఆమెను నిందించారు. పాపం ఆమె పిచ్చి తనానికి నాకు చాలా జాలి కలిగింది. కాసేపు నడకకు వెళ్ళి వచ్చిన తరువాత స్నానం చేసి మేమంతా సాయి మహరాజ్ ను చూడటానికి వెళ్ళాము. దారాలతో పువ్వులు కుట్టబడి (ఎంబ్రాయిడరీ) ఉన్న పెద్ద గొడుగు వేసుకుని సాయి మహరాజ్ బయటకు వెడుతున్నారు.
తరువాత మేమంతా మసీదుకు వెళ్ళాము. సాయి మహరాజ్ మాట్లాడుతున్నారు. ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నారు. బెదిరించడం వల్ల ఉపయోగం లేదు. దాని వల్ల మంచి జరగదు. మనం ఎందుకని బెదిరించాలి?
భగవంతుని యొక్క సర్వోన్నుతులయిన అధికారులు ఎంతోమంది ఉన్నారు. వారు చాలా శక్తిమంతులు. తరచుగా ఆయన ఇదే మాట మరల మరల చెపుతూనే ఉన్నారు. ఆయన ఎందుకో ఉద్వేగంగా ఉన్నారు. ఆ తరువాత ఆయన లేచి అక్కడ ఉన్న ఆహార పదార్ధాలన్నిటిని అందరికీ పంచి పెట్టారు. మాకు ఊదీ ఇచ్చి ఇంక వెళ్ళిపొమ్మని చెప్పారు. మేము వచ్చేశాము. దాదాపు మధ్యాహ్నం రెండున్నరకు గాని భోజనం పెట్టలేదు. తరువాత మేము కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఆ సాయంత్రం సాయి మహరాజు వ్యాహ్యాళికి వచ్చినపుడు వారిని దర్శించుకున్నాము. ఆ రాత్రికి సాయి మహరాజు నిద్రించే చావడికి వెళ్ళాము.
అక్కడ ఆయనకు చత్రం, వెండి బెత్తం, పంకాలు మొదలైనవన్నీ ఉన్నాయి. చావడిని చక్కని దీపాలతో అలంకరించారు. రాధాకృష్ణ మాయి దీపాలను తీసుకుని బయటకు వచ్చింది. ఆమె అహ్మద్ నగర్ నివాసి బాబాసాహెబ్ దేశ్ పాండేకి బంధువు. నేనామెను దూరం నుండి చూశాను. మాధవరావు దేశ్ పాండే తను ఊరిలో ఉండననీ తర్వాతి రోజు తిరిగి వస్తానని చెప్పాడు. వెళ్ళడానికి అతను సాయి మహరాజ్ అనుమతి అడిగి, ఆయన అనుమతిని పొందాడు.
(మరికొన్ని ముఖ్యమైన ఘట్టాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment