16.09.2015 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు,
వినాయకచవితి శుభాకాంక్షలు
ఈరోజు శ్రీసాయికి అంకితభక్తులైనవారిలో తాత్యాసాహెబ్ నూల్కర్ గురించి తెలుసుకుందాము.
తాత్యాసాహెబ్ నూల్కర్ - 1
ఆంగ్లమూలం: లెప్టినెంట్ కర్నల్ ఎం.బీ.నింబాల్కర్
అనువాదం: సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు
నిర్భయమైన మరణాన్ని పొంది సాయి పాదాలలో లయమైపోయిన తాత్యాసాహెబ్ నూల్కర్.
శ్రీహేమాద్రి పంతు మరాఠీ భాషలో వ్రాసిన శ్రీసాయి సత్ చరిత్రలోను దాని ఆంగ్ల తెలుగు అనువాదములలోను శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ కు సంబంధించిన విషయాలు ఎక్కువగా చోటు చేసుకోలేదు. అదృష్ఠవశాత్తు తాత్యాసాహెబ్ నూల్కర్ యొక్క మనుమడు శ్రీరఘునాధ్ విశ్వనాధ్ నూల్కర్ ను కలవటం తటస్థించింది. శ్రీరఘునాధ్ విశ్వనాధుల నుండి మరియు తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితులనుండి, శ్రీతాత్యాసాహెబు, నానా సాహెబ్ చందోర్కర్ కు వ్రాసిన ఉత్తరాలనుండి అనేక విషయాలను సేకరించి ఈవ్యాసము వ్రాయటం ప్రారంభిస్తున్నాను.
తాత్యాసాహెబ్ జీవిత విషయాలు, శ్రీసాయితో వారి మొదటి పరిచయం:
తాత్యాసాహెబ్ పూనాలోని హైస్కూల్ లో ప్రాధమిక విద్యను అభ్యసించారు. వారు చిన్న తనంలోనే ఉపనిషత్తులు మరియు అనేక ఆధ్యాత్మిక గ్రంధాలు చదివారు. వారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రోజులలో వారిలోని కార్యదక్షత, నిస్వార్ధ ప్రయాణత్వము, నమ్మక గుణమును ప్రభుత్వం గుర్తించింది.
1908వ.సంవత్సరంలో శ్రీతాత్యాసాహెబు పండరీపురములోని కోర్టులో సబ్ జడ్జిగా పనిచేస్తూ ఉండేవారు. అదే సమయంలో శ్రీనానాసాహెబ్ చందోర్కర్ పండరీపురానికి మామలతదారుగా ఉండేవారు. ఇరువురు మంచి స్నేహితులు, నానాసాహెబ్ చందోర్కర్ మాట కాదనలేక షిరిడి వెళ్ళి శ్రీసాయిబాబా దర్శనం చేయటానికి రెండు షరతులపై శ్రీతాత్యాసాహెబ్ అంగీకరించారు. మొదటి షరతు : షిరిడీ గ్రామంలో తనకు వంట చేసి పెట్టడానికి బ్రాహ్మణ వంటవాడు లభించాలి. రెండవ షరతు : శ్రీసాయిబాబాకు కానుకగా ఇవ్వటానికి నాగపూర్ కమలాఫలాలు లభించాలి. శ్రీసాయిబాబా పై నమ్మకంతో శ్రీనానాసాహెబ్ చందోర్కర్ "శ్రీసాయిదయతో నీ ఈ రెండు షరతులు ఫలిస్తాయి" అని అన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదేరోజు రాత్రి ఒక బ్రాహ్మణ వంటవాడు తనకు పని ఇప్పించమని నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరకు వచ్చాడు. శ్రీచందోర్కర్ వానిని మరుసటిరోజు ఉదయాన్నే తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపించారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు గంపనిండ నాగపూర్ కమలాలు తెచ్చి శ్రీతాత్యా సాహెబ్ నూల్కర్ కు ఇచ్చారు.
ఈవిధముగా తన రెండు షరతులు పూర్తికావడంతో శ్రీతాత్యాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కర్ తో కలిసి అదేరోజున షిరిడీకి ప్రయణమయ్యారు.
శ్రీతాత్యాసాహెబ్ ద్వారకామాయికి చేరుకొని శ్రీసాయికి సాష్టాంగ నమస్కారం చేశారు. తాత్యాసాహెబ్ పొట్టిగా లావుగా ఉండేవారు.
ఆయన శ్రీసాయిపాదాల చెంత కూర్చున్నపుడు శ్రీసాయి, తాత్యాసాహెబ్ తలపై తన చేయి పెట్టి ఐదువేళ్ళతో మెల్లిగా ఒత్తినపుడు తాత్యా వర్ణింపశక్యము కాని ఆనందాన్ని పొందారు. అదేరోజు రాత్రి తాత్యాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కర్ తో కలసి సాఠేవాడాలో బస చేశారు. రాత్రి భోజనాలు అనంతరం తాత్యాసాహెబ్ కు తాంబూలం సేవించాలనే కోరిక కలిగింది. నానాసాహెబ్ చందోర్కర్ కి తాబూలం సేవించే అలవాటు లేదు. తాత్యాసాహెబ్ తన కోర్కెను అణచుకోలేని స్థితిలో ఉన్నారు. అదే సమయంలో ద్వారకామాయిలో ఉన్న సాయి, ఒక భక్తుడుని పిలిచి తన దగ్గర ఉన్న తమలపాకులను, వక్క, సున్నమును సాఠేవాడాలో ఉన్న తాత్యాసాహెబ్, నాసాహేబ్ చందోర్కర్ లకు పంపి వారిని ఆశ్చర్యపరిచారు. తన మనసులోని ఆలోచనలను గ్రహించగల శక్తిని శ్రీసాయి కలిగి ఉన్నారని తాత్యా అంగీకరించారు. మరుసటిరోజు ఉదయాన్నే ద్వారకామాయికి వెళ్ళి తన్నుతానుగా శ్రీసాయికి అర్పించుకొన్నారు. శ్రీతాత్యాసాహెబ్ నూల్కర్ ఆనాటినుండి పండరీపూర్ లో కోర్టులకు శెలవులు ప్రకటించినపుడు మరియు తనంతటతాను శెలవు తీసుకొన్నపుడు తాత్యాసాహెబ్ షిరిడీకి వచ్చి శ్రీసాయి సన్నిధిలో కాలం గడిపేవారు.
(రేపు కళ్ళజబ్బును బాగుచేయుట గురించి తెలుసుకుందాము)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment