ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రం 36 వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: స్కంధః స్కంధధరోధుర్యో వరదో వాయు వాహనః
వాసుదేవో బృహద్భానురాది దేవః పురంధరః ||
తాత్పర్యం: పరమాత్మను రాక్షస సం హారమునకై దేవతల సైన్యమును నడుపు సుబ్రహ్మణ్యేశ్వరునిగా, అగ్నిగా, గంగగా, కృత్తికులైనవారిగా, మరియూ వీరిని ఆయన జన్మకు కారకులైనవారిగా ధ్యానము చేయుము. మొట్టమొదటి కాంతిగా, వరములిచ్చువానిగా, వాయువే తన వాహనమైనవానిగా, అందరిలో వారి ప్రవర్తనగా వసించు దేవునిగ, మరియు గొప్ప ప్రకాశవంతునిగా, రాక్షసుల పురములను నశింప చేయువానిగా ధ్యానము చేయుము.
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 11 వ అధ్యాయము (చివరి భాగము)
బాబా ఊదీ ఉన్నచోట ప్లేగు వ్యాధి ఉండదు.
నేను షిరిడీలో ఉన్నపుడు ఒక రోజు రాత్రి సుమారు 9 గంటలకు శ్యామా సోదరుడు బాబాజీ తన స్వగ్రామం నుండి వచ్చాడు. అతను చాలా భయస్తుడు. తన భార్య ప్లేగు వ్యాధితో బాధ పడుతున్నదనీ జ్వరం కూడా బాగా తీవ్రంగా ఉండి రెండు బొబ్బలు కూడా వచ్చాయని చెప్పాడు.
శ్యామాని వెంటనే తనతోపాటుగా బయలుదేరమన్నాడు. శ్యామా వెంటనే బాబా వద్దకు వెళ్ళి తాను తన సోదరుడితో కూడా గ్రామానికి వెళ్ళడానికి అనుమతి కోరాడు. బాబా శ్యామాతో "యింత రాత్రివేళ పొద్దు పోయాక ఎందుకని ప్రయాణం చేద్దామనుకుంటునావు. రేపు ఉదయం వెళ్ళు. ఇపుడు వారికి ఊదీ ప్రసాదం పంపంచు" అన్నారు. ఈమాటలు వినగానె శ్యామా సోదరుడు బాబాజీ తీవ్ర నిరాశ, ఆందోళనకు గురయాడు. కాని, శ్యామాకు ఏవిధమయిన ఆందోళన కలుగలేదు. అతను బాబా సలహా ప్రకారం షిరిడీలోనే ఉండి, ఊదీ ప్రసాదం పంపించాడు. మరునాడు ఉదయం బాబా అనుమతి తీసుకొని, బాబాజీ భార్య పరిస్థితి ఎట్లాఉందో తెలుసుకోవడానికి తన స్వగ్రామమయిన సావుల్ విర్ కి బయలుదేరాడు. శ్యామా తన గ్రామానికి ప్రయాణమై బయలుదేరబోతూండగా బాబా అతనిని వెంటనే తిరిగి వచ్చేయమని చెప్పారు. శ్యామా, బాబాజీ యింటికి చేరుకోగానే, బాబాజీ భార్యకు జ్వరం తగ్గిపోయింది. బొబ్బలు కూడా పూర్తిగా నయమయిపోయాయి. ఆవిడ టీ తయారు చేస్తూ ఉండటం చూశాడు. బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. మాధవరావు (శ్యామా) వెంటనే షిరిడీకి తిరుగు ప్రయాణమయ్యాడు.
భక్తి లేని చోట మనశ్శాంతి ఉండదు.
దాదా కేల్కర్ స్నేహితుడు అనంతరావ్ పాటన్ కర్ పూనా నివాసి. అతనికి వేదాంతం అంటే బాగా వెర్రి అబిమానం. వేదాంతం మీద ఉపన్యాసాలు కూడా యిస్తూ ఉండేవాడు. ఒకసారి అతను హడావిడిగా బాబా దర్శనానికి వచ్చాడు. తాను ఎన్ని వేదాంత గ్రంధాలు చదివినా స్థిరబుధ్ధి లేదనీ, మనశ్శాంతి కూడా కరువయిందనీ బాబా వద్ద తన బాధను వెళ్ళబోసుకొన్నాడు. అపుడు బాబా ఈవిధంగా సమాధానమిచ్చారు. "ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడతని ఎదుట ఒక గుఱ్ఱం తొమ్మిది లద్దెలను వేసింది. అవి భుమిమీద పడగానె ఆ వ్యాపారి ఆ లద్దెలన్నిటినీ తన ఉత్తరీయం కొంగులో మూటకట్టుకొన్నాడు" పాటంకర్ కి సాయినాధులవారు చెప్పిన విషయం, దాని అర్ధం ఏమీ బోధపడలేదు. అనంతరావు మసీదు నుండి వాడాకు తిరిగివచ్చి బాబాకు తనకు మధ్య జరిగిన సంభాషణను సవిస్తరంగా చెప్పి దాని అర్ధమేమయి ఉంటుందని కేల్కర్ ను అడిగాడు. తనకు కూడా దాని అర్ధం తెలియటల్లేదని కేల్కర్ జవాబిచ్చి, తనకు అర్ధమయినంతలో ఈవిధంగా చెప్పాడు. "బాబా మాటలు నిగూఢంగా ఉంటాయి. ఈశ్వరుని కృపే ఆ గుఱ్ఱం. తొమ్మిది లద్దెలు అనగా నవవిధ భక్తిని గురించిన విషయం. భక్తి లేకుండా పరమేశ్వరుని సాంగత్యం లబించదు. ఒక్క జ్ఞానంతో మాత్రమే ప్రాప్తించదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, చరణ సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం యివి నవవిధ భక్తి మార్గాలు, అని చెప్పారు. మరునాడు అనంతరావు బాబా దర్శనానికి వెళ్ళినపుడు, బాబా "నేను చెప్పినట్లుగా తొమ్మిది లద్దెలను మూట కట్టుకొన్నావా? అని అడిగారు. అనంతరావు వెంటనే బాబా పాదాలను పట్టుకొని మీకృప వుంటే అది సాధ్యమే బాబా" అన్నాడు. బాబా అతనిని ఆశీర్వదించి స్థైర్యాన్ని కలుగచేశారు. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవలసినది ధృఢమైన భక్తి లేనపుడు మనసు చంచలంగా ఉండి మనశ్శాంతి కరువవుతుంది.
యితరుల లోపాలను ఎంచినచో పలు రకాల శిక్షలకు గురి అవడమే.
ఒకసారి వాడాలో బాబా ఎదుట చాలామంది కూర్చొని ఉన్నారు. వారిలో ఉన్న ఒకవ్యక్తి మరొకరి గురించి చాలా పరుషంగా మాట్లాడుతూ అతనిలోని లోపాలను, తప్పులను ఎంచి అందరి ఎదుట అవమానకరంగా మాట్లాడసాగాడు. అతని ప్రవర్తన చాలామందికి నచ్చలేదు. తరువాత అతను మూత్ర విసర్జనకు వెళ్ళాడు. ఆసమయంలో బాబా లెండీనుంచి వాడాకు తిరిగి వస్తున్నారు. వచ్చిన తరువాత అక్కడున్నవారిని యితరుని గురించి చెడుగా మాట్లాడుతున్నదెవరని వాకబు చేశారు. అతను మూత్ర విసర్జనకు వెళ్ళినాడని నేను చెప్పాను. కొంతసేపటికి అతను వచ్చిన తరువాత బాబా అతని గురించి వాకబు చేసిన విషయాన్ని చెప్పాను. బాబా అక్కడనున్న ఒక పందిని చూపించి "చూడండి, అది మానవ వ్యర్ధాన్ని ఎంత ప్రీతికరంగా తింటొందో. ఆదృశ్యం మనకు ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. అలాగే యితరులలోని దోషాలను వేలెత్తి చూపడమన్నా సరిగా అలాంటిదే. యితరులను నిందించడంలో మనసుకు లోలోపల సంతోషం కలిగించవచ్చు. కాని, యితరులకు ఆమాటలు వినడం చికాకును కలిగిస్తుంది. అందుచేత మనం యితరుల గురించి చెడుగా మాట్లాడకూడదు అన్నారు బాబా.
అయిపోయింది
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment