Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, September 25, 2011

బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 11

Posted by tyagaraju on 7:39 AM

25.09.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

గత నాలుగు రోజులుగా సాయి బా ని స అనుభవాలను అందించలేకపోయాను. హైదరాబాదు నుంచి నరసాపురం ప్రయాణం, వచ్చిన తరువాత ఇప్పటి పరిస్థితులలో కరంటు కోత వల్ల వీలు పడకపోవడం మొదలయిన కారణాలతో ఆలశ్యమయింది.

ఈ రోజు సాయి బా ని స అనుభవాలలో 11 వ అనుభవాన్ని మీకందిస్తున్నాను.


బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు. 11

శ్రీ సాయి తన భక్తుల కలలలో కనపడి కొన్ని విషయాలను చెప్పి, భవిష్యత్తు గురించి తగు జాగ్రత్తలను చెప్పేవారని మరియు వారితో తన అనుబంధాలను తెలియచేసేవారని శ్రీ సాయి సచ్చరిత్రలో అనేక చోట్ల ఉదహరింపబడింది. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు హెచ్చరికలు ఇంతకుముందు నా అనుభవాలలో మీకు నేను తెలియచేసి ఉన్నాను. ఈ రోజున బాబా నాతో పంచుకున్న ప్రేమానుభూతులను నేను మీకు తెలియచేయదలచుకున్నాను.

అది 1991 వ.సంవత్సరము శ్రీరామనవమి పర్వదినము తెల్లవారుజామున నా కలలో శ్రీ సాయి ఒక సాధువు రూపములో దర్శనమిచ్చి, తాను రామ లక్ష్మణుల రూపములో మాయింటికి వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకుని వెడతానని సూచించడం జరిగింది.

నేను ఉదయము నిద్రనుండి లేచిన తరువాత ఈ విషయాన్ని నా భార్యకు తెలియచేసినాను. అప్పట్లో నా భార్య సాయి భక్తురాలు కాదు. అందుచేత నేను చెప్పిన మాటలకు నా భార్య ఒక చిరునవ్వు నవ్వి నేను చెప్పినదంతా తేలికగా తీసుకుని నా మాటలను నిర్లక్ష్యముగా తీసుకున్నది. శ్రీ రామనవమి పండగ సందర్భముగా నా యింట బాబాకు నాలుగు హారతులు ఇచ్చాను. నా భార్య వచ్చిన వారందరికీ తీర్ధ ప్రసాదములు పంచిపెట్టింది. నేను, నాభార్య, నిద్రకు ఉపక్రమించేముందు నా భార్య నన్ను ఒక ఇబ్బంది కలిగించే ప్రశ్న వేసింది. "ఈ రోజున బాబా రామలక్ష్మణుల రూపములో మన యింటికి వస్తారని చెప్పినారు కదా మరి వచ్చి తీర్ధ ప్రసాదములు స్వీకరించారా" అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న నాలో అనేక ఆలోచనలను రేకెత్తించింది. నేను ఆరోజు నా యింటికి వచ్చిన అతిధులందరి గురించీ ఆలోచించాను. సాయంత్రపు హారతి సమయములో నా మితృడు రఘురామన్ తన ఇద్దరు కుమార్తెలతో వచ్చి తీర్ద ప్రసాదములు స్వీకరించిన ఘట్టము పదే పదే నా మనసులో మెదల సాగింది. రాత్రి కలలో శ్రీ సాయి సన్యాసి రూపములో తిరిగి దర్శనమిచ్చి నా స్నేహితుని ఇద్దరు పిల్లలని చూపించినాడు. ఉదయము నిద్రనించి లేచిన తరువాత నా సందేహాన్ని, నా భార్య సందేహాన్ని నివృత్తి చేసుకుందుకు ఆఫీసులో నా మితృడు రఘురామన్ ని కలిసి అతని ఇద్దరు కుమార్తెల గురించి అడిగినాను. అతను చెప్పిన సమాధానము నాకు సంతోషము కలిగించింది. అతని కుమార్తెలిద్దరూ కవల పిల్లలు. దక్షిణ భారత దేశంలో కవల పిల్లలకు సాధారణముగా రామ లక్ష్మణుల పేర్లే పట్టుకుంటారు. ఈ విషయాలన్ని సాయంత్రము నాభార్యకు తెలియచేసి కలలో తన భక్తులకు చెప్పిన మాటలను సాయి నిలబెట్టుకుంటారని గట్టిగా నమ్ముతూ సాయి పాదాలకు నమస్కరించాను.

ఇప్పుడు నా రెండవ అనుభవాన్ని చెపుతాను. అది మా అమ్మాయి వివాహ పనులు చేసుకునే సమయము. నేను మా అమ్మాయి కాబోయే అత్తవారింటికి 1992 మార్చ్ ఏడవ తారీకున వెళ్ళి కట్న కానుక విషయాలన్ని స్థిరము చేసుకుని, తిరిగి ఎనిమిదవ తారీకు తెల్లవారుజామున ఈష్టు కోష్టు రైలుకు హైదరాబాదుకు బయలుదేరాలని నిశ్చయించుకున్నాను. మార్చ్ ఏడవ తారీకు రాత్రి అనగా ఎనిమిదవ తారీకు తెల్లవారుజామున శ్రీ సాయి ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి రూపములో సూటు, బూటు, హాటు, నల్లకళ్ళద్దాలు పెట్టుకుని నా వద్దకు వచ్చి మీ వియ్యాల వారికి పెండ్లి లాంఛనాల నిమిత్తము ధనము ఇచ్చినావే మరి నాకు అయిదు రూపాయలు దక్షిణ ఇవ్వగలవా అని అడిగినారు. నేను నిద్రనుండి లేచి విశాఖపట్నము రైల్వే స్టేషనుకు బయలుదేరినాను. ఉదయము అయిదు గంటలకు రావలసిన రైలు ఒక గంట ఆలశ్యముగా వచ్చునని రైల్వే అధికారులు తెలియచేసినారు. నేను రైలు రాక కోసము ఒకటొ నంబరు ప్లాట్పారము బెంచీ మీద కూర్చున్నాను. అది సూర్యోదయ సమయము. ప్లాట్ ఫారము చివరినుండి సూటు, బూటు, హాటు, నల్లకళ్ళద్దాలు ధరించిన వ్యక్తి నా పక్క బెంచీ మీద కూర్చున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే కొద్ది గంటల క్రితము కలలో సాయి దర్శనమిచ్చి అన్న మాటలు గుర్తుకు వచ్చినవి. నా పక్క బెంచీ మీద కూర్చున్న వ్యక్తి శ్రీ సాయి అని గట్టిగా నమ్మినాను. నేను ఆయనకి అయిదు రూపాయలు దక్షిణ ఇచ్చినా ఆయన తిరస్కరించితే నేను తట్టుకోలేను. కాని నేను ఆయనకి ఏవిథంగా ఇవ్వగలను అని ఆలోచనలో నా జేబులోంచి అయిదు రూపాయల నోటు తీసుకుని ఆ వ్యక్తి కూర్చున్న బెంచీ వద్దకు వెళ్ళి ఆవ్యక్తి పాదాల వద్ద అయిదురూపాయల నోటు జారవిడిచాను. ఏమీ తెలియనట్లుగా ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, మీజేబులోంచి అయిదు రూపాయల నోటు కింద పడవేసుకున్నట్లున్నారే అని చెప్పి ఆ నోటు తీసి అతని చేతికిచ్చినాను. ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఆ వ్యక్తి నేనిచ్చిన నోటును స్వీకరించి నా వైపు చిన్న చిరునవ్వు విసిరి తిరిగి ప్లాట్ ఫారము చివరికి వెళ్ళి కనుమరుగైపోయినాడు. శ్రీ సాయి ఈ వ్యక్తి రూపములో వచ్చి నానుండి అయిదురూపాయల దక్షిణ స్వీకరించారనే భావనతో నా రెండు చేతులు పైకి యెత్తి ఆ వ్యక్తికి నమస్కరించాను.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List