08.12.2015 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు 'ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి' 26 నవంబరు సంచికలో ప్రచురించిన ఒక అద్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను.
ఈ లీలలో 'ఝుంకా భకార్, బాబా కి నైవేద్యం పెట్టినట్లు మీరు చదవబోతున్నారు. ఝుంకా భకార్ అనేది మహారాష్ట్రలోని వారు చేసుకునే వంటకం. భకార్ అనేది జొన్న పిండితో చేసే జొన్న రొట్టె. ఝుంకా అనేది ఆ రొట్టెలలో నంచుకుని తినేందుకు చేసే చట్నీ. ఝుంకా చట్నీ ని మన ప్రాంతంలో 'చింతామణి చట్నీ' అంటారు. ఈ చట్నీని శనగపిండితో చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది.
దీనికి సంబంధించిన వీడియో లింకులు కూడా ఇస్తున్నాను చూడండి. ఇక బాబా లీలను అందరం ఆస్వాదిద్దామా? తరువాతి సంచికలొ యధావిధిగా శ్రీ జీ.ఎస్. కపర్డే డైరీ ప్రచురిస్తాను. మధ్య మధ్యలో బాబా లీలలను ప్రచురిస్తూ ఉంటాను.
ఝుంకా భకార్ కి సంబంధించిన వీడియో లింకులు
https://www.youtube.com/watch? v=Pz8-DCxy4VI (Zhunka Bhakar)
షిరిడీ సాయి వైభవం - బాబా మహిమ అమోఘం
కేశవ్ ఎం.గవాంకర్ తన తల్లిదండ్రులతో బొంబాయిలో ఉన్నప్పుడు, అతనికి 7 సంవత్సరాల వయసులో తీవ్రమైన జ్వరం వచ్చింది. ఎంతో మంది వైద్యులకి చూపించి మందులు వాడినా ఏమాత్రం తగ్గలేదు. జ్వర తీవ్రత చాలా హెచ్చుగా ఉంది. చాతీ అంతా ద్రవం, రసిలతో నిండిపోయింది. చావుకు దగ్గరగా ఉన్నాడు. వారింటికి దగ్గరలోనే ఉన్న సాయిభక్తుడయిన గాల్వంకర్ (ధబోల్కర్ గారి అల్లుడు), బాబాని ప్రార్ధించి మొక్కుకోమని అతని తల్లిదండ్రులకి సలహా ఇచ్చాడు. వారింటి ప్రక్కనే ఉన్న అతని మేనత్త, తన మేనల్లుడికి నయమయితే అందరం కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు పాలకోవాలు సమర్పించుకుంటానని మొక్కుకుంది.
మరునాడు ప్రొద్దున్నే తల్లిదండ్రులు తమ కుమారుడి జ్వరం తగ్గిపోయిందని గమనించారు. అంతే కాక అబ్బాయి ఛాతీ మీద కుచాగ్రం క్రిందుగా చిన్న కన్నం, అందులోనుండి, రసి, ద్రవం కారుతూ ఉండటం వారికి కనపడింది. . కొన్ని గంటల తరువాత పిల్లవాడిని చూడటానికి వచ్చిన వైద్యుడు, పిల్లవానికి జ్వరం తగ్గుముఖం పట్టడంతో ఆశ్చర్యపోయాడు. కొన్ని మందులు రాసిచ్చి, వాటిని వాడమని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులలోనే ఆ అబ్బాయి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతుడయాడు. ఛాతీ మీద చిన్న చారిక ఏర్పడింది.
అయిదు సంవత్సరాల తరువాత కేశవ్ కి 12 సంవత్సరాల వయసున్నపుడు మరాఠీ స్కూలులో అయిదవ తరగతి చదువుతున్నాడు. అప్పుడు అందరూ షిరిడీ వెళ్ళారు. కేశవ్, అతని తల్లిదండ్రులు, మేనత్త అందరూ కలిసి ద్వారకామాయికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు. బాబాకి పాలకోవాలు ఉన్న పాకెట్ సమర్పించారు. బాబా పాకెట్ తీసుకుని అందులోనుంచి 6 కోవాలు కేశవ్ కి ఇచ్చి, మిగిలినవి తాను తిన్నారు. అది చూసి ప్రక్కనే ఉన్న శ్యామా "దేవా, ఏమిటిది? అన్ని కోవాలు నువ్వే తింటున్నావు?" అన్నాడు. బాబా కేశవ్ మేనత్తవైపు చూపిస్తూ "ఆమె నన్ను అయిదు సంవత్సరాలనుంచి ఆకలితో ఉంచింది" అన్నారు. అప్పుడు బాబా కేశవ్ ని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకుని తన చేతితో అతని వీపంతా నిమిరారు. బాబా కేశవ్ ని రెండు పైసలు దక్షిణ అడిగారు. జరుగున్నదేమిటో కేశవ్ కి అర్ధం కాలేదు. అందుచేత శ్యామా మధ్యలో కల్పించుకుని కేశవ్ రావ్ తో, " బాబా! నేను నీకు దక్షిణ ఇచ్చేశాను. నువ్వు తీసుకున్నావు కూడా" అని చెప్పు చాలు అన్నాడు. ఆవిధంగామాధవరావు చెప్పమన్నట్లు కేశవరావ్ చెప్పగానే బాబా దానికి అంగీకరించి, తన కఫినీని తీసి కేశవ్ కి ఇచ్చారు. శ్యామా మళ్ళీ కల్పించుకుని కేశవ్ తరఫున "బాబా, నీ మహాప్రసదాన్ని (కఫినీ) తీసుకోవడానికి శ్యామా చాలా చిన్నవాడు. అతను కాస్త పెద్దవాడయేంత వరకు ఆ కఫనీ నావద్ద ఉండనీ తరువాత నేను దానిని కేశవ్ కి ఇస్తాను దేవా" అన్నాడు.మరలా బాబా దీనికి సమ్మతించారు.
శ్యామా ఆ కఫనీని ఎంతో ప్రేమతో తన వద్ద భద్రపరచి, కేశవ్ పెద్దాడయిన తరువాత సరయిన సమయం చూసి అతనికిచ్చాడు.
కుటుంబమంతా లేచి వెళ్ళబోయేముందు ముకుళిత హస్తాలతో బాబాకు నమస్కరించారు. కేశవ్ కూడా అలాగే చేశాడు. బాబా కేశవ్ వైపు చూసి తన దగ్గరకు రమ్మన్నట్లుగా సైగ చేశారు. బాబా అతని చేతిని పట్టుకుని మృదువుగా లాగి తనవద్ద కూర్చోబెట్టుకున్నారు. కేశవ్ దగ్గరగా కూర్చోగానే బాబా వేగంగా అతని చెంప మీద కొట్టారు. కేశవ్ కి తల తిరిగిపోయి నక్షత్రాలు కనిపించాయి. అతని శరీరమంతా కంపించిపోయి వణకడం మొదలు పెట్టి కొన్ని గంటలపాటు అదే స్థితిలో ఉండిపోయాడు. అపుడు ఆయన అతని జుట్టు పట్టుకుని అతని తలని లాగిపట్టి తన పాదాల వద్ద ఉంచారు. బాబా అతని నుదుటి మీద ఊదీ రాసి చేతినిండా ఊదీని అతనికిచ్చి, "జావో, బేటా, అల్లా భలా కరేగా" (అబ్బాయీ వెళ్ళు, అల్లా నీకు మేలు చేస్తాడు) అన్నారు.
కేశవ్ మోక్షగురువు (త్ర్యంబక్ విఠల్ సామంత్ (బాహు మహరాజ్). ఆయన 1914 లో షిరిడి వచ్చినపుడు బాబాకు రెండు రూపాయలు దక్షిణ ఇచ్చారు. బాబా ఇంకా రెండు రూపాయలు అడిగి "మా అబ్బాయిలలో ఒకడిని (కేశవ్) నీ వద్దకు పంపిస్తాను" అన్నారు. తన గురువు అనుగ్రహంతో కేశవ్ ఆధ్యాత్మిక గ్రంధాలను అధ్యయనం చేశాడు. అతను డాక్టరయ్యి మంచి పేరు గడించాడు. కాని, అతను బాబాని మర్చిపోలేదు. ప్రతిరోజూ బాబాని ప్రార్ధించేవాడు. సంవత్సరాలు గడిచేకొద్దీ బాబాకు గొప్ప భక్తుడయాడు. బొంబాయిలో తన గృహంలో రామనవమి, విజయదశమి జరుపుకోవడం ప్రారంభించాడు. ఈ రెండు పండుగలలోను, తనకున్నంతలో అన్నదానం జరిపించేవాడు. 1939 వ.సంవత్సరంలో బాబా అతనికి కలలో దర్శనమిచ్చి "భిక్షాకా భకార్ లే గోడే" (భిక్ష ద్వారా లభించిన భకార్ చాలా మధురంగా ఉంది) అన్నారు. అందుచేత అతను భిక్ష ద్వారా లభించినదానితో అన్నదానం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇది అతను బొంబాయ్ లో సునీల్ మాన్షన్ లో ఉన్నపుడు జరిగింది. భిక్ష ద్వారా అతనికి ఏడు రాసుల జొన్నలు వచ్చాయి. వాటినుండి ఝుంకా భకార్ తయారు చేశారు. సుమారు 250 నుండి 300 మంది దాకా కడుపునిండా భుజించారు. అన్నదానం ప్రారంభించేముందు 11 ఝుంకా భకార్ లు బాబాకు నైవేద్యంగా సమర్పించారు. నైవేద్యం పెట్టినవాటిలో ఒక రొట్టెను బాబా వద్ద ఉంచి మిగిలినవాటిని చిన్న ముక్కలుగా చేసి అందరికీ ప్రసాదంగా పంచి పెట్టారు. విచిత్రంలో కన్నా విచిత్రం ఏమిటంటే బాబా ముందు ఉంచిన జొన్న రొట్టె 35 సంవత్సరాలు, ఇంకా ఆతరువాత కూడా పాడవలేదు, రుచి కోల్పోలేదు, ఫంగస్ పట్టలేదు, ఇప్పటికీ దానికి చీమలు కూడా పట్టలేదు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment