06.12.2015 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నవంబరు నెలంతా ప్రచురించలేకపోయాను. క్షంతవ్యుడను. తిరుపతి యాత్ర తరువాత అనారోగ్యం, తరువాత బంధువుల పెండ్లికి వెళ్ళడం వల్ల, ప్రచురణలో వెనక పడ్డాను. ఈ రోజునుండి తిరిగి శ్రీ జీ .ఎస్.కపర్డే గారి డైరీలోని విషయాలను ప్రచురిస్తున్నాను.
శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 9
డిసెంబరు, 16, 1911
నాకు బాగా జలుబు చేసింది. కాకడ ఆరతి వేళకు లేవలేకయాను. ఉదయం 3 గంటలకు లేచాను. తరువాత మళ్ళీ బాగా నిద్రపోయాను. ప్రార్ధన తరువాత దర్వేష్ సాహెబ్ ఫాల్కేతో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆయనను హాజీసాహెబ్ అనీ, హజరత్ అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మాన్ని బట్టి ఆయనను కర్మయోగి అనవచ్చు.
సాయి మహరాజ్ మసీదునుండి బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దర్శించుకున్నాను. ఆయన మంచి ఉల్లాసంగా ఉన్నారు. హాస్యాలాడుతూ కబుర్లు చెబుతూ కూర్చున్నారు. ఆరతి అయిన తరువాత బసకు తిరిగి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకున్నాను కాని నిద్ర పట్టలేదు. అమరావతి నుండి అమృతబజారు పత్రికతోపాటుగా రెండు 'బోంబే అడ్వొకేట్' పుస్తకాలు కూడా పంపించారు. చదువుకోవడానికి మంచి కాలక్షేపం. వార్ధాలో సెషన్స్ కేసు ఉందని మూడు రోజుల క్రితం టెలిగ్రాం వచ్చింది. నేను తిరిగి వెళ్ళడానికి సాయి మహరాజ్ అనుమతినివ్వకపోవడంతో దానిని తిరస్కరించాను. ఈ రోజు వచ్చిన టెలిగ్రాం కూడా దానికి సంబంధించినదే. నా గురించి మాధవరావు దేశ్ పాండే సాయి మహరాజ్ ను అనుమతి కోరాడు. ఆయన మరునాడు కాని ఒక నెల తరువాత కాని వెళ్ళవచ్చన్నారు. అందుచేత ఆ విషయం నిర్ధారణ అయిపోయింది. యధాప్రకారంగా చావడి ముందర ఆయనకు నమస్కరించుకున్నాను.
ఆరతి అయిన తరువాత వాడాలో భీష్మ భజన విన్నాను. నాభార్య తన చేతి గాజులు మార్పించి మరలా చేయించుకోవడానికి ప్రక్క గ్రామం రహతాకు ఉదయాన్నే వెళ్ళింది. ఇవాళ వచ్చిన క్రొత్తవారిలో హాటే ఉన్నాడు. అతడు చాలా మంచి యువకుడు. అతని తండ్రి జడ్జిగా, ఆతరువాత పాలిటోనియాలో దివానుగా పని చేశారు. ఆయన పినతండ్రి నాకు తెలుసు.
డిసెంబరు 17, 1911
షిరిడీ
జలుబు కాస్త నయమయింది కాని ఇంకా పూర్తిగా తగ్గలేదు. కాని ఆరోగ్యం పాడయినట్లుగా ఉంది. షింగ్లే కాస్త సోడా, యాసిడ్ పౌడరు ఇచ్చాడు. వాటిని పాలల్లో కలుపుకుని త్రాగాను. కడుపులో కొంచం గడబిడ తగ్గి కాస్త కుదుట పడ్డాను. నా భార్య నడుము, కాళ్ళ నొప్పి వల్ల పడుకునే ఉంది. ప్రార్ధన తరువాత సాయిమహరాజ్ బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నాను. ఆయన మంచి ఉల్లాసంగా ఉన్నారు. ఆయన చతురోక్తులు మాకెంతో ఆనందాన్ని కల్గించాయి. బిల్వ పత్రాలు తేవడానికి వెళ్ళిన మేఘా ఆలస్యంగా రావడంతో అల్పాహారం తీసుకోవడం ఆలస్యమయింది. మధ్యాహ్నం హాజీ సాహెబ్ ఫాల్కే, డా.హాటే, షింగ్లే ఇంకా మరికొందరితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఈ రోజు గోఖలే వెళ్ళిపోయాడు. అతని చర్యలు చూస్తే అతనిలో గూఢచారి లక్షణాలన్ని కనిపిస్తాయి. నాగపూర్ సబ్ జడ్జి అయిన ఆత్రే తనకు స్నేహితుడని చెప్పాడు. సాయంత్రం మశీదుకు వెళ్లాను. సాయి మహరాజ్ నన్ను, నాతో వచ్చినవాళ్ళని దూరం నుండే నమస్కారం చేసుకోమని చెప్పారు. ఆయన మా అబ్బాయి బల్వంతు ను పిలిచి దక్షిణ అడిగారు. చావడి ఎదురుగా మేము ఆయనకు నమస్కరించి రాత్రి శేజ్ ఆరతికి వెళ్ళాను. ఈ రాత్రికి సాయి మహరాజ్ చావడిలొ నిద్రిస్తారు.
(మరికొన్ని విషయాలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment