15.12.2014 సోమవారం
సాయి బధువులకు బాబావారి శుభాశీస్సులు
రైలు క్రింద పడినామె ఏమయింది?????
ఈ రోజు సాయి లీల ద్వైమాసపత్రిక మే-జూన్ 2008 సంవత్సరం సంచికలో ప్రచురింపబడిన ఒక అద్భుతమైన లీలని తెలుసుకొందాము.
దేహానంతరం తరువాత కూడా బాబా తన అధ్బుత లీలలను ప్రదర్శిస్తూనే వున్నారన్నదానికి ఇది మరొక లీల.
శ్రీమతి సోనాల్ మోహన్ భిడే, (302, ఓం సత్యేంద్ర సొసైటీ, రాజాజీ పాత్, రెండవ వీధి, పాట్ కర్ స్కూల్ వద్దస్, డొంబివ్లి,(తూర్పు) థానే జిల్లా, మహరాష్ట్ర.
ఆరోజు డిశెంబరు 6వ.తారీకు, 2007వ.సంవత్సరం. ప్రదేశం: ఠానే రైల్వే స్టేషన్, ప్లాట్ ఫారం నం.2, సమయం రాత్రి గం.9.30 ని.
నా మొబైల్ లో సాయి భజన పాటలు వింటూ డోంబివ్లి కి వెళ్ళే రైలు కోసం నిరీక్షిస్తూ ఉన్నాను. అప్పుడే రైలు స్టేషన్ లోకి వస్తూ ఉంది. నేను కొంచెం ముందుకు వెళ్ళాను. అకస్మాత్తుగా ఒక దొంగ నా చేతిలోని మొబైల్ ను లాక్కుని పట్టాల మీదకు దూకి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అనుకోకుండా జరిగిన ఆ హటాత్ సంఘటనకి, దొంగ నానుండి మొబైల్ లాక్కోవడం వల్ల కలిగిన ఆ అదురుపాటుకి ముందుకు తూలి నేను రైలు పట్టాలమీద పడిపోయాను.
మృత్యువు నాముఖంలోకి తేరిపార చూస్తున్నట్లుగా కనిపించింది. రైలింజను హెడ్ లైటులు నాకు దగ్గరగా రాగానే నాకుంటుంబ సభ్యులందరూ నాకళ్ళముందు కనిపించారు. నేను సాయిని "ఇపుడు నువ్వేం చేస్తావో నీయిష్టం" అని ప్రార్ధించాను. సాయి ప్రేరణ వల్లనే కావచ్చు వెంటనే నేను ఎడమవైపుకు తిరిగి, చిన్నమూటలాగ ముడుచుకొని ఉండిపోయాను.
రైలు డ్రైవరు వెంటనే బ్రేక్ వేశాడు. కాని రైలు నామీదనుంచి మూడు బోగీలు వెళ్ళిన తరువాత ఆగింది. ప్లాట్ ఫారం మీద ఉన్న ప్రయాణీకులందరూ "ఎవరో ఒకామె రైలు కింద పడిపోయింది. బహుశ ఆమె చనిపోయే ఉంటుంది. శరీరమంతా ముక్కలు ముక్కలయి ఉంటుంది" అని బిగ్గరగా అరిచారు. కాని నేను బోగీల చక్రాల మధ్య ఖాళీ గుండా పాకుకుంటూ వచ్చేసరికి వారి ఆశ్చర్యానందాలకి అంతు లేదు. వారంతా సంతోషంతో "ఆమె క్షేమంగా తిరిగి వచ్చింది" అని కేకలు వేశారు.
నాచేతిలో ఉన్న పర్సు, బ్యాగ్ అలాగే ఉన్నాయి. నేను సల్వార్ కమీజ్, దుపట్టా దుస్తులతో ఉన్నాను. కాని నాశరీరం మీద ఎక్కడా కూడా చిన్నపాటి గీరుడు కూడా లేదు. ఇది అధ్బుతం కాదూ? నాకు ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మ ప్రసాదించిన నా సాయిని జీవితాంతం మరువలేను.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment