సత్సంగము27.01.2011 గురువారము
సాయి బంథువులారా ఈ రోజు సత్సంగము గురించి, ఇక్కడ మేము చేసే సత్సంగ విథానము గురించి, వివరంగా చెపుతున్నాను.
సత్సంగము: మంచి వ్యక్తులతో సాంగత్యము. సజ్జనులతో సాంగత్యము. ఈ సాంగత్యములో మనము అందరూ కలిసి భగవంతుని గురించి, భక్తి గురించి, భగవంతుని లీలలు గురించి చర్చింకుంటూ ఉండాలి. బాబా సత్సంగము చేస్తే
ఇంకా అద్భుతంగా ఉంటుంది. బాబా లీలలని స్వయంగా అనుభవించవచ్చు. మీకు ఇంతకుముందు మా సత్సంగములోని లీలలు, సత్సంగము బాబాగారి అనుగ్రహముతో ప్రారంభించబదిన లీల గురించి తెలియచేయడం జరిగింది.
యెక్కడయితే సత్సంగము జరుగుతూ ఉంటుందో అక్కడ బాబా గారు వచ్చి కూర్చుంటారు. ఇంతకుముందు ప్రచురించిన లీలలో కూడా బాబా గారి రాక గురించి ప్రస్తావించడం జరిగింది.
మేము మానరసాపురంలో ప్రతీ శనివారము సాయంత్రము 4 గంటలకు సత్సంగము ప్రారంభిస్తాము. ఇప్పుడు సాయంత్రము 6 గంటలకు మార్చాము. ఉద్యోగస్తులకి కూడా అనుకూలముగా ఉండాలనే ఉద్దేశ్యముతో మార్చడం జరిగింది. 2 గంటలదాకా సత్సంగము నిర్వహిస్తాము.
సత్సంగము ప్రారంభించడానికి మేము యేవిథమయిన చందాలు వసూలు చేయము. యెవరిని మనంతటమనము అడగరాదు. సాయి భక్తులు యేమిస్తే అది తీసుకుంటాము. ఆ వచ్చిన సొమ్మునే సత్సంగానికి ఖర్చు పెడతాము.
సత్సంగములో బాబా ఫొటొ పెడతాము. యెవరింటిలోనయితే సత్సంగము జరిపించుకుంటారొ వారి ఇంటికి కొత్త బాబా ఫోటొ కొని పట్టికెడతాము. మా సత్సంగానికి ప్రత్యేకముగా పెద్ద ఫొటొ ఒకటి తయారు చేయించాము. సత్సంగములో మొదటగ పీఠము వేసి దాని మీద బాబా ఫొటొలు, ఇంక ఇతర దేవుళ్ళ విగ్రహాలు గాని, ఫొటోలు గాని పెడతాము. పూలతో అలంకరిస్తాము. సత్సంగము యెవరి ఇంటిలో జరుగుతోందో ఆయింటి దంపతులు బాబా ఫొటొ ముందు కూర్చుని పూజ (అష్టోత్తరం) చేస్తారు. తరువాత ప్రసాదములు యేవిచేస్తే అవి బాబా గారికి నైవేద్యము పెడతాము.
మొదటగా సాయి చాలీసా గాని, సాయి నక్షత్ర మాలిక గాని అందరము కలిసి చదువుతాము. దాని తరువాత కనులు మూసుకుని 108 సార్లు, బాబా నామ జపము చేస్తాము. 108 కి పట్టే సమయము సుమారుగ 10 లేక 12 నిమిషములు పడుతుంది. దానికి, ఒకరు సెల్ ఫోన్ లో టయిము అలారం పెట్టి టైం అవగానే గుర్తుగా "సచ్చిదానంద సాయి మహరాజ్ కీ జై" అంటారు. ఈ నామ జపము సుఖాసనములో కూర్చుని కనులు మూసుకుని చెయ్యాలి. పూర్తి అయేంతవరకు కనులు తెరవకూడదు.
తరువాత సచ్చరిత్రలో ఒకరు ఒక అథ్యాయము చదువుతారు. అంటే ప్రతీవారం ఒక అథ్యాయము చొప్పున చదువుతాము.
అనగా సత్సంగము మొట్టమొదటగా ప్రారంభిస్తే మొదటి అథ్యాయము, తరువాతనుంచి వరసగా ప్రతీవారం వరుస క్రమంలో చదువుతూ ఉండాలి.
తరువాత ఆ అథ్యాయమునకు ఒక సాయి బంథువు వ్యాఖ్యానము చెపుతారు. తరువాత బాబా లీలలు గురించి, యెవరికయినా బాబా అనుభవములు కలిగితే వాటి గురించి చెప్పుకుంటాము.
సత్సంగ ప్రార్థన
సత్సంగములో ఒకరు ప్రార్థన చేస్తారు. బాబా గారిని ఉద్దేశ్యించి, యెవరికయినా అనారోగ్యముగా ఉన్నా, ఒకవేళ యేదయినా పనిలొ విజయం సాథించడానికి,యెవరికయినా సమస్యలు ఉన్నా అవి తీర్చమని బాబా ని వేడుకుంటాము. ఈ సత్సంగములో పాల్గొన్న ప్రతీవారిని దయతో చూడమని బాబాని వేడుకుంటాము.
తరువాత సమయాన్ని బట్టి బాబా మీద పాటలు పాడతాము, భజనలు చేస్తాము. సయాన్ని బట్టి 4, 5 పాటలు గట్టిగా పాడుకుంటాము.
ఇక 6 గంటలు అవుతుండగా అందరమూ లేచి నిలబడి, బాబా కి ఆరతి పాటలు పాడుతూ ఆరతి ఇస్తాము.
ఆరతి అయిపోగానే సాయి బంథువులందరూ బాబా ఫోటొముందు సాష్టాంగ నమస్కారము చేసి తోచిన దక్షిణ పెడతారు.
తరువాత సాయి బంథువులందరికి ప్రసాదములు పంచి పెడతాము.
యెవరింటిలోనయితే సత్సంగము చేస్తారో వారు దక్షిణగా యేది ఇస్తే అది తీసుకుంటాము. భక్తులు వేసిన దక్షిణ అంతా తీసి ఒక రిజిస్టరు లో అంతా వివరంగా రాస్తాము.
తరువాత ఆ ఇంటివారికి సత్సంగము చేయడానికి కొన్న బాబా ఫొటొ ఇచ్చివేయడం జరుగుతుంది. ప్రతీరోజు ఆ ఫొటొకి కూడా పూజలు చేయమని చెపుతాము. పూజ గదిలో పెట్టి ప్రతీ రోజూ చేసే పూజలతో పాటుగా, పూజ చేస్తూ ఉండాలి.
దూర ప్రాంతములకు కూడా వెళ్ళి మేము సత్సంగము చేస్తాము. అప్పుడు కూడా ఈ సత్సంగమునకు వచ్చిన సొమ్మునుంచే ఖర్చు పెడతాము.
మా సత్సంగము పేరు
శ్రీ ద్వారకామాయి సాయి బంథు సేవా సత్సంగ్
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment