
18.08.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
సాయితో మరికొన్ని అనుభవాలలో
భూతంతో యెదురు దాడి
ప్రియమైన పాఠకులారా మనం 21 వ శతాబ్దంలో పయనిస్తున్నామని నాకు బాగా తెలుసు. దెయ్యాలు ఉన్నాయని నమ్మడం చాలా కష్టం. నేను యింజనీరుని. సైన్స్ ని గట్టిగా నమ్మేవాడిని. ఈ ప్రపంచంలో ఉన్నాను. ఈ అనుభవం మా నాన్నగారిది పైగా అది కూడా నమ్మ శక్యం కాని బాబా చేసిన దైవసంబంథమయిన కార్యాలతో పవిత్ర ప్రదేశమైన షిరిడీ బాబా వారి కర్మ భూమిలో జరిగినది.. అందుచేత నేను మా నాన్నగారు చెప్పిన ఈ అనుభవం నాలో నిక్షిప్తమై ఉన్నదాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకుని మీకు వివరిస్తాను. ఆయన షిరిడీ కి చేసిన యాత్రలలో, ఒక యాత్రలో ఒక రోజున పొద్దున్నే ఆయన కాలకృత్యాలను తీర్చుకుంటున్నారు.
యిది నది ఒడ్డు దగ్గరున్న వాగు వద్దజరిగింది. ఆయన ఒక రావి చెట్టుకింద కుర్చున్నారు. అప్పుడు యింకా చీకటిగా ఉంది, ఆయనకు తన ముందు ఒక అడవి కోడి కనపడింది. ఆ కోడికూస్తోంది.
కాని ఆ కూత శబ్దం చాలా చోద్యంగా ఉంది. మానాన్నగారు కూడా యింతకుముందు యెప్పుడూ అటువంటి కోడి కూత వినలేదు. ఆ కోడి మా నాన్నగారి దృష్టిని తనవైపుకు ఆకర్షించుకుంది. మా నాన్నగారు దానినే గమనిస్తున్నారు. హటాత్తుగా ఆ కోడి నలుపురంగు పాముగా మారిపోయింది. ఆ పాము పైకి నిటారుగా లేచి పడగ విప్పింది. మా నాన్నగారు భయపడి బాబా సాయంకోసం ప్రార్థించారు. కొంత సేపటి తరువాత ఆ పాము ఆక్కడినుంచి మాయమయిపోయింది. మా నాన్నగారికి చావు భయం పట్టుకుంది. మా నాన్నగారు తొందరగా కాలకృత్యాలను పూర్తి కానిచ్చి ఆ చోటునించి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు.అలా ఆయన ఆ ప్రయత్నంలో ఉండగా యెవరో " హే మానసా (మానవా) నేను ప్రతీరోజూ నడిచే చోట నువ్వు కూర్చుంటున్నావు. నా దారిలోంచి వెళ్ళిపొమ్మని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అని అనడం విన్నారు. వెంటనే ఆయన ముందు అందవికారంగా ఉన్న ఒక మరుగుజ్జుమనిషి నిలబడ్డాడు.
మా నాన్నగారు అతనితో, అతను వెళ్ళడానికి అతని చుట్టూ చాలా స్థలం ఉందనీ అందుచేత తన కాల కృత్యాలు పుర్తవగానే, యేమయినప్పటికీ తానా ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతాననీ చెప్పారు. కాని ఆ మరుగుజ్జు యింకా యింకా పొడుగ్గా పెరిగిపోవడం మొదలెట్టి "నువ్వు నన్ను గుర్తించలేదా? నేను భూతాన్ని (వేతాళ్). యిది నా రాజ్యం నేను మరొకసారి నిన్ను యిక్కడినుంచి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు.
మా నాన్నగారు బాగా భయపడినప్పటికీ, ఆ ప్రదేశానికి బాబాయే యజమాని మరేవరూ కాదని గుర్తు చేసుకుని, షిరిడీనుంచి వెళ్ళిపొమ్మనే అధికారం బాబాకే ఉందని అనుకున్నారు. మా నాన్నగారు చేతినిండా మట్టిని తీసుకుని బాబా పేరు ఉచ్చరిస్తూ, పొడుగ్గా ఉన్న ఆ భూతం మీదకు విసిరి, రక్షించమని బాబాని ప్రార్థించారు. ఆ భూతం ఉన్న ప్రదేశంలో పొగ పెద్ద రేఖలా అవడం చూశారు. ఆ పొగ గాలిలో కలిసిపోయింది.
మా నాన్నగారు ఆ ప్రదేశం నించి పరుగెత్తుకుని వెళ్ళిపోయారు. స్నానం చేశాక పలహారం చేసి, ద్వారకామాయికి వెళ్ళారు. ఆయన బాబా పాదాల వద్దకు చేరుకోగానే బాబా పరిహాసం చేస్తున్నట్లుగా "హే భావూ! ఈ రోజు పొద్దున్నే నా ఊదీ కావాలని దేనికడిగావు?" అన్నారు. మా నాన్నగారు ఆయన పాదాలమీద పడి జరిగినదంతా చెప్పారు. అలా చెబుతూ, మా నాన్నగారు అప్పుడు తన వద్ద ఊదీ లేదని షిరిడీ మట్టిని తీసుకుని (బాబావారి కర్మ భూమి) దానిని ఊదీగా భావించి ఆ భూతం మీదకు విసిరానని చెప్పారు. అది విని బాబా "భావూ ! నువ్వీరోజు మంచి పని చేశావు. నువ్వు ఆ భూతానికి ముక్తి కలిగించావు" అన్నారు. మా నాన్నగారు, తాను, తన దేవుడు అనగా బాబా నించి వచ్చిన సూచనల ప్రకారమే చేశానని కారణం ఆ భయానక క్షణంలో తనకు ఆలోచనాశక్తి నశించిందని చెప్పారు. ఆయన బాబాకు మనఃపూర్వకమైన థన్యవాదాలు తెలుపుకున్నారు. బాబా అనుమతితో ఈ ప్రపంచంలో భూతాలు, దెయ్యాలు నిజమేనా అని బాబాని అదిగారు. బాబా, "భావూ ! యిది కూడా భగవంతుని సృష్టి, కాని గుర్తుంచుకో నాశనకారికన్న రక్షించేవాడు యెప్పుడూ శక్తిమంతుడు. నేనిక్కడ పవిత్రమయిన ద్వారకామాయిలో కూర్చుని వుండగా నీకెవరూ హాని చేయలేరు. షిరిడీలో థైర్యంగా ఉండు" అని సమాథానమిచ్చారు.
ప్రియమైన సాయి భక్తులారా యిది చెపుతున్నపుడు మీరందరూ నన్ను నమ్మండి. నా శరీరం అంతా ప్రకంపనాలు వస్తున్నాయి. నేను మీఅందరినీ కోరేదేమంటే దయ చేసి దీనిని నమ్మండి. ఏ విథంగా చూసినప్పటికి అది మానాన్నగారి భ్రమ కాదు. కారణం ఆయనలా యెందుకు చేస్తారు? మా నాన్నగారికి జిజ్ఞాసతో మనసులో ప్రశ్నలు వస్తూఉంటాయని నాకు తెలుసు. బాబా వాటిని తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఉండేవారు. ఆ కాలంలో చాలా మంది ఆయన భక్తులకి యిది జరిగి ఉండవచ్చు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు









0 comments:
Post a Comment