20.08.2011 శనివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
సాయితో మరికొన్ని అనుభవాలలో -- సాయితో మరువరాని ఆ...ఖ...రి...కలయిక
సాయితో మరువరాని ఆ...ఖ...రి...కలయిక
లార్డ్ సాయితో తార్ఖడ్ కుటుంబంవారి స్వీయానుభవాలను వివరించడం పూర్తి చేశాను. తార్ఖడ్ కుటుంబానికి లార్డ్ సాయితో సాహచర్యం కలగడానికి కారణం వారి పూర్వ పుణ్యసుకృతం వల్లనేనని యిప్పుడు ప్రతివారు ఖచ్చితంగా అనుకుంటారు. ఒక విశేషం మీరు గమనించి వుంటారు. వారు బాబానుంచి యెప్పుడూ ఏదీ కోరలేదని. వారు మొదట షిరిడీ వెళ్ళినపుడు కూడా శారీరక బాథనుండి ఉపశమనం కోసమే అయినప్పటికీ వారి షిరిడీ రాకకి కారణం కూడా తెలియపర్చవలసిన అవసరం కూడా రాలేదు. బాబావారు ఆలోచనను ఉన్నది ఉన్నట్లుగా చదవగలిగి వారిని తనకు దగ్గరగా చేసుకోవడానికి వారిపై తన దీవెనలను కురిపించారు.
అది 1918 సం. నవరాత్రి రోజులు అనుకుంటాను, కారణం బాబా, బాథపడుతున్న పులికి మోక్షాన్ని ప్రసాదించిన ఏడు రోజులకి విజయదశమి నాడు మహా సమాథి చెందారు. బాబా బాగా పెద్దవారయిపోయారు. ఆనకి చెరొకవైపు యిద్దరు భక్తుల సహాయంతో నడిచేవారు.
ఒకరోజు సాయంత్రం పెట్రోమాక్స్ దీపాలని వాటి వాటి స్థానాలలో ఉంచిన తరువాత, మా నాన్నగారు బాబా చాలా అలసటగా ఉండటం చూశారు. ఆయన బాబాతో కాస్త ఉపశమనంగానూ, సౌఖ్యంగానూ, ఉంటుందని కాళ్ళు నొక్కమంటారా అని అడిగారు. " నీ కోరికను నువ్వు వెల్లడించావు. నీ తృప్తికోసం అలాగే కానీ" అన్నారు బాబా. మా నాన్నగారు ఆయన పాదాలవద్ద కూర్చున్నారు. కొంచెం సేపయిన తరువాత బాబా ఆయనవైపు తిరిగి "భావూ ! యిదే మన ఆఖరి కలయిక దీని తరువాత మనం కలుసుకోము. షిరిడీకి చాలా రకాలయిన ప్రజలు వస్తారని నీకు తెలుసు. వారంతా సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం వగైరా యిలాంటి రకరకాలయిన కోరికలు నానుంచి పొందటం కోసం వస్తారు. నేనెవ్వరినీ నిరాశ పరచను. వారి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తాను భగవంతుడు కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలని తీరుస్తాడు. నా దగ్గరకు వచ్చినవాళ్ళలో ఏమీ అడగనివాళ్ళలో నువ్వు ఒకడివి. నీకు వివాహము అవకపోవడంవల్ల, సంసారం లేకపోవడం వల్ల నీకు ఏదీ అవసరమనిపించకపోవచ్చు. కాని, భావూ, మనం యిక ఎప్పటికీ కలుసుకోలేము కాబట్టి నీకిష్టమైనది ఏదయినా అడుగు. లేకపోతే నువ్వింతవరకు నాకు చేసిన సేవలన్నిటికీ యెప్పటికి ఋణగ్రస్థుడినవుతాను" అన్నారు. మా నాన్నగారు అప్పుడు "బాబా నీదయవల్ల జీవితంలో నాకన్నీ ఉన్నాయి. నాకు ఈ భౌతికమయినవేమీ అవసరం లేదు. నీ ఆశీర్వాదాలు యెల్లప్పుడూ నామీద ఉండేలా మాత్రం చూడు. యెటువంటి పరిస్థితులలో కూడా భవిష్యత్తులో నువ్వు నా జ్ఞాపకాలనుంచి మాత్రం తొలగిపోవద్దు (హేచి దాన్ దేగా దేతుఝా నిసార్ న వ్హవ) అన్నారు. బాబా 'భావూ, నా భక్తుల విథి నిర్వహణకు నేను బథ్థుడను. ప్రత్యేకంగా నీకోసం ఏదయినా ఆడగమని నేను అడుగుతున్నాను. కారణం ప్రతీ మానవునికి అతని/ఆమెకి తమకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తమ జీవితంలో విజయవంతంగా సాగడానికి బయటనుంచి సహాయం అవసరమవుతుంది. మొహమాట పడకుండా అడుగు?" అన్నారు. మా నాన్నగారు అది తనకి పరీక్ష అనుకున్నారు. బాబా నువ్వు అంతగా నొక్కి చెపుతున్నావు కనక నేనడిగేముందు నా కోరికను కాదనకుండా తీరుస్తానని మాటివ్వు" అన్నారు. అప్పుడు బాబా, "భావూ, నేను చాలా మంది కోరికలను తీర్చాను. నువ్వు నాయందు లేశమాత్రమైనా అనుమానం పెట్టుకోవద్దు. నువ్వుఅడుగు నేను తీరుస్తాను" అన్నారు. మా నాన్నగారు, "బాబా నాకు నీనుంచి ఒక్కటే కావాలి. నాకు ఏ జన్మనయినా యివ్వు నేను నీ పాదాలను చూడాలి" .
బాబా అప్పుడు కొంచెంసేపు మవునంగ ఉన్నారు. ఆయన నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ చెప్పారు. "భావూ ఈ నీ కోరికను నేను తీర్చలేను", మా నాన్నగారు "బాబా నేనేదీ కోరటంలేదు. ఈ విషయంలో నువ్వే బలవంత పెట్టావు. యిది తప్ప నీ నుంచి నాకింకేమీ అవసరం లేదు" అన్నారు. అప్పుడు బాబా ఒక చిరునవ్వు నవ్వి, "భావూ యెంతో మంది షిరిడీకి వస్తారు. కాని నీలాగా నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది కొద్దిమంది. నీ కోరికతో నువ్వు నన్ను శాశ్వతంగా బథ్థుణ్ణి చేద్దామనుకుంటున్నావు. ఈ విథంగా యెవరితోనూ బంథం ఏర్పరచుకోవడానికి నాకు నా ప్రభువునుంచి అనుమతి లేదు. ఏమయినప్పటికి నువ్వు నిరాశ పడనవసరంలేదు. మన తరువాతి జన్మలో మనకి పది సంవత్సరాల వయసప్పుడు మనమిద్దరం కలిసి కూర్చుని ఒకే కంచంలో తింటామని మాట యిస్తున్నాను". మా నాన్నగారు, "బాబా నీ యిష్టం" అన్నారు. మరుసటి జన్మలో మరలా కలుస్తానని బాబా ఆయనకి మాట యిచ్చారు. మా నాన్నగారు తృప్తి చెంది వెంటనే బాబా ముందు సాష్టాంగ పడ్డారు. బాబా ఆయనని లేవనెత్తి తన ప్రక్కనే ఉన్న ఊదీ కుండలో చేయి పెట్టి చేతినిండా ఊదీ తీసి ఆయనకిచ్చి, "భావూ, దీనిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకో. బాగా అవసరమయినప్పుడు మాత్రమే ఉపయోగించు. యెందుకంటే దానిలో యెవరి శరీరంలోకైనా సరే ప్రాణాన్నయినా తిరిగి ప్రవేశపెట్టేంత అనంతమైన శక్తి ఉంది."
యిక ఆపుడు సాయంత్ర వేళ ఆరతి సమయం అయింది. ఆక్షణంలో మా నాన్నగారికి యెంతో తృప్తి కలిగిన అనుభూతి కలిగింది. అదే క్షణంలో ఆయనకి కాస్తంత విచారం కూడా కలగడానికి గల కారణం బాబా అదే తమ ఆఖరి కలయిక అని చెప్పేయడం. మరునాడు బాబా ఆయనని బొంబాయి వెళ్ళిపొమ్మని చెప్పారు. యింటికి చేరుకోగానే ఆయన తన తల్లిదండ్రులకు షిరిడీలో జరిగినదంతా చెప్పారు. వారు ఒక చిన్న వెండి పెట్టికొని దానిని ఊదీతో నింపారు. దానిని వారు స్వయంగా భగవంతుడిచ్చిన మథువులాగా విలువైనదిగా భావించారు. మాలో యెవరికయినా తీవ్రంగా సుస్తీ చేస్తే మా నాన్నగారు కొంచెం ఊదీ నీళ్ళలో వేసి, నయమవడానికి మాకు త్రాగడానికివ్వడం నాకు గుర్తు. ఒక విషయం ఖచ్చితం, ఆయన బ్రతికుండగా ఆయన ఏడుగురి సంతానంలో యెవరూ కూడా మరణించలేదు.
ప్రియమైన సాయి భక్త పాఠకులారా మా నాన్నగారు తన జీవితంలో యెన్నో ఒడిదుడుకులనెదుర్కొన్నారు. ఆయనకి స్వంత బంగళా, కారు. ప్రతీదీ, జీవితంలో యెవరైనా వేటిని కావాలనుకుంటారో అవన్నీ ఉన్నాయి. కాని తరువాతి దశలో ఆయనకి ఈ భౌతిక ప్రపంచం మీద ఇఛ్ఛ పోయింది. ఆయన జబ్బుపడటం నేనెప్పుడూ చూడలేదు. ఆయన తన 70 వ యేట జబ్బుపడి మరణించారు. దాని గురించి నేను తరువాత వివరిస్తాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment