29.08.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు నెల్లూరు నించి సుకన్య గారు పంపిన ఒక సాయి లీల పద్మా రామస్వామి గారి అనుభవాని అందిస్తున్నాను.
బాథయినాగాని, ఆనందకరమైన షిరిడీ యాత్ర
బాబా కు నేనిచ్చిన మాట ప్రకారం నేను షిరిడీలో నా దివ్యానుభూతిని తెలియచేస్తాను. షిరిడీలో పారాయణ హాలులో సాయి సచ్చరిత్రను చదవాలని నా మదిలో నున్న భావన. నేను మా చిన్న అమ్మాయితోను, యింకా తోటి సోదరీమణులతోను షిరిడీని దర్శించే అవకాశం వచ్చింది. మూడు రోజులలో అక్కడ పారాయణ పూర్తిచేద్దామని నిశ్చయించుకున్నాము. ఎప్పటిలాగే ఈ సారికూడా, సాయి సచ్చరిత్రలో బాబా గారు ఏ ప్రదేశాలు దర్శించారో అవన్ని కూడా దర్శిద్దామనే నాప్రగాఢమైన కోరిక, వాటినన్నిటినీ ఒక కాగితం మీద వ్రాసుకుని యాత్ర క్షేమంగానూ, ఆనందదాయకం గానూ జరగాలని ప్రార్థించాను.
శుక్రవారమునాడు బొంబాయినుంచి వోల్వో బస్ లో బయలుదేరాము. సాయి భజనలు వింటూ ఆనందంగా ప్రయాణిస్తున్నాము. బస్సు సిన్నార్ లో అయిదు నిమిషాలు ఆగింది. కాళ్ళు కాస్త చాపుకుందామని కిందకి దిగాను. అప్పుడు నా యెడమ కాలి వేలిలో గుచ్చుకున్నట్లుగా అయింది. వెనువెంటనె తొడవరకూ పొడుస్తున్నట్లుగా నొప్పి మొదలైంది. కన్నీళ్ళతో నిండిపోయాను అప్పటికే. నేనెక్కడికి వెళ్ళినా నాతో కూడా ఊదీని తీసుకువెళ్ళడం నాకలవాటు. వెంటనె ఊదీని రాసుకుని కొంచెం నీటితో సేవించాను. నేను కొంత రేకీ హీలింగ్ కుడా ఇచ్చుకున్నాను. కాని నొప్పి భరించలేనంతగా ఉంది. ఆఖరికి రాత్రి 9 గంటలకి షిరిడీ చేరుకున్నాము. అప్పుడు కొంతమంది సంస్థాన్ ఆస్పత్రికి వెళ్ళమని సలహా ఇచ్చారు. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చి కొన్ని మందులు ఇచ్చారు, కాని నెప్పి మాత్రం తగ్గలేదు. నా బంధువు తిరిగి ముంబాయి వెళ్ళిపోదామని సూచించారు, కాని నేను పారాయణ చేయడానికే నిర్ణయించుకుని అది బాబా నన్నలా పరీక్షిస్తున్నారని భావించాను.
బాథతో ఏడుస్తూ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను. మరునాడు అక్కడ వుండే డాక్టర్ గారు, అది 'వించూ' అని పిలవబడే ఒక విథమైన పురుగు కుట్టడం వల్ల వచ్చిందని అది మంత్ర శక్తి వల్లనే బాగా తగ్గుతుందనీ చెప్పి, అయినప్పటికి నాకు ఇంజక్షన్ ఇచ్చారు. అక్కడ ఉండే ఒకతను రహతా లో ఉండే 'వీరభద్రప్ప ' గుడికి వెళ్ళమని సలహా ఇచ్చాడు. (సాయి సచ్చరిత్రలో 5. అథ్యాయంలో వుంది).
అప్పుడు నేను బాబా వారు అంతకుముందు నివసించిన ప్రదేశమైన రహతా, సచ్చరిత్ర ప్రకారం నేను దర్శిద్దామని రాసుకున్న ప్రదేశానికి బాబా నన్ను వెళ్ళమన్నట్లుగా భావించుకున్నాను. ఆయన చేసే చర్యలను యెవరూ అర్థం చేసుకోలేరు. ఇంజక్షన్, మందులతో తగ్గని నొప్పి బాబా దయతో వెంటనే తగ్గింది. మంత్ర వైద్యం చేయించుకున్న వెంటనే సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టి 3 రోజులలో విజయవంతంగా పూర్తి చేశాను. ఈ లోపుగా బాబా తిరుగాడిన మిగతా ప్రదేశాలను దర్శించాను, ఉదాహరణకి రహతాలో కుషాల్ చంద్ గృహం, పంచముఖి గణపతి మందిరం, తపోవనంభూమి, సాకోరీ లో ఉపాసనీ మహరాజ్ ఆశ్రమం, చివరగా కోపర్గావ్ లో సాయిధాం. అక్కడ మేము చౌహాన్ బాబాని కూడా కలుసుకున్నాము. చౌహాన్ బాబా నన్ను చూసిన మరుక్షణంలోనే, షిరిడీకి వచ్చిన వెంటనే నేను చాలా బాథతో ఉన్నానని, ఆసమయమంతా బాబా నాతోనే ఉన్నారనీ చెప్పారు. ఇలా చెబుతూ ఆయన మమ్మల్నందరినీ దీవించారు.
సంస్థానంలో సేవ చేయాలని నా ప్రగాఢమైన కోరిక. దాని గురించి నేను సంస్థానంలో విచారించగా, వారక్కడ అటువంటిదేమీ లేదని చెప్పారు. నాకు కొంచెం నిరాశ కలిగింది, కాని ఆశ వదలుకోలేదు. ఈ లోగా ఆఖరి రోజున నేను కాకడ ఆరతికి వెడదామనుకున్నాను. తొందరగా లేచి,వెళ్ళబోతూండగా హటాత్తుగా కొంచెం అసౌకర్యంగా ఉండి పడిపోబొతున్నట్లుగా అయింది. కాని యేమయినా సరే ఆరతికి వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను. ఉదయం 3 గంటలకి గుడికి వెళ్ళాను, కాని అక్కడ కుడా వ్యాకులతగా ఉండి వెంటనే హోటలుకు తిరిగి వచ్చేశాను, అక్కడ కూడా మరలా తూలిపోతున్నట్లుగా అయింది. నేనప్పుడు అదంతా బాబాకే వదలివేసి కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. ఉదయం 7 గంటలకి కనీసం ముఖ దర్శనమైనా చేసుకుందామనే కోరిక కలిగింది. అక్కడికి వెళ్ళాను, హటాత్తుగా సంస్థానంలో పనిచేసేవారు నోట్లు వేరు చేసే సేవ చేస్తారా అని అడిగారు. నా ఆనందానికి అవథులు లేవు. నేను వెంటనే దానికంగీకరించాను. అరగంట తరువాత వారు నాన్ను బాబా దర్శనం చేసుకుని వెళ్ళమన్నారు. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన నాకోరికని కూడా తీర్చారు. ఆరతిలో చెప్పినట్లుగా 'జయమని జైస భావ తయ తైసానుభావా'.
బాబా నా జీవితంలోకి ప్రేవేశించిన 5 సంవత్సరాల కాలం నుంచీ, నేను గ్రహించినదేమిటంటే మనం అడిగినవన్నీ బాబా ఇస్తున్నప్పటికీ, అదే సమయంలో ఆయన మనలని పరీక్షిస్తూ ఉంటారు, యేమిటంటే రెండు నాణాలయిన 'శ్రధ్ధ, 'సబూరీ' లను మనం ఆకళింపు చేసుకున్నామా లేదా అని. ఈ సారి నాకు బాబా ఒక క్రొత్త దివ్యానుభూతినిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన మాకు ప్రయాణం దగ్గిరనించీ వసతి వరకూ అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ స్థానికంగా ఉండే ఆటొ డ్రైవరు గణేష్ నంబరు ఇస్తున్నాను, అతనికి అక్కడి ప్రదేశాలన్నీ బాగా తెలుసు. అతని నంబరు 09822881977.
బాబా ధన్యవాదములు, ఓం సాయిరాం
పద్మా రామస్వామి. పైన మీరు చదివిన లీలలో పద్మగారు తనకు తాను రేకీ హీలింగ్ ఇచ్చుకున్నట్లుగా చదివారు. మన సాయి బంథువులకు కొంతమందికి రేకీ అనగా యేమిటొ తెలియకపోవచ్చు. వారి సౌకర్యార్థం దాని గురించి క్లుప్తంగా ఇస్తున్నాను.
రేకీ : విశ్వంలోని ప్రాణ శక్తి. ఈ విథానం జపాన్ దేశీయుడైన డా. ఉసూయీ గారి ద్వారా ప్రచారంలోకి వచ్చింది. రేకీ మాస్టర్ గారి ద్వారా ఉపదేశం తీసుకోవాలి. మనలో షట్చక్రాలు ఉంటాయి. బ్రహ్మ రంధ్రంద్వారా ఈ శక్తిని మనలోకి ప్రవేశ పెడతారు. మనలో ఉన్న చక్రాలన్ని జాగృతమౌతాయి. మనలోకి కొంచెం వేడి ప్రవేశిస్తుంది. దీని లో 3 డిగ్రీలు ఉంటాయి. మొదటి డిగ్రీలొ మన మనమీద చేతులను ఉంచి హీలింగ్ ఇచ్చుకోవచ్చు. యితరులకు కూడా ఇవ్వవచ్చు. 2వ. డిగ్రీలో అంగా డిస్టంట్ హీలింగ్ చేయవచ్చు. అంటే మనిషి యెంతదూరంలో ఉన్నాకూడా రేకీ హీలింగ్ ఇవ్వవచ్చు. 3 వ.డిగ్రీ మాస్టర్ డిగ్రీ అనగా ఆ డిగ్రీ ఉంటే మనం యింకొకరికి రేకీ ఉపదేశాన్నివ్వవచ్చు.
మీకు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే గూగుల్ లో రేకీ గురించి సేర్చ్ చేయండి. www.reiki.org or search in google as reiki.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
Kindly Bookmark and Share it:
Related Posts: ఆనందకరమైన షిరిడీ యాత్ర,
బాథయినాగాని
0 comments:
Post a Comment