నేనుండ నీకు భయమేల -- అషిమా, బాబా అనుభూతి
02.09.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి ప్రియాంకాగారి ఆంగ్లబ్లాగులోని బాబా లీలకు తెలుగు అనువాదాన్ని అందిస్తున్నాను. ఈ లీల వినాయక చవితి రోజున ప్రచురింపబడింది. దానిని యథాతధంగా మీకందిస్తున్నాను.
మొదటగా మీకందరికీ బాబా వారముతోపాటుగా సాయి గణేష్ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను. బాబా చెప్పిన ఈ వాక్యాలు మనకందరకూ తెలుసు, "నేనుండ నీకు భయమేల" అని. అది చాలా యదార్థమని మని నేను చెపుతున్నాను నన్ను నమ్మండి. మన దైనందిక కార్యక్రమాలలోకి మనం జాగ్రత్తగా తరచి చూస్తే, మనకు కలిగిన వేల సమస్యలనుండి బాబా మనలని యెలా రక్షించారో, మనం కోరినది ఇచ్చి మనలని యెలా అనుగ్రహించారో అర్థమౌతుంది. ఒక్కొక్కసారి మన అహంకారం వల్ల ఆ విజయం మన వల్లే జరిగిందనే గర్వంతో విఱ్ఱ వీగుతూ ఉంటాము. మనమది చేయకూడదు. సాథించినది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనం దానికి యెల్లప్పుడూ బాబాకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి, కారణం చేయించేదంతా ఆయనే, మనం ఆయన అనుగ్రహ ఫలితాన్ని ఆనందిస్తున్నాము.
సాయి మన నిజమైన తల్లి., ఆమె తన బిడ్డలందరి కష్టాలనీ, సమస్యలనీ తుడిచి పెట్టేస్తుంది. బాబా కరుణా సముద్రుడు. సాయి మీద సడలని నమ్మకాన్ని ఉంచుకుంటే మనం యిటువంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించగలం. ఒక్కసారి ఆయనమీద మీనమ్మకాన్ని పెంపొందించుకుంటే ప్రతీక్షణం ఆయన మీవద్దనే ఉన్నారనే అనుభూతిని చెందుతారు. అదే బాబా చెప్పిన ఉవాచ "నామీద యెవరైతే నమ్మకముంచుకుంటారో వారి యోగక్షేమాలను నేను గమనిస్తూ ఉంటాను."
మనం ఏమి చేస్తున్నా ఏ స్థితిలో ఉన్నా మన మదిలో యెప్పుడూ బాబానే నిలుపుకోవాలి, ఆయనమీదే మనసు లగ్నం చేయాలి, ఆయన నామాన్నే పదే పదే ఉచ్చరిస్తూ ఉండాలి, ఆయన పాటలను పాడుకోవాలి, యిలా చేస్తూ ఉంటే కనక మెల్లగా మనం సంపూర్ణంగా ఆయనలోకి ఐక్యమయిపోతాము. కాని అదే సమయంలో మనం మన అహంకారాన్ని ఆయన పాదాలముందు వదలేయాలి. మనం ప్రతీ సమయం యదార్థాన్ని మనతోనే ఉంచుకోవాలి, యిక్కడ యదార్థమంటే సాయి.
ఈ రోజు బాబా వారమునాడు సోదరి అషిమా గారి యింపైన అనుభవాన్ని తెలుసుకుందాము. మీకందరికీ అషిమా గుర్తుండే ఉంటుంది. యిదివరలో ఆమె మనతో చాలా లీలలను పంచుకుంది. ఇప్పుడామె చెప్పే ఈ లీల, ఆమె అసలు యేమీ తయారుకాకుండా క్యాంపస్ యింటర్యూకి హాజరవుతున్నప్పుడు బాబా ఉన్నారనే దానికి గట్టి ఋజువుని తెలియచేస్తుంది. ఈ సంఘటన బాబా ఆందోళనని, భయాన్ని, దురదృష్టాన్ని తొలగించి తన భక్తుల జీవితాలలో ఆశని, సంతోషాన్ని యెలా తీసుకొస్తారో తెలియచేస్తుంది.
అషిమా, క్రమం తప్పకుండా నీ అనుభూతులని మాతో పంచుకుంటున్నందుకు నా హృదయపూర్వక థన్యవాదాలు తెలుపుతూ, నీ శ్రమకి, అంకిత భావానికి విలుననిస్తున్నాము.
అల్లాహ్ మాలిక్
ప్రియమైన ప్రియాంకా, అక్కా,
నా అనుభూతులని కొన్ని చెపుతాను, వాటిని మిగతా సాయిబంధువులందరికోసం మీ వెబ్ సైట్ లో ప్రచురించండి.
2011 లో నేను యింజనీరింగ్ 8 వ సెమిస్టర్ లో ఉన్నాను, కాలేజీ కాంపస్ ఉద్యోగానికి అర్హత వచ్చింది. ఇండస్ట్రియల్ శిక్షణా కార్యక్రమం వల్ల పట్టణంలో లేకపోవడం వల్ల నాకు రెండు అవకాశాలు చేజారిపోయాయి. ఆఖరికి జనవరి 13, 2011, గురువారమునాడు ఒక మంచి కంపనీ మా కాలేజీ కాంపస్ కి వచ్చింది, కాని నేను తయారుగా లేకపోవడం వల్ల పరీక్షకు వెళ్ళడానికి భయం వేసింది. కాని నా స్నేహితురాళ్ళు ఒకసారి ప్రయత్నించు, అనుభవం కూడా వస్తుంది అని నన్ను ఒప్పించారు.
నేను అయిష్టంగానే ఒప్పుకున్నాను. ఆరోజు నా గురువారం వ్రతం. పొద్దున్నే మేము కాలేజీ కి వెళ్ళాము. నేను యెంపిక కాబడనని నాకుతెలుసు యెందుకంటే 300 పైన ఉన్న విద్యార్థులకి 30 ఖాళీలే ఉన్నాయి. మొదటి రౌండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో చాలామంది ని వడపోత పోసేస్తారు. అంచేత నేను యెంపిక కాబడనని నాకు ఖచ్చితంగా తెలుసు, కాని అది బాబా లీల ...నేను యెంపిక అయినట్లు నా పేరు వెల్లడించారు. నాకెందుకు ఆశ్చర్యం వేసిందంటే బాగా చదివే నా స్నహితులెవరూ యెంపిక కాబడలేదు.
తరువాత రౌండ్ టెక్నికల్ యింటర్వ్యూ. బాబా దయ వల్ల మొదటి రౌండ్లో యెంపిక కాబడినప్పటికీ నాకు టెక్నికల్ పరిజ్ఞానం అంతగా లేదుకాబట్టి, తప్పకుండా వాళ్ళు నన్ను తొలగించేస్తారని అనుకున్నాను.మిగతావారంతా టెక్నికల్ యింటర్వ్యూకి తయారవుతూండగా , నేను నాకు అదృష్టాన్నిచ్చే సాయిబాబా ఫొటో చూసి (నేను దీనిని నా స్నేహితురాళ్ళకి, యింటర్వ్యూలో ఉత్తిర్ణులవనివాళ్ళకీ కూడా ఇచ్చాను, తరువాత వచ్చిన కంపనీ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, తరువాత వాళ్ళు బాబాకి మంచి భక్తులుగా మారారు) సచ్చరిత్ర చదువుకున్నాను. ఆఖరికి యింటర్వ్యూ చేసే అతని దగ్గరికి నా వంతు వచ్చింది. నా ముందు ఉన్నవాళ్ళందరినీ చాలా కఠినమైన ప్రశ్నలు అడిగాడు, కాని నన్ను యెక్కువగా ఆశ్చర్యపరచినదేమిటంటే నన్ను విషయానికి సంబంధించి సామాన్యమైన ప్రశ్నలు, నేను చెప్పగలిగేవి మాత్రమే అడిగాడు. నన్నతను యెందుకు వణుకుతున్నావని అడిగాడు. నేనతనికి సచ్చరిత్ర చూపించాను. అతను తను కూడా సాయిబాబా భక్తుడినేనని చెప్పాడు. ఆ రౌండ్ పూర్తయింది, అంతా కూడా బాబా నిర్ణయంప్రకారమే జరిగినట్లుగా అనిపించింది.
తరువాత మూడవ రౌండ్ మొదలైంది. ఆరోజు రాత్రి 11 గంటలకి తిరిగి వచ్చాను. పొద్దుటినించీ యేమీ తినలేదు. కాని నాకు ఆరోజంతా ఆకలనిపించకుండా బాబా మంచి శక్తిని ప్రసాదించారు. ఫలితాలు మరుసటి రోజు అనగా 14, జనవరి, 2011 న రావచ్చు. యింతకు ముందు 2010 లో ఈ సంవత్సరం అంతగా బావుండలేదు, 2011 కొత్త సంవత్సరం మంచి శుభవార్తతో మొదలయేలా చూడమని బాబాని ప్రార్థించాను.
జనవరి 1 , యే విశేషం జరగకుండా మామూలుగానే జరగడంతో కొంచెం నిరాశ కలిగింది. జనవరి, 14, 2011 న ఫలితాలు వచ్చినప్పుడు, బాబా దయవల్ల నేను యెంపిక కాబడ్డాను. నిజానికి ఆరోజు మకర సంక్రాంతి ఈ రోజే కొత్త సంవత్సరం అని నా కర్థమైంది. బాబా నేనడిగిందిచ్చారు. మనలో ఉన్న గాఢమైన కోరికలని బాబా తీరుస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు, కాని అదే సమయంలో మనమడిగింది యెప్పుడు ఇవ్వాలో తెలుసు. సరైన సమయంలో సరైనది ఇస్తారు. బాబా నువ్వు చూపించే కరుణకి, ప్రేమకి నేను కృతజ్ఞురాలిని.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
Kindly Bookmark and Share it:
Related Posts: నేనుండ నీకు భయమేల -- అషిమా,
బాబా అనుభూతి
0 comments:
Post a Comment