Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, October 19, 2011

బాబాతో సాయి బా ని స అనుభవాలు 19

Posted by tyagaraju on 8:52 AM



19.10.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

07.10.2011 తరువాత మరల ఈ రోజు బాతో సాయి బా ని స అనుభవాలను ప్రచురిస్తున్నాను. విజయదశమికి ముందురోజు అనగా మహర్నవమినాడు మా పెద్దకుమార్తెకు అమ్మాయి జన్మించింది. అందువల్ల నేను హైదరాబాదులో ఉన్నకారణంగా చాలా ఆలస్యం జరిగింది. అన్యధా భావించవద్దు.

ఈ రోజు బాబాతో సాయి బా ని స అనుభవాలలో 19వ అనుభవాన్ని ప్రచురిస్తున్నాను.

బాబాతో సాయి బా ని స అనుభవాలు 19

శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం లో బాబాగారు భీమాజీ పాటిల్ క్షయ రోగాన్ని నయం చేసి అతనిని మృత్యువునుండి రక్షించిన విథానము విపులముగా వివరింపబడింది.అదేవిథంగా 1996 వ సంవత్సరములో శ్రీ సాయి ప్రమాదకరమైన హృదయసంబంధమైన వ్యాథినుండి నన్ను కాపాడిన విషయము వివరిస్తాను.

అది 1996 వ సంవత్సరం ఏప్రిల్, నేల 20 వ తేదీఉదయము ఏడుగంటల సమయము.,. నేను పెరటిలోని పూలమొక్కలకు నీళ్ళు పెడుతూండగా నాకు ఛాతీ లో విపరీతమైన నొప్పి వచ్చి చెమటలు పట్టసాగింది. నేను వెంటనే మా వీధిలో ఉన్న డాక్టర్ ఆర్.ఏ రావు గారి వద్దకు వెళ్ళాను. ఆయన అది హార్ట్అటాక్ (గుండె పోటు) అని నిర్ధారించి నాలిక కింద సార్బిట్రేట్ మాత్ర పెట్టుకోమని చెప్పివెంటనే వైద్యం చేయించుకోమని సికిందరాబాదులోని సీ.డీ.ఆర్. ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. నన్ను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతూండగా, నేను శ్రీ సాయిని ప్రార్థించి శ్రీ సాయి సచ్చరిత్రలోని ఒక పేజీ ని తెరచి చూశాను. అది 15వ అధ్యాయం, అందులో ఇలా ఉందీ, "ఎవరయితే భక్తిభావంతో ఈ అధ్యాయాన్ని ప్రతీరోజూ చదువుతారో సద్గురు సాయిబాబా అనుగ్రహంతో వారి బాధలన్నీ తొలగిపోతాయి". ఈ వాక్యాలు చదివినతరువాత శ్రీ సాయినాధులవారు నన్ను తప్పకుండా రక్షిస్తారని ధైర్యం వచ్చింది. నాకు పూర్తి ఆరోగ్యము కలిగిన తరువాత ప్రతీరోజూ 15 వ అధ్యాయము పారాయణ చేస్తానని సంకల్పించాను. నా స్నేహితులు నన్ను ఆటోలో సీ.డీ.ఆర్. ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఆస్పత్రి వద్ద నన్ను స్ట్రెచర్ మీదకి మారుస్తున్నప్పుడు నాకు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆసమయములో నా దృష్టి ఆస్పత్రి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న మెడికల్ హాలు మీద పడింది. దానిమీద "సాయిశక్తి మెడికల్ హాలు "అనే అక్షరాలతో శ్రీ సాయి నన్ను దీవిస్తున్నట్లుగా పటము కనపడింది. నాకు తప్పకుండా నయమవుతుందనే భావన కలిగింది. నాకు చాలా ఖరీదయిన ఇంజక్షను ఇచ్చినతరువాత ఐ.సీ.యూ. లో ఉంచినారు. అది 28.04.1996 నాడు ఉదయము యాంజియోగ్రాము పరీక్షల నిమిత్తము హైదరాబాదులోని సీ.డీ.ఆర్.ఆస్పత్రిలోకి తరలించినారు. అక్కడ యాంజియోగ్రాము పరీక్షల తరవాత నాగుండెలో మూడు ఆర్టరీలలో బ్లాక్స్ ఉన్నట్లుగా తేలింది. నిపుణులైన వైద్యులు బైపాస్ ఆపరేషన్ చేయాలని నిర్థారించారు.

అది 01.05.1996 రాత్రి బాబాను ప్రార్థించినాను. శ్రీ సాయి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనమిచ్చి నీ యింట ముగ్గురు దొంగలు పడినారు. నీవు పగటివేళ పోలీసులను పిలిపించి ఆ దొంగలను తరిమివేయడం మంచిది. పాఠకులందరికీ ఈ సందేశము విచిత్రంగా తోచవచ్చు. నేను ఈ సందేశంపై బాగా ఆలోచించాను. నా గుండెలోని మూడు ఆర్టరీలు పూడుకుని పోయినాయి. ఈ కష్టము తొలగాలంటే పగటివేళ మాత్రమే ఆపరేషను చేయించుకోవాలి అని నిర్థారణకు వచ్చాను. నేను డాక్టర్స్ తో మాట్లాడిన తరువాత వారు 16.05.1996 గురువారము నాడు మధ్యాహ్న్నము రెండు గంటలకు ఆపరేషను చేయడానికి నిర్ణయించారు.

అది 16.05.1996 సాయంత్రము అయిదు గంటల ప్రాంత సమయం. నాకు ఆపరరేషను చేయవలసిన డాక్టర్స్ యెవరూ రాలేదు. సాయంత్రము ఆరు గంటల ప్రాంతములో అసిస్టంట్ డాక్టరులు వచ్చి నన్ను ఆపరేషను థియేటరులో ఆపరేషను చేయడానికి లోపలకు తీసుకుని వెళ్ళినారు. ఆపరేషను థియేటరులోనికి వెళ్ళేముందు నా మనసు కీడును శంకించసాగింది. ఆ సమయంలో నేను నా డైరీలో ఈ వాక్యాలు వ్రాసాను."నేను మృత్యువుతో పోరాడటానికి వెళ్ళుతున్నాను. శ్రీ సాయి నాతోడు ఉన్నారు. నేను ఆపరేషనునుండి బ్రతికి బయటకు వస్తే ఆ విజయము శ్రీ సాయికే చెందుతుంది". ఈ వాక్యాలను నా డైరీలో వ్రాసి ఆ డైరీ నా భార్య చేతికి ఇచ్చి ఆపరేషను థియేటరులోకి వెళ్ళినాను. రాత్రివేళ జరిగే ఈ ఆపరేషను జరగకుండా చూడమని శ్రీ సాయిని ప్రార్థించి ఆపరేషను బల్లమీద నిస్సహాయంగా పడున్నాను. అది 6.గం.30 నిమిషాల సమయము. ఆపరేషను థియేటరులోని టెలిఫోను మ్రోగసాగింది. అక్కడ ఉన్న నర్స్ ఆఫోను అందుకొని అక్కడ ఉన్న డాక్టరులకు ఈ రోజు ఆపరేషను చేయవలసిన ప్రధాన డాక్టరు (చీఫ్ సర్జన్) డా.ప్రసాదరావుగారు ఆపరేషను చేయడానికి అనివార్య కారణాలవల్ల రాలేకపోతున్నారనీ ఈ ఆపరేషను మరుసటిరోజు ఉదయము 9 గంటలకి నిర్ణయించబడిందని తెలియచేసింది. ఈ వార్త విన్న నేను సంతోషముతో ఆపరేషను బల్లమీదనించి లేచి శ్రీ సాయినాధులవారికి ధన్యవాదాలు తెలియచేశాను.

అది 17.05.1996 అమావాశ్య ఉదయము 9 గంటల సమయము. డాక్టర్స్ తిరిగి నన్ను ఆపరేషను థియేటరులోకి తీసుకువెళ్ళినారు. 10 గంటలకు ప్రారంభ మయినటువంటి ఆపరేషను సాయంత్రము 4 గంటలకు విజయవంతముగా ముగిసినది. ఆపరేషను అనంతరము నన్ను ఐ.సీ.యూలో పరుండబెట్టినారు. అది 18.05.1996 ఉదయము 8 గంటల సమయము. నాకు స్పృహ వచ్చినది. నా ఎదురుగా అనస్థషిస్టు (మత్తుమందు ఇచ్చు డాక్టరు) డా.బ్రహ్మయ్య గారిని చూడగలిగాను. ఆయనలో శ్రీ సాయిని చూసి రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కరించాను. ఆయన నామీదకు వంగి మొదటగా ఎవరిని చూడదలచుకున్నావు అని అడిగినారు. "మొదటగా శ్రీ సాయిని చూడాలని అనుకుంటున్నానని" చెప్పాను. ఆయన నాభార్యకు కబురు చేసినారు. నా భార్య ఆనంద భాష్పాలతో చిరునవ్వుతో ఉన్న శ్రీ సాయి పటాన్ని తీసుకునివచ్చి నాకు చూపించినది. శ్రీ సాయియొక్క ఆ చిరునవ్వే ఈనాడు శ్రీ సాయి సేవలోను సాయి భక్తుల సేవలోను తరించే అదృష్టాన్ని ప్రసాదించింది.


సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List