11.01.2012 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 5 వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 5 వ. భాగము
05.02.1994
నిన్నటిరోజున కూడ మనసులో చాలా చికాకు కలిగినది. మనసుకు కొంచము సంతోషము కలిగించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి రాత్రి కలలో చూపిన దృశ్యము, ఆయన యిచ్చిన సూచనలు మనసుకు సంతోషము కలిగించినది.
1. సంఘములోని పెద్దమనుషులు స్త్రీల మాదిరిగా గచ్చకాయలు ఆట ఆడుతున్నారు. నాకు నవ్వు వచ్చినది.
2. నాయింట శ్రీ శిరిడీ సాయి లీల అమృత భాండాగారము కోసము శ్రీ సాయి వడ్రంగి వారిని పిలిచి అలమారాలు తయారు చేయించుతున్నారు. ఈ దృశ్యము నాకు సంతోషము కలిగించినది.
3. శ్రీ సాయి ఒక ముసలివాని రూపములో నా యింట నుయ్యినుండి నీరు తోడి నాయింటికి వచ్చిన సాయి బంధువులకు త్రాగటానికి మంచి నీరుగా యిచ్చి వారి దాహము తీర్చసాగినారు. నేను ఆ ముసలివాని పాదాలకు నమస్కరించినాను.
08.02.1994
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నేను చేయవలసిన మంచి పనులు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అంటారు.
1. నీ తల్లి ఋణము తీర్చుకోవాలి అంటే ఆమె ఆఖరి రోజులలో ఆమెకు ఏలోటు రాకుండ చూసుకొని ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు శ్రధ్ధగా చేయి.
2. నీ స్నేహితులలోను, బంధువులలోను నీవు ఎవరికైన ఋణగ్రస్థుడివి అయితే వారి ఋణము తీర్చుకోవటానికి ప్రయత్నించు. ఒకవేళ వారి ఋణము తీర్చుకోకుండానే వారు ముందుగా మరణించితే నీవు వారి అంత్యక్రియలకు వెళ్ళివారి ఆత్మలకు ఆఖరి నమస్కారము చేయి.
3. భార్య వ్యామోహము, పరస్త్రీ వ్యామోహము వదిలించుకో.
4. ముఖ్యముగా చెడ్డపనులు చేయకుండ యుండటమే నీవు చేయగల మంచిపని అని గుర్తించు.
10.02.1994
నిన్న రాత్రి శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము నాలో సంతృప్తిని కలిగించినది. వాటి వివరాలు.
"నేను ఒక రైలు యింజను నడుపుతున్నాను. ఆయింజనులో నేను ఒక్కడినే యున్నాను. రైలు పట్టలు మీద ఒక గోడ యున్నది. దూరమునుండి ఆ గోడను చూసి రైలు యింజను వేగము తగ్గించినాను. ఆ గోడ తర్వాత పట్టాలు లేవు. నీవు రైలు యింజనును అక్కడే ఆపివేయవలసియుంటుంది అనే మాటలు వినిపంచసాగినవి. ఆ యింజను వెనక్కి వెళ్ళే సదుపాయము లేదు. వేగము తగ్గించి మెల్లిగా నడుపసాగినాను." ఈ దృశ్యము ద్వారా శ్రీ సాయి యిచ్చిన సూచన ఏమిటి అని ఆలోచించినాను. బహుశ నా బరువు బాధ్యతలు అనే రైలు యింజను త్వరలో తన గమ్యాన్ని చేరుకోబోతున్నది. "నీవు రైలు యింజనును పట్టాలు ఆఖరి వరకు నడపగలవు. పట్టాలమీద గోడ సంసార బంధాలకు ఆఖరి మజిలీ. ఆ గోడ దాటిన తర్వాత నీను ఒక్కడివే నీ గమ్యము వైపు నడచుకొంటూ ముందుకు సాగిపోవాలి" అని శ్రీ సాయి నన్ను హెచ్చరించుతున్నారు అని భావించినాను.
15.02.1994
నిన్నటిరోజున శ్రీ సాయి నామస్మరణలో గడిపినాను. శ్రీ సాయి రాత్రి కలలో అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి చెప్పిన మాటలు.
1. జీవితములో శతృవులు కూడ మితృలుగా మారుతారు శ్రీ సాయి శక్తివలన.
2. శ్రీ సాయి భక్తుల యింట బరువు బాధ్యతలు అన్నీ సవ్యముగా జరుగుతాయి.
3. నీవు తినే శాఖాహారములోను మాంసాహారములోను ఉన్నది ఒకేవిధమైన ప్రాణము. తినేవారి అవసరాలు సౌకర్యాలను బట్టి శాఖాహారము మాంసాహారము నిర్ణయించబడినది.
(యింకా ఉంది)సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment