08.04.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1995 (20)
01.08.1995
నిన్న రాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి చెప్పిన నగ్న సత్యాలు.
"నీవు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు నీశరీరానికి అందమును ప్రసాదించుతాయి. నీవు మరణించినపుడు నీశరీరానికి అంతిమ సంస్కారాలు నీవు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు విలువతో జరగవు. నీజీవితములో నీవు సంపాదించిన నైతిక విలువలు బట్టి జరుగుతాయి అని గ్రహించు.
02.08.95
నిన్న రాత్రి కలలో శ్రీసాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి, ఋణానుబంధము గురించి చెప్పిన మాటలు.
1. నీకుమార్తెకు వివాహము చేసి ఆమె ఋణము తీర్చుకో.
2. నీకుమారునికి విద్యాబుధ్ధులు నేర్పి అతని ఋణము తీర్చుకో.
3. నీభార్యకు శారీరకముగాను, మానసికముగాను సహాయము చేయుచు ఆమె ఋణము తీర్చుకో.
4. తల్లితండ్రుల మరణానంతరము వారికి సవ్యముగా అంతిమ సంస్కారాలు చేసి వారి ఋణము తీర్చుకో.
5. నీవు జీవితములో మంచి పనులు చేసి నీగురువు ఋణము తీర్చుకో.
09.08.1995
నిన్నటి రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నామనసులో ఎప్పటినుండో ఉన్న సందేహాన్ని ఈవిధముగా తెలియపర్చుకొన్నాను. "సాయినాధ - మనిషి మరణించిన తర్వాత పునర్జన్మ ఎత్తుతాడు కదా మరి అతనికి ప్రతిసంవత్సరము ఆబ్ధికము నిర్వహించటము ఎందుకు?" ఈ నాప్రశ్నకు శ్రీ సాయి అజ్ఞాతవ్యక్తి రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సమాధానము. మానవుడు మరణించిన తర్వాత పునర్జన్మ ఎత్తటము నిజము. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి తన వంశము పురోభివృధ్ధిలో మూడు తరాలను మాత్రమే చూడగలడు. అంటే కుమారుడు, మనవడు, మునిమనవడులను చూడగలడు. మూడు తరాలను చూసిన వ్యక్తి మరణించిన అతని ఆత్మ మాత్రము మూడు తరాల తనవారి మీద ఉన్న మమకారాన్ని వదలలేదు. ఆవ్యక్తి మరణించిన అతని ఆత్మ తన వంశములోనివారు సంవత్సరానికి ఒకసారి అయిన తనను ఆహ్వానించి తనకు ఆబ్ధికము జరపగలరని నమ్ముతాడు. ఆ ఆత్మకు నమ్మకాన్ని కాపాడటము ఆవంశములోనివారి ధర్మము. ఈధర్మాన్ని కాపాడి మన పూర్వీకుల ఆశీర్వచనాలను పొందగలగటము మన అదృష్ఠము. మనము జీవితములో ఒక్కసారి పనసపండును తిన్న చాలు ఆసువాసనను ఎన్నటికీ మర్చిపోలేము.
అదే విధముగా తనవంశము అభివృధ్ధిని చూసిన వ్యక్తి మరణించిన అతని ఆత్మ తనవారిని ఎన్నటికి మరవలేదు. అందుచేత మన పూర్వీకులకు సంవత్సరానికి ఒక్కసారి ఆబ్ధికము నిర్వహించి వారిని గౌరవించి వారి ఆశీర్వచనాలు పొందవలెను.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment