03.06.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1997 (10)
19.08.1997
నిన్నరాత్రి శ్రీసాయి నాతండ్రి రూపములో దర్శనం ఇచ్చి అన్నమాటలు.
1) "జీవితములో ఒడిదుడుకులు అనే వరద రావటము సహజము. ఆవరదలో ఈదటానికి కావలసిన శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకోవాలి. అంతేగాని ఆకష్ఠాలలో ప్రశాంతముగా జీవించాలి అని కోరుకోరాదు. ఆవిధముగా కోరుకొంటే కష్ఠాలలో రాజీ పడినట్లు అగుతుంది. జీవితంలోని కష్ఠాలను జయించాలి. అంతేగాని, కష్ఠాలతో రాజీపడరాదు.
2) భగవంతుని అనుగ్రహము సంపాదించుకోవటానికి ఈశరీరాన్ని ఉపయోగించుకోవాలి. మరి శరీరపోషణకు ధర్మపధములో ధనము సంపాదించాలి. ఆధనముతో శరీరపోషణకు కావలసిన సాత్విక ఆహారమును సంపాదించాలి. అపుడే భగవంతుని అనుగ్రహమును సంపాదించగలవు."
22.08.1997
నిన్నరాత్రి శ్రీసాయి నాబంధువు శ్రీసోమయాజులుగారి రూపంలో దర్శనము ఇచ్చి అన్నమాటలు.
1) సంఘములో చికాకులకు ముఖ్య కారణము స్త్రీ, సంబంధాలు, భార్యా భర్తలు ఒకరిని యింకొకరు అపార్ధముచేసుకోవటము. పురుషులకు పరస్త్రీ వ్యామోహము, స్త్రీలకు ధన వ్యామోహములు ఈ అపార్ధాలకు అగ్నిలో నెయ్యి పోసినట్లుగా ఉంటుంది. అందుచేత అపార్ధాలకు తావులేని జీవితాన్ని స్త్రీ, పురుషులు గడపాలి అంటే ధనవ్యామోహము, పరస్త్రీ వ్యామోహాలను విడనాడాలి.
2) మనయింటిలోని చెత్తను మనప్రక్కయింటివాని యింటిలో పోసి మన యిల్లు చాలా శుభ్రముగా ఉంది అని తలచటము వ్యక్తిగతముగా మనలను మనము మోసము చేసుకోవటమే.
30.08.1997
శ్రీసాయి నిన్నరాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అన్న మాటలు.
1) నీపై ఆధారపడి జీవించుతున్నవారు కష్ఠములో యున్నపుడు నీవు వారి బరువు బాధ్యతలను స్వీకరించకుండ యింటిలోనుండి పారిపోవటము అమానుషము. అటువంటి స్థితిని నీజీవితములో రానీయకు.
2) సమాజములో అనాధలు, అవిటివారు కష్ఠాలలో యున్నపుడు మానవతా ధర్మముగా వారిని ఆదుకొని వారికి సహాయము చేయాలి. అట్లు చేయలేనివాడు మానవుడు కాదు. అతడు దానవుడు.
3) నీవు భగవంతుని అనుగ్రహము పొందినరోజున నీవు ధనధాన్యాలు కోరడములో అర్ధములేదు. నీవు, నీవారి, మరియు నీతోటివారి మేలుకోసము భగవంతుని ప్రార్థించాలి. అదే నిజమైన మానవత ధర్మము.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment