02.07.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు
బాబా కరుణాహృదయం
ఈ రోజు అమెరికా నుంచి ఒక అనామిక భక్తురాలు పంపిన బాబా లీలను తెలుసుకుందాము.
ఇది 22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన
మా మేనమామకు అబ్బాయి పుట్టినప్పుడు వాక్సినేషన్ ఇంజెక్షన్ యొక్క సూది తొడలోని ఎముకకు తగిలి ఇంఫెక్షన్ సోకింది. బాబు కాలు కూడా కదలచలేకపోయేవాడు. బాబుని డాక్టర్ గారికి చూపించాము. డాక్టర్ గారు పరీక్షించి చాలా చీము పట్టిందని చెప్పి తొడ భాగములో చిన్న ఆపరేషన్ చేసి నడుము దగ్గిరనించి కాలిపాదం వరకు కట్టు కట్టారు. 2 - 3 నెలల వయసున్న ఆ బాబుని ఆ స్థితిలో చూడటం మాకు చాలా బాధగా ఉండేది. ఆసమయములో మేము గుంటూరులో వుండేవారము. మేము బాబుని చాలామంది ప్రముఖ ఎముకల వ్యాధులను నయంచేసే డాక్టర్స్ వద్దకు తీసుకుని వెళ్ళి చూపించాము. అందరూ కూడా పరీక్షించి బాబు నడవలేడని ఒకే మాట చెప్పారు. జీవితాంతమూ కఱ్ఱల సాయంతో కుంటుతూ నడవవలసినదేనని చెప్పారు. 10 నెలల వయసు ఉన్న బాబుని అటువంటి పరిస్తితిలో చూడవలసివచ్చినందుకు మా కుటుంబమంతా ఎంతో బాధ పడ్డాము.
ఆసమయములో మా మేనమామ ఢిల్లీలో ఉద్యోగంచేస్తున్నారు. ఆయన మనస్పూర్తిగా ఎంతో భక్తితో తన బాబుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్ధించారు. బాబుని ఢిల్లీలోని డాక్టర్ వద్దకు తీసుకునివెడుతూ కరోల్బాగ్ లో ఆగారు. మా మేనమామ స్కూటర్ పార్క్ చేయడానికి వెళ్ళగా మా అత్తయ్య బాబుని ఎత్తుకుని కింద నుంచుని ఉంది. బాబుని మెత్తని తెల్లటి తువ్వాలులో చుట్టి పట్టుకుని ఉంది. లోపల కాలుకి కట్టు ఉంది . చూడటానికి భయంకరంగా ఉంది.
ఆసమయంలో ఒక ముసలివ్యక్తి అక్కడికి వారికి చాలా దగ్గిరగా వచ్చాడు. మా అత్తయ్య మంత్రం వేసినట్టుగా అయిపోయి అతనిని వారించలేకపోయింది. ఆ ముసలి వ్యక్తి బాబుకు చుట్టిన తువ్వాలును విప్పి బాబు పాదం మీద ముద్దు పెట్టుకుని బాబు చాలా అందంగా ఉన్నాడు బాబా ఆశీర్వదిస్తారు అని వెళ్ళిపోయాడు. మా అత్తయ్య అప్పుడు స్పృహలోకి వచ్చింది. వచ్చిన ఆ ముసలి వ్యక్తి ఎవరు, అతను కాలికి కట్టుతో ఉన్న బాబుని ముద్దుపెట్టుకుంటుంటే ఎందుకని వారించలేకపోయాను అని ఆశ్చర్యపడింది. జరిగినదంతా మా మామయ్యకు చెప్పింది.
తరువాత ఇద్దరూ డాక్టర్ వద్దకు బాబుని తీసుకుని వెళ్ళారు. బాబుని పరీక్షించి డాక్టర్ గారు ఏమన్నారో తెలుసా?
"బాబుని ఆడుకునేవాడిని ఆడుకోనివ్వకుండా ఎందుకంత పెద్ద కట్టుకట్టి కష్ఠపెడుతున్నారు? బాబు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. కాలు లో ఎటువంటి సమస్యాలేదు. ఇన్ ఫెక్షన్ కూడా లేదు అని బాబుకు ఉన్న కట్టునివిప్పేశారు. బాబు తన రెండు కాళ్ళతోనూ చక్కగా ఆడుకుంటున్నాడు.
ఆ వచ్చిన ముసలి వ్యక్తి బాబా తప్ప మరెవరూ కాదు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment