జూన్ 25, 2011 లో సాయిమహరాజ్ కు సమర్పించిన దుస్తులు. ఆగస్టు, 17, 2012 లో వాటిని బాబాకు ధరింపచేశారు.
31.08.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ప్రతీరోజు ఏదోఒక బాబాలీలను గురించి మన బ్లాగులో ప్రచురిద్దామనే ఉంటుంది. కాని ఆంగ్లం లో ఉన్నవాటిని తెలుగులోనికి అనువాదం చేసి ప్రచురించడానికి చాలా సమయం తీసుకుంటుంది. కాని తెలుగులో ఉన్నవాటిని ప్రచురించడం తేలిక. అందు చేతనే సాయి.బా.ని.స. డైరీ, శిఖరాలు - లోయలలో శ్రీసాయి ప్రతీరోజు ప్రచురించడానికి వీలుపడింది.
ప్రస్తుతం కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ కూడా తెలుగులోనికి అనువాదం చేస్తున్నాను. అందుచేత రెండు పనులకి ఎంతో కొంత న్యాయం చేయడం జరుగుతోంది. ఒక్కోరోజు ప్రచురణ ఏమీ లేకపోయినా, యింతకు ముందు ప్రచురించిన బాబాలీలలను మరలా చదివి బాబా అనుగ్రహాన్ని పొందవలసినదిగా కోరుకుంటూ మీ అందరికీ బాబావారి ఆశీస్సులను అందచేయమని బాబాని మనసారా ప్రార్ధిస్తున్నాను.
ఈ రోజు సాయి సోదరి గీతాంజలిగారి షిరిడీ యాత్రా విశేషాలని మీముందు ఉంచుతున్నాను. ఇది హెతాల్ పాటిల్ రావత్ గారి బ్లాగులో ప్రచురింపబడినది. దాని తెలుగు అనువాదం మీకు అందిస్తున్నాను. ఆమె రాసిన అనుభూతి చాలా విస్తారంగా ఉండటంవల్ల రెండు భాగాలుగా ప్రచురిస్తున్నాను. దీనిని తెలుగులోనికి అనువాదం చేయడానికి సుమారు 4 గంటల సమయం తీసుకుంది. ఈ రోజు బందు వల్ల ఆఫీసు లేకపోవడం వల్ల ఇది సాధ్యమయింది. ఈ రోజు మొదటి భాగం చదవండి.
ఓం సాయిరాం
షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం - గీతాంజలి
సాయి సోదరి గీతాంజలి గారి
బాబా యొక్క అద్భుతమైన లీలను మనతో పంచుకుంటున్నారు.
ఫిబ్రవరి ఆఖరి వారం నుండీ
నేను నా షిరిడీ యాత్ర గురించి రాద్దామని అనుకున్నాను, కాని కొన్ని కారణాలవల్ల రాయలేకపోయాను. ఈ రోజు మీ బ్లాగు చదివినతరువాత ఇక ఆలశ్యము
చేయకూడదనిపించింది. నేను రాస్తున్న అనుభవం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి
పాఠకులని కాస్త ఓపిక పట్టి చదవవలసినదిగా కోరుతున్నాను.
మా షిరిడీ యాత్రలోని
అన్ని సంఘటనలలో ఏదీ మర్చిపోకుండా రాయడానికే ప్రయత్నించాను. ఈ లీలను చదివే పాఠకులందరికీ బాబా వారి అనుగ్రహం
లభించాలని కోరుకుంటున్నాను. బాబా, నీలీలను రాసేటంతటి తెలివిగలదానిని కాను. అందుచెత, బాబా నువ్వే నాచేతిని పట్టుకుని నీలీలను నువ్వే
వ్రాయించుకో.
పాఠకులారా, ఫిబ్రవరి నెలలో నా భర్త స్నేహితుడైన శ్రీ స్వామి అనే ఆయన
మాయింటికి వచ్చారు. ఆయన, ఆయన భార్య కలిసి
షిరిడీ వెడదామనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు చెప్పారు. వారు షిరిడీ వెళ్ళడం ఇదే
మొదటిసారి కనక, నావద్దనుండి షిరిడీ
గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలని వచ్చారు. ఏప్రిల్ నెలవరకు టికెట్స్ అన్ని బుక్
అయిపోయాయనీ, అందు చేత వారు తత్ కాల్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని చెప్పాను. లేకపోతే పూనా వరకు విమానంలో వెళ్ళి
అక్కడినుంచి బస్ లో గాని, టాక్సీ లో గాని
షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాను. ఆయనకీ విషయం చెపుతున్నపుడే నాకు కూడా షిరిడీ
వెళ్ళాలనే కోరిక కలిగింది. స్వామి గారు తాము రైలులోనే షిరిడీ వెడదామని
అనుకుంటున్నట్లు చెప్పి మే నెలవరకూ ఆగి అప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటామని
చెప్పారు.
నేను మవునంగా
ఊరుకున్నాను.
ఇప్పుడు చూడండి, పరిణామాలు ఎలా మార్పు చెందాయో. సాయి సత్ చరిత్రలో
చెప్పినట్లుగా బాబా పిలుపు వుంటే తన భక్తులను తన వద్దకు రప్పించుకోవడానికి ఆయనే
మార్గం చూపిస్తారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. స్వామి గారు
మాయింటికి మొదటిసారి వచ్చిన రెండు రోజుల తరువాత మరలా మాయింటికి వచ్చారు.
స్వామిగారు, తనకు బజారులో తన చిన్ననాటి స్నేహితుడు కనిపించాడని చెప్పారు .
అతని మామ గారు రైల్వే లో పని చేస్తున్నారనీ. తన మామగారి ద్వారా టికెట్స్ తెప్పించి
పెడతానని చెప్పాడనీ చెప్పారు. అందుచేత ఇప్పుడు తాను షిరిడీలో వసతి గురించీ, దర్శనం గురించి వీటి విషయాలను అడగడానికి మాయింటికి వచ్చారు. ఇదంతా
వినేటప్పటికి నాకు కూడా ప్రేరణ కలిగింది. నేను నా భర్తతో "నేను కూడా షిరిడీ
వెళ్ళనా" అని అడిగాను. "నీకు వెళ్ళాలని ఉంటే నువ్వు వెళ్ళు, నేను మాత్రం రాలేను, నన్ను అడగకు" అన్నారు. ఆయన స్నేహితుడు ఇది విని
"మీరు వస్తే మాకింకా సంతోషం" అని నన్ను ఉద్దేశింఛి అన్నాడు . నేనింతకు ముందు ఒకసారి షిరిడీ వెళ్ళి ఉండటంతో
వారికి ఎటువంటి కష్టమూ ఉండదు.
నిజానికి నాకెంతో
ఉత్సాహంగా ఉంది, కాని నాభర్త లేకుండా నాకు
వెళ్ళాలనిపించక సందిగ్ధావస్థలో పడ్డాను. అందుచేత స్వామిగారితో, నేను ఆలోచించుకుని ఏవిషయం ఒక రోజులో చెపుతానని చెప్పాను. ఈ
లోగా స్వామిగారి భార్య కూడా వచ్చి తమతోపాటు షిరిడీ రమ్మనమని బ్రతిమాలింది. మా
అత్తమామలని అడిగి అప్పుడు చెపుతానని చెప్పాను ఆవిడకి. నేను మా అత్తగారిని అడిగాను. అందుకావిడ "నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు,
కాని ఒంటరిగా మాత్రం వెళ్ళకు, నీతోపాటుగా వెళ్ళమని నీ భర్తకు చెపుతాను" అన్నారు. ఏమయినప్పటికీ స్వామిగారి స్నేహితుని
మామగారు మాకు ఎన్ని టిక్కెట్లు ఇప్పించగలరు అన్నదే ప్రశ్న. నేను నాభర్తతో "
తెప్పిస్తే కనక 4 టిక్కెట్లూ
తెప్పించమనండి లేకపోతే మీ స్నేహితుడిని, అతని భార్యనే షిరిడి వెళ్ళమనమని మీ స్నేహితునికి చెప్పండి. బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెడదాము
మనం" అన్నాను. నాభర్త అప్పటికే తన స్నేహితునితో 3 టిక్కెట్లు బుక్ చేయమని చెప్పారట. అందుచెత నన్ను ఇంక
వెనక్కి తగ్గవద్దని చెప్పారు. నన్ను షిరిడీ వెళ్ళి చక్కగా బాబా దర్శనం చేఉసుకుని
రమ్మని చెప్పారు. ఈ సంభాషనంతా
మంగళవారమునాడు జరిగింది, మేము అనుకున్న ప్రకారం మేము గురువారం రాత్రి బయలుదేరాలి. బుధవారం రాత్రి నా భర్త నాకు టికెట్
బుక్ అయిందనీ నన్ను మరునాడు వాళ్ళతో షిరిడీకి బయలుదేరమని చెప్పారు. నాభర్త లేకుండా
నాకు వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేదు. నేను స్వామిగారితో నాటిక్కెట్టు కాన్సిల్
చేయమనీ నేను రాలేకపోతున్నందుకు క్షమించమని స్వయంగా చెప్పాను. అయితే నీభర్త ఒక్కరే
షిరిడీ రావాలన్నమాట అని స్వామిగారు అన్నారు. నా భర్త నాతో ఇదంతా నవ్వులాటకి అన్నారు.
నిజానికి తనకు కూడా టిక్కెట్టు బుక్ చేయించుకున్నారు. బాబా
దర్శనం ఒక్కటే
కాదు, నేను నా భర్తతో కూడా
షిరిడీ వెడుతున్నందుకు ఎంతో సంతోషం కలిగింది.
ఆన్ లైన్ ద్వారా మేము
దర్శనానికి, ఆరతికి బుక్
చేసుకున్నాము. కాని మాకు ద్వారావతిలో బస దొరకలేదు. షిరిడీ వెళ్ళాక బస సంగతి
చూసుకోవచ్చులే అనుకున్నాము. మా ప్రయాణం
ప్రకారం మా రైలు శుక్రవారం మధాహ్న్నానికి
షిరిడీ చేరుతుంది, తిరుగు ప్రయాణంలో మేము
కోపర్గావ్ నుంచి శనివారం సాయంత్రం రైలుకు బయలుదేరాలి. బాబా దయవల్ల, మేము ఇంటినుంచి బయలుదేరేటప్పుడు మాదగ్గిర వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాటికి సంబంధించిన టిక్కెట్లు ఉన్నాయి. ఇది మెదటి లీల.
మా రైలు బెంగళూరులో
రాత్రి 7.30 కి బయలుదేరుతుంది. ఆరోజు
వర్కింగ్ డే మూలాన స్వామిగారు, ఆయన భార్య,
నా భర్త ఆఫీసులకు వెళిపోయారు. ఆఫీసునుంచి తిన్నగా మెజస్టిక్ స్టేషన్ కి రావాలి.
మరొక విషయమేమిటంటే నేను బాబాకి కోవా ఇద్దామనుకున్నాను. నా భర్తతో యింటికి వచ్చేటప్పుడు 1 కే.జీ. కోవా తీసుకురమ్మని చెప్పాను. దారిలో ట్రాఫిక్ జాం
వల్ల నా భర్త ఆలశ్యంగా 6.30 కి యింటికి
వచ్చారు. కోవా తీసుకురావడం మర్చిపోయారు. కోవా తీసుకురానందుకు నాకు చాలా నిరాశ
కలిగింది. మాయింటికి స్టేషన్ దూరంలో ఉండటంవల్ల సరైన సమయానికి స్టేషనుకు
చేరుకోలేమోనని నాకు ఆందోళనగా ఉంది.
మేము యింటినుంచి
మామరిదితో కారులో 6.45 కి బయలుదేరాము. ఆ
సమయంలో అందరూ ఆఫీసులనుంచి తిరిగి వచ్చే వేళ కావడంతో ట్రాఫిక్ లో మేము చాలా సేపు
చిక్కుకుపోయాము.
నా భర్త స్వామిగారికి
ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అని
అడిగారు. తాను కూడా దారిలో ఉన్నాననీ, రైలు బయలుదేరేవేళకి స్టేషన్ కి చేరుకుంటానని చెప్పారు. ఆయన భార్య కూడా ఆటోలో వస్తూ దారిలో ఉంది.
ట్రాఫిక్ లో చాలా ఆలశ్యం అయిపోవచ్చని భావించి నాభర్త దగ్గరలో ఉన్న బెంగళూరు
కంటొన్మెంట్ స్టేషన్ కి వెడదామని చెప్పారు. దీని వల్ల మాకు సమయం కలిసివచ్చి సరైన
టైముకి రైలు అందుకోగలుగుతాము. నిమిష నిమిషానికి నాలో ఆశ సన్నగిల్లుతోంది. ఒక
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 10 నిమిషాలు
ఆగిపోవలసివచ్చింది. అక్కడినుంచి ఆటో లో తొందరగా, మూడవ స్టాప్ యెలహంక స్టేషన్ కి సరిగా 8.15 కి రైలు చేరుకుంటుందని, సరిగా ఆటైముకి రైలు అందుకోవచ్చని చెప్పారు.
టైము 7.25 అయింది. మేము
స్వామికి ఫోన్ చేసి రైలు సిధ్ధంగా ఉందా అని అడిగాము.
తాను అప్పుడే స్టేషన్ కి చేరుకుని
రైలు ఎక్కినట్లు చెప్పారు. తన
భార్య ఇంకా స్టేషన్ కి రాలేదని చెప్పారు. మరొక 5 నిమిషాలలో రైలు బయలుదేరుతుందనీ, ఆలోగా తన భార్య, మేము కూడా రైలు అందుకోలేమని ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకవేళ తాను స్టేషన్ కి చేరుకోలేకపోతే 3 వ. స్టేషన్ లో మాకు టిక్కెట్లనిచ్చి షిరిడీ కి వెళ్ళమని
తన భార్య చెప్పిందని స్వామిగారు చెప్పారు. ఇప్పుడు స్వామి తప్ప మేమెవరమూ రైలు
ఎక్కలేదు. మేమింక మాప్రయాణం
మానుకోవలసిందేనని అనుకున్నాము. 7.35 కి మేము మళ్లి స్వామికి ఫోన్ చేసి తన భార్య వచ్చినదా లేదా అని, రైలు బయలుదేరిందా లేదా అని అడిగాము. తన భార్య అప్పుడే
వచ్చిందనీ, రైలు 10 నిమిషాలు ఆలశ్యంగా బయలుదేరుతుందని చెప్పారు స్వామిగారు.
ఒకవేళ మేము రైలు అందుకోలేకపోతే వాళ్ళని షిరిడీ వెళ్ళిపొమ్మని చెప్పాము.
ట్రాఫిక్ బాగా రద్దీగా
ఉండటం వల్లా, మా ఆటో చాలా మెల్లిగా
వెడుతూండటంవల్లా, మేము మూడవ స్టేషనుకైనా
చేరుకుంటామనే ఆశకూడా పోయింది. మేము స్వామికి ఫోన్ చేసి రెండవ స్టేషన్ రాగానే మాకు
ఫోన్ చేయమని చెప్పాము. 7.55 కి ఫోన్ చేసి
రైలు రెండవ స్తేషన్ ని సమీపిస్తోందని చెప్పారు. మేమిక స్టేషన్ కి చేరుకుంటామనగా ఆ
క్షణంలోనే జరిగింది అనుకోని సంఘటన (చిన్న ట్విస్ట్). స్టేషన్ కి దగ్గరగా రెండు సిటీ బస్సుల వల్ల ట్రాఫిక్ జాం అయింది.
మేము చిన్న రోడ్డు మీద ఇరుక్కుపోయాము. ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. నా భర్త ఆటో
దిగి ట్రాఫిక్ ఆగిపోయిన చోటుకు వెళ్ళి ఆగిపోయిన బస్సులని ఒకదాని తరువాత ఒకటి
వెళ్ళమని సూచించారు. రెండు నిమిషాలలో
రోడ్డు మీద ట్రాఫిక్ యధాస్థితికి వచ్చింది. నాభర్త నా చేయి పట్టుకుని ఫరవాలేదు,
భయపడకు, నీకు నీబాబా దర్శనం చేయిస్తాను అని చెప్పారు. నమ్మకం ఉంచు
అన్నారు. రైలు అప్పటికే రెండవ స్టేషన్ నుంచి బయలుదేరింది. 15 నిమిషాలలో యెలహంక చేరుకుంటుంది. మేము
స్టేషన్ కి చేరుకునేటప్పటికి రైలు వస్తోందని అనౌన్స్ మెంట్ వినిపించింది.
ప్లాట్ ఫారమ్ మీద డైరీ
పార్లర్ షాపు ఉంది, నీకేమన్నా కావాలా అని అడిగారు. నేను చాలా ఆత్రుతలో ఉన్నాను.
అందుకే నాకేమీ వద్దని చెప్పాను. నాభర్త డైరీ పార్లర్ నుంచి ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున 10 కోవా పెట్టెలు తీసుకుని వచ్చారు. షాపులో చిన్న పాకెట్లే ఉన్నాయనీ, అందుకే అవితీసుకువచ్చాననీ చెప్పారు. మేము బయలుదేరడానికి
ముందే బాబా నాకోరికను ఆవిధంగా తీర్చినందుకు నేనెంతో ఆనందపడ్డాను.
స్వామి దంపతులని చూసాక
మామనసు ఆనంద పారవశంతో నిండిపోయింది. ఈ మా రైలు ప్రయాణం ఇంతకు ముందెపుడూ చవిచూడని
ఒక విధమైన గుండెలు ఝల్లుమనిపించే అనుభూతి. ఇక మారైలు ప్రయాణం సాఫీగా జరిగి, శుక్రవారము మధ్యాహ్న్నం 1.30 కి కోపర్గావ్ చేరుకున్నాము. అక్కడినించి ఆటోలో షిరిడీ చేరుకున్నాము. కానీ
కోపర్గావ్ నించి బయలుదేరేముందు నేను తపోభూమిలో ఉన్న మందిరానికి వెడదామనుకున్నాను, కాని అందరూ బాగా అలసిపోయి ఉంటారని భావించి
తిరుగు ప్రయాణంలో చూడవచ్చులే అనుకున్నాను.
బాబా నామనోభావాలని
చదువుతున్నారనిపించింది. ఆటొ అతను ఆటోని తపోభూమి మందిరం ముందు ఆపి దాని చరిత్రను
కొంత చెప్పి,
షిరిడీకి వెళ్ళేముందు
అక్కడ దర్శనం చేసుకోమని చెప్పాడు. మాకు అక్కడ మంచి దర్శన భాగ్యం కలిగింది. తరువాత షిరిడీకి బయలుదేరాము.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment