27.10.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా సాయి
శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 3
మనమిప్పుడు భాగవతాన్ని ఒక్కసారి సమీక్షిద్దాము.
పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి ఏడు రోజులలో భాగవతాన్ని వినిపించి సద్గతిని కలిగించారు. సాయి సత్చరిత్రలో ఇటువంటి సంఘటనే ఎక్కడయినా ఉన్నదా అని మనము పరిశీలించినపుడు 31వ. అధ్యాయములో కనపడుతుంది.
1911 వ.సంవత్సరములో విజయానందుడు అనే సన్యాసి మద్రాసునుంచి బాబా దర్శనానికి వచ్చినాడు. అతనికి అంతిమ ఘడియలు సమీపించాయని బాబాకు తెలుసు. విజయానందుడిని రెండువారాలలో భాగవతాన్ని చదవమని బాబా సలహా ఇచ్చారు. ఆ సమయంలో , విజయానందునికి ఇంటినుండి అతని తల్లికి చాలా జబ్బుగా ఉన్నదని వెంటనే బయలుదేరి రమ్మనమని టెలిగ్రాము రావడంతో చాలా కలత చెందాడు.
అతను వెంటనే మద్రాసుకు బయలుదేరదలచి బాబా అనుమతిని కోరాడు. కాషాయ వస్త్రాలు ధరించినా కూడా ఇంకా ప్రాపంచిక విషయాలపై కోరికలెందుకు అన్నారు బాబా. అతని తల్లి అప్పటికే మరణించిందని బాబాకు తెలుసు. బాబా విజయానందునికి సద్గతిని కలుగచేయాలనుకున్నారు.
"ఆందోళన చెందకు. ప్రశాంతముగా ఉండు. రెండువారాలలో భాగవతం చదువు" అన్నారు బాబా.
ఆవిధంగా శుకమహర్షి ఒక్క వారములో పరీక్షిన్మహారాజుకు భాగవతాన్ని వినిపించి ఆయనకు సద్గతిని కలుగచేశారు. విజయానందుడు రెండువారాలలో భాగవతం చదవగానే అతనికి బాబా సద్గతిని కలుగచేశారు.
విజయానందునికే కాదు, తాత్యా సాహెబ్ నూల్కరు కు మేఘశ్యామునకు, పులికి కూడా మోక్షాన్ని ప్రసాదించారు. తాత్యాసాహెబ్ నూల్ కర్ మరణించినప్పుడు "అతనికింక పునర్జన్మ లేదు" అన్నారు బాబా.
1908 వరకు బాబా ఎవ్వరినీ కూడా తనను పూజించడానికి ఒప్పుకోలేదు. బాపూరావు అనే పిల్లవాడు ప్రతీరోజు బడికి వెళ్ళేముందు, తోటలొ పూసిన ఒక గులాబీ పువ్వును కోసి మారుతి దేవాలయములో మారుతి పాదాల వద్ద పెడుతూ ఉండేవాడు. ఒకరోజున బాపూరావు రెండు గులాబీ పువ్వులను కోసి, బడికి వెళ్ళేముందు ఒకటి బాబా శిరస్సుపై , మరొకటి మారుతి దేవాలయంలోనూ మారుతికి పాదాల వద్ద పెట్టినాడు. భక్తులంతా బాబా ను చూసి ఆపిల్లవాడు పూజించడానికి ఎందుకనుమతించారని ఆశ్చర్యపడ్డారు.
శ్యామా బాబాని ప్రశ్నించినపుడు, "ఆ చిన్న పిల్లవాడు నాలో భగవంతుని చూశాడు. ఈరోజునుంచి మీరుకూడా నాలో భగవంతుని చూడగలిగితే నన్ను పూజించండి" అన్నారు బాబా.
ఆరోజునుంచి బాబా తన భక్తులందరినీ తనను పూజించడానికి అనుమతించారు. భాగవతంలో ప్రహ్లాదుడు, ధృవుడు అనే ఇద్దరు బాలురు శ్రీమహావిష్ణువుని పూజించినట్లుగానే,
ఆరుసంవత్సరాలు బాపూరావు అనే బాలుడు, ఈ నాడు మనము బాబాను పూజించడానికి కారణమయ్యాడు.
మనమిప్పుడు భాగవతం విషయానికి వస్తే, సృష్టికర్తగా తనలో ఉన్న అహంకారాన్ని తొలగించమని బ్రహ్మ దేవుడు శ్రీ మహావిష్ణువు సహాయాన్నర్ధించాడు. బ్రహ్మ ఎటువంటి సంపదలను, ఫలితాలను ఆశించలేదు. శ్రీమహావిష్ణువు బ్రహ్మలోని అహంకారాన్ని తొలగించి అనుగ్రహించినారు. ఆతరువాత బ్రహ్మ తిరిగి తన సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించినారు.
ఇటువంటిదే మనకు శ్రీసాయి సత్చరిత్ర 3వ.అధ్యాయములో కనపడుతుంది. అన్నా సాహెబ్ ధాబోల్కర్ సాయి సత్ చరిత్రను వ్రాయడానికి ఉద్యమించాడు.
బాబా శ్యామాను పిలిచి అన్నాసాహెబ్ లోని అహంకారాన్ని తనపాదాల వద్ద పెట్టి, సాయి సత్చరిత్రను వ్రాయమని సలహా ఇచ్చినారు. అన్నాసాహెబ్ తనలోని అహంకారాన్ని తొలగించుకొన్న తరువాత బాబా ఆయనలో ప్రవేశించి బాబా తన జీవిత చరిత్రను తానే వ్రాసుకొన్నారు.
మరికొన్ని పోలికలు తరువాయి భాగంలో .....
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment