23.11.2012 శుక్రవారము
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరలా సాయితో మధురక్షణాలు -- చదివి క్షణ క్షణం స్మరించుకుంటూ ఉండండి. ఆకాలంలో మీరు ద్వారకామాయిలో ఉన్నట్లుగా ఊహించుకొని ఇప్పుడు చెప్పబోయే దృశ్యాన్ని కూడా కనులారా తిలకించండి. మనమంతా బాబాకు చెందినవారమని భావించుకోండి.
ఓం సాయిరాం
మొదటగా శ్రీవిష్ణుసహస్ర నామం 5వ. శ్లోకం మరియు తాత్పర్యము.
శ్లోకం : స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ||
పరమాత్మ తనంతట తానే పుట్టుచున్నాడు. శాంతియే తానై వ్యక్తమచుచున్నాడు. అదితి కుమారుడు, కలువ పువ్వులవంటి కన్నులు కలవాడు, శబ్ద స్వరూపమైనవాడు, మొదలు, తుది లేనివాడు. సృష్టి క్రమము ఏర్పరచువాడు లేక కల్పించువాడు, తానే సృష్టి కర్తయు అట్టి సృష్టి కర్తకు పాలకుడు అయి ఉన్నాడు.
@@@
శ్రీసాయితో మధురక్షణాలు - 5
శ్యామకర్ణ - అశ్వము
ఈ సాయినాధుని లీల (అంతుపట్టని లీల) అప్పుడు జరిగినదానిని మనమొక్కసారి మనోనేత్రంతో దర్శించుకోగలిగి అందులో కనక లీనమయిపోతే అది యదార్ధమేనని స్పష్టమవుతుంది.
మనము ద్వారకామాయిలోనికి ప్రవేశించగానే, బాబా పటానికి ప్రక్కనే కుడివైపున బాబావారి గుఱ్ఱం శ్యామ కర్ణ విగ్రహం కనపడుతుంది. నేను ద్వారకామాయిలోనికి వెళ్ళినపుడెల్లా, గుఱ్ఱం విగ్రహం వున్న బోను మీద చేయివేసి, బాబాచే అనుగ్రహింపబడిన శ్యామకర్ణను తాకుతున్న అనుభూతిని పొందుతూ వుంటాను.బాబా మనవ రూపంలో ఉన్నపుడు అప్పట్లోఉన్న ప్రతీభక్తుడు, ఇప్పటి ప్రతీ భక్తుడు, తాను బాబా కు చెందినవాడిగా ఉండాలని కోరుకుంటాడు. శ్యామ కర్ణ ఉందంతాన్ని తెలుసుకొన్న తరువాత ఎంతో అత్యున్నతమైనదిగా భావింపబడే మానవ జన్మ అమూల్యమైనదిగా అనిపిస్తుంది. బాబావారి అనుగ్రహం పొందిన ఈ గుఱ్ఱం బాబావారికి ప్రీతిపాత్రమైనది. దానికి బాబా అంటే ఎంతోయిష్టం. అలాగే బాబా కూడా దానిని ఎంతో ప్రేమతో చూసుకొనేవారు.
1912 వ. సంవత్సరంలో కాసం అనే గుఱ్ఱాల వ్యాపారి షిరిడీ దర్శించాడు. అతను తనతో కూడా ఒక ఆడ గుఱ్ఱాన్ని తీసుకొని వచ్చాడు. దానికి యింకా సంతానం కలుగలేదు. అతను తన గుఱ్ఱానికి సంతానం కలిగేలా అనుగ్రహించమని వేడుకొని, దానికి పుట్టిన మొదటి పిల్లని బాబావారికి బహుమతిగా సమర్పించుకుంటానని విన్నవించుకున్నాడు. శ్రీసాయి మహరాజ్ దాని నుదిటిపై ఊదీని రాసి, దీవించి, తరువాత దానికి నీటిలో ఊదీ కలిపి త్రాగించారు. బాబా అనుగ్రహంతో ఆగుఱ్ఱానికి వరుసగా పిల్లలు కలిగాయి. కాసం తను బాబాకి చేసిన వాగ్దానం ప్రకారం దానికి పుట్టిన మొదటి పిల్లను బాబా వద్దకు తీసుకొని వచ్చి సమర్పించుకొన్నాడు. బాబా దానికి శ్యామకర్ణ అని నామకరణం చేశారు. దాని శరీరం గోధుమ రంగులో ఉండి, చెవులు నల్లగా ఉండేవి.
ఈ గుఱ్ఱం యొక్క బాగోగులన్నీ చూడటానికి షిరిడీవాసియైన నానా సాహెబ్ ఖగ్ జీవాలే కి బాధ్యత అప్పగించబడింది. అతను ఆగుఱ్ఱానికి, బాబాకు నమస్కారం ఎలా చేయాలో నేర్పించాడు. ఆరతి సమయంలో శ్యామకర్ణ ఆరతి ప్రారంభమవడానికి ముందే ద్వారకామాయి సభామండపంలోకి వచ్చి నుంచునేది. ఆరతి ప్రారంభమయాక అది తన కాళ్ళకు కట్టిన గజ్జెలతో శబ్దం చేస్తూ వేడుకగా నాట్యం చేస్తూ ఉండేది. ఆరతి పూర్తికాగానే అది ద్వారకామాయి మెట్లు ఎక్కి బాబాకి నమస్కారం చేసేది. బాబా దానినుదుటిమీద ఊదీ వ్రాసి ఆశీర్వదించేవారు. తరువాత మిగిలిన భక్తులందరూ కూడా ఊదీ ప్రసాదం తీసుకొని వెళ్ళేవారు.
చావడి ఉత్సవాలు జరిగేటప్పుడు శ్యామకర్ణని పూసల దండతోను, కాళ్ళకు గజ్జెలతో,తోకకి అందమయిన గుడ్డ కట్టి సుందరంగా పూర్తిగా అలంకరించేవారు. ఆదృశ్యం నిజంగా ఎంతో చూడదగిన దృశ్యం. ఊరేగింపులో చావడి వరకు అది నాట్యం చేస్తూ వెడుతూ ఉండేది. బాబా ఒకసారి చావడిలోకి ప్రవేశించగానే అది బయట బాబా వైపుకు తిరిగి నిలబడి ఉండేది.
బాబా మహా సమాధి అయిన తరువాత శ్యామకర్ణ ప్రతిరోజు సమాధిమందిరానికి వెడుతూ ఉండేది. అక్కడ అది కనుల వెంట కన్నిరు కార్చుతూ మవునంగా కొంతసేపు నిలబడేది. అయినప్పటికీ అది ప్రతిరోజూ ఆరతికి వస్తూ చావడి ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఉండేది.
శ్రీ ఎం.ఎస్.ఘోలప్ అనే ఆయన సాయిలీల పత్రికకు, బాబా భక్తుడయిన శ్రీవిఠ్ఠల్ యశ్వంత్ దేశ్ పాడే (దాదర్, ముంబాయి) గారిని యింటర్వ్యూ చేశారు. శ్యామకర్ణ గురించిన సమాచారం సాయిలీల మాసపత్రిక 1982, ఫిబ్రవరి సంచికలో ఇవ్వడం జరిగింది.
"షిరిడీలో నేను చూసిన ఒక దృశ్యాన్ని జీవితంలో మరచిపోలేను. బాబావద్ద శ్యామకర్ణ అనే గుఱ్ఱం వుంది. అందమైన చక్కని దుస్తులతో అలంకరింపబడ్డ శ్యామకర్ణ ఆరతిసమయం లో ద్వారకామాయి బయట నిలబడుతూ ఉండేది. విచిత్రాలలో కెల్లా విచిత్రమేమంటే ఆరతి పూర్తి అయేవరకూ అది కదలకుండా మవునంగా శబ్దం చేయకుండా నిలబడి వుండేది. ఆరతి సమయంలో మౌనంగా దేనినో ఉచ్చరిస్తున్నట్లుగా విచిత్రంగా దాని పెదవులు కదులుతూ ఉండేవని. చాలా అరుదుగా ఆదృశ్యాన్ని చూసే అవకాశం కలిగేదని కొంతమంది భక్తులు చెప్పారు. ఆరతి పూర్తయిన తరువాత చోప్ దార్ (యితను ప్రత్యేకమయిన దుస్తులతో మిగతా చాచ్ మెన్ లకన్నా భిన్నంగా ఉండి, పూజా సమయంలో ప్రత్యేకమయిన విధులు నిర్వహిస్తూ ఉంటాడు) రాగ యుక్తంగా ముగింపు మాటలను చెప్పడం ముగియగానే, శ్యామకర్ణ ముందరి రెండు కాళ్ళను మడిచి తన నుదిటితో ద్వారకామాయి నేలను తాకేది.
1945 లో ఈ ప్రియమైన అశ్వం మరణించింది. లెండీబాగ్ లో దానికి సమాధి నిర్మించారు. ద్వారకామాయిలో ఉన్న ఈ విగ్రహాన్ని షిరిడీవాసి శ్రీబాలా సాహెబ్ షుల్ ల్తే సమర్పించారు.
శ్రీ కె.ఎం. అనబడే అప్పసాహెబ్ వార్తక్ అనే ఆయన బొంబాయి మరియు యితర ప్రాతాలలోని పెద్ద పెద్ద కంపెనీలకు ఆడిటర్. ఆయన శ్రీసాయిబాబా గారికి ప్రీతి పాత్రమయిన శ్యామ కర్ణ యిత్తడి విగ్రహాన్ని సాయి సంస్థాన్ వారికి బహూకరించారు. దానిని లెండీ బాగ్ లో బావి ప్రక్కన అందమైన తిన్నెమీద ప్రతిష్టించారు. ఆసుందరమైన విగ్రహాన్ని బొంబాయికి చెందిన ప్రఖ్యాత శిల్పి శ్రీకామత్ గారి కళాసృష్టి. గుఱ్ఱం విగ్రహం, దానికి నిర్మించిన దిన్నె కలిపి అయిన ఖర్చు రూ.2,000/-. ఈ ఖర్చునంతా శ్రీవార్తక్ గారు భరించారు.
సేకరణ
సంధ్యా ఉడ్ తా - హైదరాబాద్
0 comments:
Post a Comment