30.11.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయితో మధురక్షణాలు - 8
ముందుగా శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం 11వ. శ్లోకం, తాత్పర్యము.
శ్లోకం: అజః సర్వేశ్వరః సిధ్ధః సిధ్ధిః సర్వాదిరచ్యుతః
వృషా కపి రమే యాత్మా సర్వయోగ వినిస్సృతః ||
తాత్పర్యము: పరమాత్మను పుట్టనివానిగనూ, అన్నిటికినీ అధిపతిగనూ, సాధింపబడిన మరియూ సాధించుటయను రెండునూ తానే యైనవాడుగ, అన్నిటికన్నా మొదటగా నున్నవాడుగ, జారిపోవుట లేనివానిగా, వర్షములు కలిగించి మరల నీటిని స్వీకరించువానిగ, కొలత కందని ఆత్మ తత్త్వము కలవానిగ, అన్ని లోకములయందలి సామ్యముగా, సృష్టిని పుట్టించువానిగా, ధ్యానము చేయవలయును.
శ్రీసాయితో మధుర క్షణాలు 8వ.భాగములో పేరు చెప్పడానికిష్టపడని బాబా భక్తులు చెప్పిన లీలలలో 3వ. లీల.
బాబావారి అనుగ్రహపు జల్లు నామీద నిరంతరం ఎంతగా కురుస్తోందంటే, ఆయనతో నాకు కలిగిన అనుభూతిని, వాటిలో నుండి ఏది నిర్ణయించుకొని చెప్పాలో కష్టం.
ఇటీవలి సంవత్సరాలలో సాయిబాబా నాకు దర్శనమిచ్చినవాటిలో మహదీ బువాగారికి కి కూడా సంబంధించినది ఒకటి ఉంది. నేను మహదీ బువాగారి వద్దకు వెళ్ళి కొంత సమయం ఆయనతో గడిపి వస్తూ ఉండేవాడిని. 1943 ప్రాంతంలో ఒకరోజు నేను మహదీ బువాగారిని కలుసుకున్న తరువాత, అక్కడినుంచి నేనొక్కడినే హోటల్ లో భోజనం చేయడానికి బయలుదేరాను. బ్రహ్మచారిని అయినందువల్ల, హోటల్లో భోజనం చేయవలసిన పరిస్థితి వచ్చి, నేను స్వయంగా వండి బాబాకు నైవేద్యం పెట్టే అవకాశం లేకుండా పోయిందే అని ఒక్కక్షణం అకస్మాత్తుగ నామనసుకు అనిపించింది.
ఇలా ఈ పరిస్థితి వచ్చినందుకు చాలా ఖిన్నుడినయి, వంటరిగా నేనొక్కడినే భోజనం చేస్తున్నందుకు క్షమించమని బాబాను ప్రార్థించాను.
అకస్మాత్తుగా, నా ఆశ్చర్యానికనుగుణంగా, నా బల్లకెదురుగా మహదీబువ గారు, బాబా, ఇద్దరూ భోజనం చేస్తూ ఉండటం చూశాను. మొట్టమొదటగా నాకెంతో సంతోషం కలిగింది. తరువాత నన్ను నేనే నిందించుకొన్నాను. అఱచేతులతో కణతలు నొక్కుకొని, కన్నీళ్ళతో "బాబా నేను పాపిని" అన్నాను బాబాతో. ఇక్కడ మీరు భోజనం చేస్తున్నట్లుగా నాకు దర్శనమిచ్చి , నాకు మీరు ప్రసాదించిన ఇంతటి గొప్ప గౌరవానికి నేను తగను. కొద్ది సమయంలోనే బాబా, మహదీబువా ఇద్దరూ అదృశ్యమయారు. ఆరోజున బాబా, మహదీబువా వాస్తవంగా హోటల్ కి వచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకొని హోటల్ నుండి బయటకు వచ్చాను. అలా నిశ్చయించుకొని నేను మహదీ బువా గారి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్పి, "ఆ దృశ్యం నిజమేనా"" అని ఆయనను అడిగాను. బాబా మీద నాకున్నటువంటి అత్యంత భక్తి, బాబాతో నాకున్నటువంటి తీవ్రమయిన, నిరంతరమయిన ఏకాగ్రత వల్లనే ఆయన దర్శనం కలిగిందని, అది నిజమేనని చెప్పారు. అయినప్పటికీ నేనాయనను ఒక ప్రశ్న అడిగాను "మీరు కూడా కనిపించారు కదా? మీరెందుకు వచ్చారు?" తాను ఆరోజు భౌతిక శరీరంతో హోటల్ కు రాలేదని ఒప్పుకున్నారు. ఇంకా ఆయన, బాబా తన అద్భుతమయిన శక్తితో ఒకే సమయంలో రెండు శరీరాలను ధరించగలరని చెప్పారు.
క్రింద శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీ గారి వివరణ.
బొంబాయిలో నివసిస్తున్న, పేరు చెప్పడానికిష్టపడని ఈ నిజమైన భక్తుడిని నేను చూశాను. ఆయన చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను.
సాయిసుధ
మార్చ్, 1950
సాయిసుధ
ఏప్రిల్, 1950
(ఇంకా క్షణ క్షణం మధుర క్షణాలకు ఎదురు చూడండి)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment